Kadapa Steel | ఐదోసారి శంకుస్థాపన..సీమ కల సాకారానికి ముహూర్తం..
x
కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (ఫైల్)

Kadapa Steel | ఐదోసారి శంకుస్థాపన..'సీమ' కల సాకారానికి ముహూర్తం..

జూలై 3న మళ్లీ భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు


"కడప ఉక్కు... వెనుకబడిన రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చాల్సిన మహా యజ్ఞం! దశాబ్దాలు గడుస్తున్నా... ఇది కేవలం రాళ్లకే పరిమితమైంది. రాజకీయ పార్టీలకు బ్రహ్మాస్త్రంగా మారింది. ఒకే ప్రాజెక్టు... దశాబ్దాల కాలం... అరడజనుకు పైగా శంకుస్థాపనలు! అవును, జూలై మూడో తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరోసారి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. అసలు కడప ఉక్కు చరిత్రేంటి? ఇప్పటివరకు ఎవరెవరు కొబ్బరికాయలు కొట్టారు? టీడీపీ కూటమి ఈ ప్రాజెక్టును 2028 నాటికి పట్టాలెక్కిస్తామని చెబుతోంది.

కడప ఉక్కు కర్మాగారం అంటే రాయలసీమ నిరుద్యోగుల గుండె చప్పుడు మాత్రమే కాదు, అంతకుమించి అది ఏపీ రాజకీయాలకు ఒక అస్త్రం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం (బ్రాహ్మణి స్టీల్స్) నుంచి నేటి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వరకు... మూడు తరాల ముఖ్యమంత్రులు మారినా, పదే పదే శంకుస్థాపనల ‘టెంకాయలు’ పగులుతున్నాయే తప్ప, కర్మాగారం నుంచి ఉక్కు ముక్క బయటకు రావడం లేదు. ఉక్కు కర్మాగారం చరిత్ర ఏంటి? ఇప్పటివరకు ఎన్నిసార్లు, ఎవరెవరు కొబ్బరికాయలు కొట్టారు? నీటి కేటాయింపుల కథేంటి?

ఐదోసారి.. జూలై 3 న

ఒక ఫ్యాక్టరీకి ఇన్ని సార్లు శంకుస్థాపనలు జరగడం బహుశా దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి కావచ్చు! ఇప్పటివరకు ఎవరెవరు, ఎక్కడెక్కడ కొబ్బరికాయలు కొట్టారో ఓసారి చూద్దాం...

​2007 - వైఎస్ రాజశేఖర రెడ్డి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జమ్మలమడుగు మండలం అంబవరం వద్ద 'బ్రాహ్మణి స్టీల్స్' పేరుతో తొలిసారి శంకుస్థాపన చేశారు. గాలి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనా... ఆ తర్వాత వివాదాలతో నిలిచిపోయింది.

​2018 - నారా చంద్రబాబు నాయుడు: విభజన చట్టం ప్రకారం కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోవడంతో, నిరసనగా రాష్ట్ర ప్రభుత్వమే కడప ఉక్కు నిర్మిస్తుందని చంద్రబాబు జమ్మలమడుగు సమీపంలోని కంబాలదిన్నె వద్ద శంకుస్థాపన చేశారు.

​2019 - వైసీపీ అధికారంలోకి వచ్చాక, గత శంకుస్థాపనలను పక్కనబెట్టి... ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద 'వైఎస్సార్ కడప స్టీల్ ప్లాంట్' కు శంకుస్థాపన చేశారు.

​2023 - మళ్లీ వైఎస్ జగన్: జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్‌తో ఒప్పందం కుదిరిందంటూ... అదే సున్నపురాళ్లపల్లె వద్ద జగన్ మరోసారి భూమి పూజ చేశారు.

2026 (జూలై 3) - నారా చంద్రబాబు నాయుడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జూలై 3న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు వద్దే మళ్లీ శంకుస్థాపన చేయడానికి సర్వం సిద్ధం చేశారు.

కీలక వనరులు..

కడప ఉక్కు కర్మాగారానికి అత్యంత కీలకమైనవి రెండు... ఒకటి ఇనుప ఖనిజం, రెండు నీరు! కడప ఉక్కు కర్మాగారానికి నీటి కష్టాలు రాకుండా ప్రభుత్వం పక్కా ప్లాన్ చేసింది.

జమ్మలమడుగు సమీపంలోని గండికోట రిజర్వాయర్ మైలవరం జలాశయం నుంచి ఈ ప్లాంట్‌కు నీటిని తరలించనున్నారు. ​గతంలోనే అధికారిక ఉత్తర్వులు (GO) కూడా జారీ అయ్యాయి. ప్లాంట్ అవసరాల కోసం గండికోట - మైలవరం జలాశయాల నుంచి 2 టీఎంసీల (2 TMC) నీటిని కేటాయిస్తూ స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారు. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైలవరం, గండికోట ( Gandikota ) జలాశయం నుంచి నీటి సరఫరాకు ప్రత్యేక పైప్‌లైన్లు, పంపింగ్ వ్యవస్థను కూడా డిజైన్ చేశారు. నీటి లభ్యత విషయంలో ఎలాంటి ఢోకా లేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

ఇనుప ఖనిజం ఎక్కడి నుంచి?

ఇంత భారీ ప్లాంట్‌కు కావలసిన ప్రధాన ముడిసరుకు 'ఇనుప ఖనిజం' తరలించడానికి కూడా పక్కా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కడప ఉక్కు పరిశ్రమకు అవసరమైన హై-గ్రేడ్ ఇనుప ఖనిజాన్ని ప్రధానంగా OMC నుంచి, పొరుగునే ఉన్న అనంతపురం, బళ్లారి ప్రాంతాల నుంచి రైల్వే లైన్ల ద్వారా నేరుగా జమ్మలమడుగు ప్లాంట్‌కు తరలించేలా రవాణా నెట్‌వర్క్‌ను డిజైన్ చేశారు. ఏటా మిలియన్ టన్నుల కొద్దీ అవసరమయ్యే ఖనిజ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా మైనింగ్ సంస్థలతో ముందస్తు ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు."

కడప ఉక్కు ఫ్యాక్టరీ నుక పూర్తయితే కడప జిల్లా, రాయలసీమ యువత తలరాత పూర్తిగా మారిపోతుంది! ఈ ఉక్కు కర్మాగారం ద్వారా దాదాపు ఐదు వేల నుంచి ఎనిమిది వేల మందికి పైగా యువతకు నేరుగా ప్లాంట్‌లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ​పరోక్షంగా ప్లాంట్ చుట్టూ వచ్చే అనుబంధ పరిశ్రమలు, రవాణా (ట్రాన్స్‌పోర్ట్), హోటళ్లు, లాజిస్టిక్స్ రంగాల ద్వారా మరో 20,000 మందికి పైగా పరోక్ష ఉపాధి దొరుకుతుందని అంచనా వేస్తున్నారు.

Read More
Next Story