
మమతా బెనర్జీని ఇరుకున బీజేపీ సర్కార్ ఇరుకున పెడుతుందా?
నాలుగేళ్ల కాగ్ నివేదికలు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సువేందు సర్కార్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 28 కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలను ప్రవేశపెట్టింది. ఈ నివేదికల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఫ్లిప్‌కార్ట్‌కు భూ కేటాయింపులు, కోవిడ్ నిధుల వినియోగం వంటి అంశాలపై పలు కీలక పరిశీలనలు నమోదయ్యాయి.
గత టీఎంసీ ప్రభుత్వం 2020-21 నుంచి 2024-25 వరకు నాలుగు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన కాగ్ నివేదికలను అసెంబ్లీలో ఉంచలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వపన్ దాస్‌గుప్తా తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన బాధ్యతలో భాగంగా వాటిని సభ ముందుకు తీసుకొచ్చిందని, త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించి నివేదికలపై విస్తృతంగా చర్చిస్తామని ఆయన వెల్లడించారు.
కాగ్ నివేదికల ప్రకారం, 2015-16 నుంచి 2024-25 వరకు పశ్చిమ బెంగాల్ జీఎస్‌డీపీ గణనీయంగా పెరిగినప్పటికీ, అదే సమయంలో రాష్ట్రం వరుసగా రెవెన్యూ లోటును ఎదుర్కొంది. అలాగే రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్లకు పైగా రుణభారం కొనసాగుతోందని నివేదికలు పేర్కొన్నాయి.
2024-25 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ మొత్తంలో గణనీయమైన నిధులు ఖర్చు కాకుండా మిగిలిపోయాయని కాగ్ వెల్లడించింది. అదనపు వ్యయాలకు అవసరమైన శాసనపరమైన ఆమోదం తీసుకోలేదని కూడా నివేదిక పేర్కొంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద విడుదలైన నిధుల్లో వేల కోట్ల రూపాయలు వినియోగం కాకుండా బ్యాంకు ఖాతాల్లోనే నిల్వ ఉన్నాయని వెల్లడించింది.
హరింఘాట ఇండస్ట్రియల్ పార్క్‌లో ఫ్లిప్‌కార్ట్ లాజిస్టిక్స్ విభాగానికి భూమి కేటాయింపు సందర్భంగా డబ్ల్యూబీఐడీసీఎల్ తన ధరల విధానాన్ని సక్రమంగా అమలు చేయకపోవడంతో ప్రభుత్వానికి రూ.12.86 కోట్ల నష్టం జరిగిందని మరో కాగ్ నివేదిక తెలిపింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణతో కాగ్ ఏకీభవించలేదు.
టీఎంసీ ప్రభుత్వ హయాంలో అమలైన 'స్వస్థ్య సాథీ' ఆరోగ్య బీమా పథకంలో కూడా పలు లోపాలను కాగ్ గుర్తించింది. ప్రైవేట్ ఆసుపత్రులకు అధిక చెల్లింపులు, లబ్ధిదారుల నమోదులో అవకతవకలు, ఆధార్ అనుసంధానం పూర్తికాకపోవడం, బీమా సంస్థల నుంచి తిరిగి రావాల్సిన నిధులు వసూలు చేయకపోవడం వంటి అంశాలను నివేదిక ప్రస్తావించింది. అలాగే పథకం నిర్వహణలో లోపాల కారణంగా అదనపు ఆర్థిక భారం పడినట్లు పేర్కొంది.
కోవిడ్ మహమ్మారి సమయంలో పీఎం కేర్స్, సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్లలో అనేకవి సకాలంలో పనిచేయలేదని కాగ్ వెల్లడించింది. కోవిడ్ అత్యవసర ప్యాకేజీ కింద విడుదలైన నిధుల్లో కూడా గణనీయమైన మొత్తం ఖర్చు కాకుండానే మిగిలిపోయినట్లు నివేదికలో పేర్కొంది.
అసెంబ్లీలో నివేదికలు ప్రవేశపెట్టిన సందర్భంగా కాగ్ నివేదికలను ఇంతకాలం సభలో ఉంచకపోవడం రాజ్యాంగపరమైన లోపమని స్వపన్ దాస్‌గుప్తా వ్యాఖ్యానించారు. ఆడిట్ నివేదికల్లో అవకతవకలకు సంబంధించిన ఆధారాలు ఉన్న చోట చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో నివేదికల్లో ప్రస్తావించిన అంశాలపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

