కోల్ కతాలో తొక్కిసలాట, 19 మంది మృతి
x

కోల్ కతాలో తొక్కిసలాట, 19 మంది మృతి

భారీ వర్షంతో దుర్గా మండపంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన భక్తులు, గందరగోళంలో కిందపడటంతో ప్రమాదం


దుర్గా పూజా వేడుకలతో సందడిగా ఉండాల్సిన కోల్‌కతాలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తర కోల్‌కతాలోని చోర్ బాగన్ దుర్గా పూజా మండపం వద్ద జరిగిన తొక్కిసలాటలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలే ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో పాటు, బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది.

గాయపడిన వారిని చికిత్స కోసం కోల్‌కతా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను, వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి సువేందు అధికారి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు గ్రూప్‌-డీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అసలు ప్రమాదం ఎలా జరిగింది?

చోర్ బాగన్ సర్బజనిన్ దుర్గా పూజా మండపం వద్ద రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, పూజా నిర్వాహకులు లౌడ్‌స్పీకర్లలో చేసిన ప్రకటన వల్లే తొక్కిసలాటకు దారితీసినట్లు తెలిపారు. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, మొదట ప్రారంభమైన వర్షం క్రమంగా భారీ వర్షంగా మారింది. దీంతో భక్తులు వర్షం నుంచి తప్పించుకునేందుకు మండపం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ గందరగోళం ఏర్పడి, కొందరు కిందపడటంతో తొక్కిసలాట తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు, మండపం పరిసరాల్లో పోలీసుల భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని కొందరు భక్తులు ఆరోపించారు. చిత్తరంజన్ అవెన్యూ నుంచి వెళ్లే మార్గం ఇరుకుగా ఉండటంతో అక్కడికి భారీగా తరలివచ్చిన భక్తులను నియంత్రించడం కష్టంగా మారిందని తెలుస్తోంది. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు విజిల్ ఊదడంతో మండపంలోకి వెళ్లేందుకు వేచి ఉన్నవారు ఒక్కసారిగా ఒకేచోటకు చేరే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి వివరించారు.

విచారణకు ప్రత్యేక కమిటీ

ఈ ఘటనకు సంబంధించి దుర్గా పూజా నిర్వాహకులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, విధుల్లో ఉన్న సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి, ఫోరెన్సిక్, ఎస్టీఎఫ్, అగ్నిమాపక శాఖల బృందాలతో ప్రాథమిక విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

కలకత్తా హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ సమర్పించే నివేదిక, సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.

అమిత్ షా పర్యటన వాయిదా

తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు ఇతర అధికారిక కార్యక్రమాలను కూడా వాయిదా వేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అమిత్ షా అప్పటికే కోల్‌కతాలో ఉండగా, ఆదివారం దుర్గా పూజా మండపాన్ని సందర్శించాల్సి ఉంది. ప్రమాదం నేపథ్యంలో సంబంధిత మండపాన్ని మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇతర మండపాలకూ ఆంక్షలు

ఈ ఘటన తర్వాత భద్రతా చర్యల్లో భాగంగా వివిధ థీమ్‌లతో ఏర్పాటు చేసిన దుర్గా పూజా మండపాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దుర్గా పూజల సమయంలో కోల్‌కతాలోనే దాదాపు 3,500 మండపాలు ఏర్పాటు చేస్తారు. దీంతో ఇతర ప్రాంతాల్లోనూ భక్తుల భద్రతపై అధికారులు దృష్టి సారించారు.

రాజకీయంగా మారిన ఘటన

మరోవైపు, ఈ ప్రమాదంపై ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్‌లోని మమతా బెనర్జీ వర్గం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి మేనల్లుడు దేబాదీప్ అధికారికి, చోర్ బాగన్ పూజా కమిటీకి సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. పూజా కమిటీకి బీజేపీ ఎమ్మెల్యేనే చైర్మన్‌గా ఉన్నారని పేర్కొంది.

ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్ష వర్గం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేసింది.

ప్రస్తుతం ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా ప్రమాదానికి గల కారణాలు, భద్రతా లోపాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Read More
Next Story