హిందువుల ఆగ్రహం.. మైనారిటీలు దూరం: కేరళలో కుప్పకూలిన ఎర్రకోట!
x

హిందువుల ఆగ్రహం.. మైనారిటీలు దూరం: కేరళలో కుప్పకూలిన 'ఎర్రకోట'!

కమ్యూనిస్టుల పరిస్థితి రెండింటికీ చెడ్డ రేవడిలా తయారైంది. అటు హిందువులు దూరమయ్యారు, ఇటు మైనారిటీలు నమ్మకం కోల్పోయారు..


దేశంలో ఉన్న ఏకైక కమ్యూనిస్టు కూటమి సర్కారు కుప్పకూలింది. 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి ఎల్.డి.ఎఫ్.) భారీ ఓటమి పాలైంది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇది కేవలం సాధారణ ఓటమి కాదు. కేరళ రాజకీయాల్లో సాంప్రదాయిక ఆల్టర్నేటింగ్ పవర్ నమూనా (UDF-LDF) తిరిగి పునరుద్ధరణ అయింది. LDF హ్యాట్రిక్ కల చెదిరింది.

అసలెందుకు ఎల్డీఎఫ్ ఓడినట్టు?

10 ఏళ్ల పాలన తర్వాత ఓటర్లలో మార్పు కోరుకునే ధోరణి బలంగా కనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికలపుడే ఈ ట్రెండ్ కనిపించింది. దీనికి నిరుద్యోగ సమస్య, అవినీతి ఆరోపణలు కూడా తోడయ్యాయి. 2025 లోకల్ బాడీ ఎన్నికల్లోనే LDFకి గట్టి షాక్ ఇచ్చి, 2026కి ముందస్తు సంకేతం ఇచ్చింది.

2025 సెప్టెంబర్‌లో శబరిమలలో బంగారు దోపిడీ ఆరోపణలు బయటపడ్డాయి. CPM సీనియర్ నాయకులకు ఇందులో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అరెస్టులు జరిగాయి.
హిందూ ఓటర్లు (ముఖ్యంగా మధ్య, దక్షిణ కేరళ) కేరళ సీఎం పినరయి విజయన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు ఇప్పుడు బయటపడింది. ఇది ఎల్డీఎఫ్ సాంప్రదాయ హిందూ వోట్ బ్యాంక్‌ను బలంగా దెబ్బతీసింది.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబం మీద ప్రత్యేకించి కుమార్తె వీణా విజయన్ కి చెందిన ఐటీ కంపెనీ Exalogic కంపెనీ, సీనియర్ మంత్రి పి.ఎ. మహమ్మద్ రియాజ్ అక్రమ లావాదేవీల ఆరోపణలు కూడా తోడయ్యాయి.
“పినరయిజం” అనే నినాదంతో కాంగ్రెస్ కు బాగానే కలిసి వచ్చింది. పినరయ్ విజయన్ నిరంకుశంగా పాలన సాగించారనే అర్థంలో కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రారంభించి కమ్యూనిస్టు కోటలను కూల్చినట్టు తెలుస్తోంది.
మైనారిటీ ఓట్లు పోయాయి...
సీపీఎం హిందూ అవుట్‌రీచ్ (సాఫ్ట్ హిందుత్వ) ప్రయత్నాలను మైనారిటీలు సహించినట్టు కనిపించలేదు. ముస్లిం ప్రాంతాల్లో (మలప్పురం వంటివి) ఎల్డీఎఫ్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు మళ్లింది. సెక్యులర్ ఇమేజ్ దెబ్బతిన్నట్టు ఓటర్లు భావించారు.
రాష్ట్ర అప్పులు భారీగా పెరగడం, బడ్జెటేతర అప్పులు తీసుకున్న తీరు జనాన్ని ఇబ్బంది పెట్టినట్టు కనిపిస్తోంది. ఉద్యోగాలు తగ్గాయి. యువత అవకాశాలు సన్నగిల్లాయి. వలసలు పెరిగాయి. ASHA వర్కర్స్ సమస్యలు పరిష్కారం కాలేదన్న ప్రచారం ఉధృతమైంది. వాయనాడ్ ల్యాండ్‌స్లైడ్ రిహాబిలిటేషన్ లో జాప్యం జరిగింది.
అన్నింటికీ పినరయి మీదే ఆధారపడటం వల్ల పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం పెరగలేదు. విడమర్చి చెప్పే నాయకత్వం కరవైంది.
ఇతర కారణాలు...
UDF బలమైన బూత్ లెవల్ మొబిలైజేషన్, ఓటింగ్ కు జనాన్ని తీసుకువచ్చే సమూహాలు లేకపోవడం ఎల్డీఎఫ్ ఓటమికి ఓ కారణం. బీజేపీ హిందూ ఓట్లను ప్రభావితం చేసి LDFని పరోక్షంగా దెబ్బతీసింది. LDF క్యాడర్‌లో నిరాశ, నిస్పృహలు కూడా పార్టీ ఓటమికి కారణం అయ్యాయి. చివరి క్షణంలో సీనియర్ లీడర్లు ఎల్డీఎఫ్ ను వదిలేసి సొంత దారులు వెతుక్కున్నారు.

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు కేరళలో వామపక్ష కూటమి ఓటమి పలానా కారణమని చెప్పలేం. శబరిమల స్కాండల్ హిందూ ఓటును ఊపిరి తీస్తే అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు మధ్య తరగతిని అపసవ్యం చేశాయి. మైనారిటీలు UDF వైపు మళ్లారు. పినరయి వ్యక్తిగత పాపులారిటీ ఉన్నప్పటికీ, పాలనలో జాప్యం, అవినీతి ఇమేజ్ ఓటమిని తప్పించలేకపోయింది.
ఇది కేరళ వామపక్ష కూటమి రాజకీయాలకు పెద్ద షాక్. భారతదేశంలో LDFకి మిగిలిన ఆఖరి బలమైన కోట కూలిపోయింది. UDF ఇప్పుడు “వెల్ఫేర్ విత్ అకౌంటబిలిటీ” నినాదంతో పాలన చేయాల్సి ఉంటుంది.


Read More
Next Story