కర్ణాటకలో ఏపీ మినిస్టర్స్‌..మహిళలకు ఉచిత బస్సుసౌకర్యం కల్పిస్తారా
x

కర్ణాటకలో ఏపీ మినిస్టర్స్‌..మహిళలకు ఉచిత బస్సుసౌకర్యం కల్పిస్తారా

అధ్యాయనాలతో సరిపెడుతారా? ఆర్టీసీ బస్సులో మహిళలను ఫ్రీగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తారా? అనేది నేటికీ ప్రశ్నార్థకంగానే మిగిలి ఉంది.


ఎన్ని రోజులు అధ్యాయనం చేస్తారు? ఎన్ని రాష్ట్రాల్లో టూర్లు చేస్తారు? పథకం ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అన్నీ ప్రశ్నలే వినిపిస్తున్నాయి. సమాధానం కనుచూపు మేరలో కనిపించడం లేదు. మంత్రులు, అధికారులు టూర్‌లు మీద టూర్‌లు చేస్తున్నారు. అధ్యాయనాల మీద అధ్యాయనాలు సాగిస్తూనే ఉన్నారు. వీటి కోసం బోలెడు ప్రజా ధనం ఖర్చు చేస్తున్నారు. కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది ఇంత వరకు ప్రకటించలేక పోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల అజెండాలో పేర్కొన్న సూపర్‌ సిక్స్‌లోని హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. మహిళలను తమ వైపు ఆకర్షించుకునేందుకు, మహిళా ఓట్‌ బ్యాంకు సాలిడ్‌గా తమ వైపునకు తిప్పుకునేందుకు కూటమి వేసిన ఎత్తుగడల్లో ఇదొకటి. కళ్లముందు తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా కూటమి అధికారంలోకి వస్తే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారనే ఆశతో మహిళలు గంపగుత్తిగా కూటమికి జై కొట్టారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఇంత వరకు ఇది కొలిక్కి రాలేదు. దీంతో సూపర్‌ సిక్స్‌తో ప్రజలను మోసం చేశారనే విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఆ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు కూటమి ప్రభుత్వం కంటితుడుపు చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా మంత్రులు, అధికారుల బృందం ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యాయనం పేరుతో టూర్‌లు చేపట్టింది. వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, రాంప్రసాద్‌రెడ్డి మంత్రుల బృందం ప్రస్తుతం కర్ణాటకలో టూర్‌లో ఉన్నారు. రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే, ఇతర అధికారులు కూడా వీరితో పాటు పర్యటనలో ఉన్నారు. కర్ణాటక మంత్రి రామలింగారెడ్డితో పాటు అధికారులకు కూడా వీరు కలిశారు. బెంగుళూరులో వీరితో సమావేశమయ్యారు. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తోంది.
Read More
Next Story