
ముంబైలో శివసేన ప్రాధాన్యం తగ్గలేదా? BMC ఎన్నికలు ఏం చెబుతున్నాయి
BMC ఫలితాలతో శివసేన రాజకీయ ప్రాధాన్యం తగ్గలేదా? బీజేపీ ఆధిపత్యానికి పరిమితులు ఉన్నాయా? శివసేనతో కాంగ్రెస్ చేతులు కలిపితే ?
బీజేపీ(BJP) దూకుడు ప్రచారం, సంఖ్యాబలం ఉన్నా.. ముంబైలో శివసేన రాజకీయ ప్రాధాన్యం ఇంకా తగ్గలేదని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. మేయర్ పదవి కోసం జరిగిన రాజకీయ బేరసారాలు.. శివసేన(Shiv Sena)లోని మూడు వర్గాల బలం, బీజేపీ ఎదుర్కొంటున్న వ్యూహాత్మక పరిమితులు మహారాష్ట్ర రాజకీయాల దిశను నిర్దేశించేవిగా ఉన్నాయి.
అతిపెద్ద పార్టీగా అవతరించినా..
BMC ఫలితాలు జనవరి 16న వెలువడ్డాయి. మొత్తం 227 స్థానాలకు గాను బీజేపీ 89 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మీడియా వాళ్లు దాన్ని “బీజేపీ స్వీప్”గా చూయించారు. అయితే ఈ ఉత్సాహం ఎక్కువ కాలం నిలువలేదు. సంఖ్యాబలం ఉన్నా.. మేయర్ పదవి తమదేనని గట్టిగా చెప్పలేని పరిస్థితుల్లో కాషాయ పార్టీ ఉంది. బీజేపీ–షిండే సేన కలిపి 118 సీట్లు సాధించి మెజార్టీ మార్కు దాటినా.. మేయర్ పదవి విషయంలో అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి. తమ కార్పొరేటర్లు ప్రత్యర్థి పార్టీల కార్పొరేటర్లతో చేతులు కలుపకుండా ఉండేందుకు షిండే సేన ముంబైలోని ఖరీదైన హోటల్‌లో 29 మంది కార్పొరేటర్లను ఉంచడం రాజకీయ అనిశ్చితిని ప్రతిబింబిస్తుంది.
గతంలో అలా..
ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ 2019ని మరిచిపోకూడదు. అప్పట్లో ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. ముఖ్యమంత్రి పదవిపై ఉద్ధవ్ థాకరే(Uddhav) బీజేపీతో విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఆ నిర్ణయం మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా ఊహించని మార్పులకు దారితీసింది. కాంగ్రెస్(Congress)తో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా థాకరే ఒకప్పుడు ప్రత్యర్థిగా భావించిన రాజకీయ శక్తులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
స్థానిక హిందూత్వ పార్టీని తొలగించి జాతీయ హిందూత్వ పార్టీ ఆధిపత్యం సాధించాలనే బీజేపీ ప్రయత్నం అప్పట్లో విఫలమైంది. దేశ ఆర్థిక రాజధానిపై ఆధిపత్యం సాధించడం బీజేపీకి అత్యంత కీలకం అయినప్పటికీ.. స్థానిక రాజకీయ వాస్తవాలు వాటిని అడ్డుకున్నాయి.
మేయర్ పీఠంపై షిండే కన్ను..
ఈ పరాజయం తర్వాత బీజేపీ దీర్ఘకాలిక వ్యూహానికి పదును పెట్టింది. శివసేనను చీల్చి, ముఖ్యమంత్రి కావాలనే ఆశయంతో ఉన్న ఏక్‌నాథ్ షిండేతో పొత్తు పెట్టుకుంది. కొంతకాలం సీఎం పదవి ఇచ్చి.. ఆపై నియంత్రణ తన చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు షిండే సేన ముంబై మేయర్ పదవిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది.
అయితే షిండే కూడా గతంలో ఉద్ధవ్ థాకరేకు చేసినట్లుగానే బీజేపీకి వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా లేకపోలేదన్న ఆందోళన కాషాయ పార్టీలో ఉంది. కారణం.. BMC దాదాపు రూ.75వేల కోట్ల బడ్జెట్‌ను నియంత్రిస్తుంది. ఇది అనేక రాష్ట్రాల మొత్తం బడ్జెట్‌లకన్నా ఎక్కువ. ఈ వనరులపై నియంత్రణ ఎవరి చేతుల్లో ఉంటుందన్నదే అసలు ప్రశ్న.
