
బెంగళూర్ ట్రాఫిక్ కష్టాలకు ‘డబుల్’ చెక్
మెట్రో, ట్రాఫిక్ కోసం ప్రత్యేక ప్లై ఓవర్ల నిర్మాణం పూర్తి
భారత సిలికాన్ సిటీగా పేరు పొందిన బెంగళూర్ లో ట్రాఫిక్ కష్టాలకు కాస్త చెక్ పడింది. సిల్క్ బోర్డు జంక్షన్ వద్ద ఉన్న డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఇప్పుడు పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభించింది.
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) అభివృద్ధి చేసి, అఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్, నగర పట్టణ రవాణా వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
దక్షిణ భారతపు మొట్టమొదటి ఈ రోడ్డు-కమ్-రైల్ నిర్మాణంలో ఐదు ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఫ్లైఓవర్లు డి - ఇ ఇప్పుడు ట్రాఫిక్ కోసం తెరవడంతో, ఔటర్ రింగ్ రోడ్, సెంట్రల్ సిల్క్ బోర్డ్ జంక్షన్ వెంబడి ఉన్న సిల్క్ బోర్డ్ ఫ్లైఓవర్ నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో పనిచేస్తోంది. ఇది నగరంలోని అత్యంత రద్దీగా ఉండే కారిడార్లలో ఒకదానిలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తోంది.
ఐదు అంచెల నిర్మాణం
“బెంగళూరులోని అత్యంత రద్దీ ఉన్న రెండు కూడళ్ల మధ్య ఐదు అంచెల నిర్మాణం నిర్మించడానికి కచ్చితత్వం, పట్టుదల నూతనత్వం అవసరమయ్యాయి,” అని అఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ అన్నారు.
మెట్రో - రోడ్డు ట్రాఫిక్ రెండింటినీ అనుసంధానించే ఈ ఫ్లైఓవర్, రాగిగుడ్డ- సిల్క్ బోర్డ్ మధ్య నడుస్తుంది. ఇది నగరం దక్షిణ ప్రాంతాల నుంచి ప్రయాణించే ప్రయాణికులకు ఒక కీలకమైన అనుసంధానంగా పనిచేస్తుంది. ఇది పై డెక్‌లో నమ్మ మెట్రో యెల్లో లైన్‌తో అనుసంధానించబడి ఉండగా, కింది స్థాయిలో వాహనాల రాకపోకలు సాగుతాయి.
నమ్మ మెట్రో బ్లూ లైన్‌లో భాగంగా, సెంట్రల్ సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గించే లక్ష్యంతో, అఫ్కాన్స్ సంస్థ సిల్క్ బోర్డ్–కేఆర్ పురం కారిడార్‌లో 9.8 కిలోమీటర్ల ఎలివేటెడ్ భాగాన్ని నిర్మించింది.
అనేక సవాళ్లు.. అయినప్పటికీ..
భారీ ట్రాఫిక్- పరిమిత పని ప్రదేశం కారణంగా నిర్మాణాన్ని దశలవారీగా చేపట్టాల్సి వచ్చిందని అఫ్కాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (డివిజనల్ హెడ్) డి. మురుగదాసన్ అన్నారు. ప్రతిరోజూ అర్ధరాత్రి నుంచి ఉదయం 5 గంటల మధ్య, కేవలం ఐదు గంటల సమయానికి మాత్రమే పనులు చేశామని తెలిపారు.
“ఐదు ఫ్లైఓవర్లు ఇప్పుడు పనిచేస్తున్నాయి. ప్రయాణికులు కనీసం 30 నిమిషాల ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఈ ఐదింటిలో, 28 మీటర్ల ఎత్తుతో ఫ్లైఓవర్ డి అత్యంత ఎత్తైనది. ఇది ఐదో స్థాయిలో ఉంది, ఇప్పటికే ఉన్న హోసూర్ ఫ్లైఓవర్, ఎల్లో లైన్ మెట్రో, డబుల్ డెక్కర్ నిర్మాణాన్ని దాటుతుంది” అని ఆయన అన్నారు.
భారీ ట్రాఫిక్, ఇప్పటికే ఉన్న రాజకాల్వ కారణంగా పరిమిత స్థలం, పనిచేస్తున్న మూడు ఫ్లైఓవర్లు, నిర్మాణంలో ఉన్న సెంట్రల్ సిల్క్ బోర్డ్ మెట్రో స్టేషన్ వంటి పరిమితులు ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టును కచ్చితత్వంతో పూర్తి చేశామని అంబరీష్ తెలిపారు.
అత్యంత రద్దీ కూడలి వద్ద ఫ్లైఓవర్..
హెబ్బాల్ జంక్షన్ తర్వాత, సెంట్రల్ సిల్క్ బోర్డ్ జంక్షన్ నగరంలో రెండవ అత్యంత రద్దీ గల ట్రాఫిక్ ఉంటుంది. మొత్తం 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఎ, బి, సి, డి, ఇ ఫ్లైఓవర్ల నిర్మాణం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ప్రవాహాన్ని గణనీయంగా తగ్గించేస్తుందని భావిస్తున్నారు.
2024 మధ్యలో ఎ, బి, సి అనే మూడు ఫ్లైఓవర్లను ప్రారంభించారు. ఇవి సిల్క్ బోర్డ్ సిగ్నల్‌ను వాహనాలు దాటవేయడానికి అనుమతించడం ద్వారా, రాగిగుడ్డ - బీటీఎం లేఅవుట్ నుంచి హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ ఎలక్ట్రానిక్ సిటీ వైపు కనెక్టివిటీని మెరుగుపరిచాయి.
డి - ఇ ఫ్లైఓవర్ల చేరికతో, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ నుండి బీటీఎంకు ప్రయాణించే ప్రయాణికులు ఇప్పుడు ఈ కూడలిలో చిక్కుకోకుండా ప్రయాణం చేయవచ్చు. ఈ సిగ్నల్ ప్రధానంగా హెచ్‌ఎస్‌ఆర్–మడివాల ఎలక్ట్రానిక్ సిటీ–హెచ్‌ఎస్‌ఆర్ మధ్య ట్రాఫిక్‌కు సేవలు అందిస్తుంది.
తద్వారా రద్దీని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ఫ్లైఓవర్ వ్యవస్థలో ఇవి ఉన్నాయి: ఫ్లైఓవర్ ఎ (రాగిగుడ్డ మెట్రో స్టేషన్ నుంచి హోసూర్ రోడ్ వరకు), ఫ్లైఓవర్ బి (ఫ్లైఓవర్ ఎ మీదుగా బీటీఎం లేఅవుట్ నుంచి హోసూర్ రోడ్, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ వరకు), ఫ్లైఓవర్ సి (ఫ్లైఓవర్ ఎ నుంచి హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ వైపు వెళ్లే శాఖ), హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌ను రాగిగుడ్డకు కలిపే ఫ్లైఓవర్లు డి - ఇ, వీటితో పాటు బీటీఎం లేఅవుట్ వైపు ఒక డౌన్ ర్యాంప్ కూడా ఉంది.
Next Story

