19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగొచ్చిన తస్లీమా నస్రీన్..
x
తస్లీమా నస్రీన్

19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగొచ్చిన తస్లీమా నస్రీన్..

'ఇదే నా ఇల్లు' అంటూ భావోద్వేగం


వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ దాదాపు 19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగి వచ్చారు. తన ఆత్మకథ 'ద్విఖండి'పై చెలరేగిన వివాదాలు, నిరసనల నేపథ్యంలో 2007లో కోల్‌కతాను విడిచి వెళ్లాల్సి వచ్చిన ఆమె.. ఇప్పుడు మళ్లీ అదే నగరంలో అడుగుపెట్టారు. కోల్‌కతా తనకు "ఇల్లు", "సొంత దేశం" లాంటిదని పేర్కొంటూ భావోద్వేగానికి గురయ్యారు.

శుక్రవారం (జూలై 31) న్యూఢిల్లీ నుంచి కోల్‌కతాకు చేరుకున్న తస్లీమా నస్రీన్‌కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అభిమానులు, మద్దతుదారులు స్వాగతం పలికారు. వారితో మాట్లాడిన ఆమె, చాలా ఏళ్ల తర్వాత కోల్‌కతాకు రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.

బంగ్లాదేశ్‌కు చెందిన తస్లీమా నస్రీన్ 1990లలో భారత్‌కు వచ్చారు. అనంతరం 2003లో ఆమె ఆత్మకథ 'ద్విఖండి' మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలతో అప్పటి వామపక్ష ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌లో నిషేధించింది. 2007లో ఆ పుస్తకంపై నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో ఆమె కోల్‌కతాను విడిచి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం 63 ఏళ్ల నస్రీన్ దీర్ఘకాలిక నివాస అనుమతితో న్యూఢిల్లీలో నివసిస్తున్నారు.

ఆగస్టు 1న కోల్‌కతాలో నిర్వహించే ఒక బహిరంగ కార్యక్రమంలో తస్లీమా నస్రీన్ పాల్గొననున్నారు. ఆ కార్యక్రమానికి బీజేపీ నేత సువేందు అధికారి, ప్రముఖ రచయిత శిర్షేందు ముఖోపాధ్యాయ్ హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆమెకు పౌర సన్మానం నిర్వహించడంతో పాటు, కవితలు చదివి, చర్చా కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు.

పర్యటనకు ముందు పీటీఐతో మాట్లాడిన తస్లీమా నస్రీన్, కోల్‌కతాకు తిరిగి రావడం తన సొంత దేశానికి వచ్చినట్లుగా అనిపిస్తోందని చెప్పారు. బెంగాల్‌ను తాను ఎప్పుడూ సరిహద్దులతో విభజించి చూడలేదని, తూర్పు బెంగాల్‌కు వెళ్లే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌నే తన ఇల్లుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

కోల్‌కతా తనకు ఒకప్పుడు ఇల్లు, స్నేహితులు, పాఠకులు అన్నీ ఇచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. తాను స్వచ్ఛందంగా నగరాన్ని విడిచి వెళ్లలేదని, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పంపించిందని చెప్పారు. ప్రభుత్వాలు మారినా, తిరిగి వచ్చే అవకాశం మాత్రం ఎన్నేళ్లుగా లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పర్యటన తన వ్యక్తిగత రాక మాత్రమే కాదని, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రతీకగా కూడా భావిస్తున్నట్లు తస్లీమా నస్రీన్ చెప్పారు. ఒక రచయిత స్వేచ్ఛ ఏ ప్రభుత్వ సిద్ధాంతంపైనా, ఏ మత సమూహం అనుమతిపైనా ఆధారపడకూడదని, అది ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కుగా రక్షించబడాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ పర్యటనకు సహకరించి భద్రత కల్పించిన నిర్వాహకులకు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

అయితే తస్లీమా నస్రీన్ పర్యటన రాజకీయంగానూ చర్చకు దారితీసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖ్రుజ్జమాన్ మాట్లాడుతూ, ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రచయిత్రికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఘన స్వాగతం పలుకుతోందని విమర్శించారు.

మరోవైపు బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్ మాత్రం ఈ పర్యటనకు మద్దతు ప్రకటించారు. గత ప్రభుత్వం లౌకికవాదం గురించి మాట్లాడినా, తస్లీమా నస్రీన్‌కు అవసరమైన భద్రత కల్పించలేదని విమర్శించారు. అలాగే టీఎంసీ ప్రభుత్వం వివిధ వర్గాలను రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుందని ఆరోపించారు

Read More
Next Story