రెండో స్థానంలో శివసేన (యూబీటీ)
ఈ ఎన్నికల్లో మరో కీలక అంశం - శివసేన మూడు వర్గాల బలం. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన 65 సీట్లు సాధించి బీజేపీ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. మీడియా చెప్పినట్లు బీజేపీ దాడిలో తుడిచిపెట్టుకుపోలేదు. వాస్తవానికి ఉద్ధవ్ థాకరే నాయకుడిగా తన రాజకీయ ప్రాధాన్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు.
ప్రస్తుతం శివసేన మూడు వర్గాలుగా ఉంది. 2006లో విడిపోయిన రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నిర్మాణ్ సేన, 2022లో విడిపోయిన షిండే వర్గం, ఉద్ధవ్ థాకరే వర్గం. ఈ మూడు వర్గాలు కలిసి పనిచేస్తే BMCలో 100 మంది కార్పొరేటర్లు ఉంటారు. ఇది బీజేపీ బలాన్ని మించేది. స్థానిక శక్తులు ఐక్యమైతే ముంబైలో జాతీయ పార్టీ ఆధిపత్యాన్ని సవాల్ చేయగల స్థితిలో ఉన్నాయి.
సంఖ్యా బలం పెరిగితే..
ఈ సంఖ్యకు కాంగ్రెస్ తోడయితే బలం 124 సీట్లకు చేరుతుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ థాకరే మిత్రపక్షంగా ఉన్నా.. BMC ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. అయినప్పటికీ ఈ కలయిక బీజేపీ–షిండే సేన సమీకరణ కంటే బలంగా ఉంటుంది.
గమనించాల్సిన విషయం ఏమిటంటే.. 2022 నుంచి BMC వాస్తవానికి బీజేపీ నియంత్రణలోనే ఉంది. ఐదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ఎన్నికలు జరగకపోవడంతో కార్పొరేషన్ నిర్వాహకుడి పాలనలోకి వెళ్లింది. దేవేంద్ర ఫడ్నవీస్ వంటి శక్తివంతమైన నేత బీజేపీకి ఉన్నప్పటికీ, 2026 ఎన్నికల్లో బీజేపీ 2017తో పోలిస్తే కేవలం కొన్ని సీట్లు మాత్రమే పెంచగలిగింది.
రాష్ట్రంలో బీజేపీకి అత్యధిక శాసనసభ్యులు ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తర్వాత పార్టీ మహారాష్ట్రలో మళ్లీ పుంజుకుంది. ఎన్నికల కమిషన్ పాత్రపై జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నా.. ప్రస్తుతానికి బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్లలో సగానికి పైగా నియంత్రిస్తోంది. అయినా స్థానిక పార్టీలపై ఆధారపడకుండా మహారాష్ట్రను పూర్తిగా నియంత్రించలేకపోవడం బీజేపీ బలహీనతను సూచిస్తుంది.
ఇక ఎన్‌సీపీ విషయానికి వస్తే..అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాలు రెండూ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యాయి. పూణే వంటి కోటల్లో కూడా వారి ప్రభావం తగ్గింది. కాంగ్రెస్ పరిస్థితి కూడా మెరుగ్గా లేదు. సంస్థాగత బద్ధకం, వ్యూహాత్మక దూరదృష్టి లేమి పార్టీని వెంటాడుతోంది. అయినప్పటికీ, కొన్ని కార్పొరేషన్లలో మేయర్ పదవులు దక్కించుకోవడం ద్వారా పార్టీ ఉనికిని సూచిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే.. ముంబైలో శివసేన రాజకీయ ప్రాధాన్యం ఇంకా అంతరించలేదని, బీజేపీ ఆధిపత్యానికి పరిమితులు ఉన్నాయని స్పష్టం చేశాయి. శివసేన మూడు వర్గాలు, బీజేపీ–షిండే సంబంధాల భవిష్యత్తు, కాంగ్రెస్–ఎన్‌సీపీ పునరుజ్జీవన ప్రయత్నాలు..ఇవన్నీ మహారాష్ట్ర రాజకీయాల తర్వాతి దశను నిర్ణయించనున్నాయి. రాజకీయ స్థిరత్వం ఎవరిదో ఈ పరిణామాలు తేల్చబోతున్నాయి.

