
మళ్లీ రాజకీయ వేదికపై వంగవీటి వారసత్వం
రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చనేదానికి ఈ పరిణామమే ఉదాహరణ, అయితే కులం ప్రాధాన్యత ఇప్పుడు తెరపైకి వచ్చింది.
విజయవాడ రాజకీయాల్లో ‘వంగవీటి’ అనే పేరు కేవలం ఒక కుటుంబం కాదు. 1980ల చివర్లో కాపు-కమ్మ రాజకీయాలకు, వీధి పోరాటాలకు, హత్యకాండకు సంకేతంగా నిలిచిన వంగవీటి మోహనరంగా వారసుడు రాధాకృష్ణ ఈరోజు మళ్లీ ప్రధాన వార్తగా మారారు.
2004లో కాంగ్రెస్ తరఫున విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాధాకృష్ణ, తర్వాత ప్రజారాజ్యం, వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీల మీదుగా ప్రయాణిస్తూ బుధవారం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడ మేయర్ పదవిపై ఆయన పేరు వినిపిస్తుండటంతో, వంగవీటి కుటుంబం మళ్లీ కృష్ణా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతోందా అనే చర్చ మొదలైంది.
తండ్రి రంగా హత్య తర్వాత నాలుగు దశాబ్దాలుగా కాపు సమాజంలో భావోద్వేగ గుర్తింపు కలిగిన ఈ కుటుంబం ఇప్పుడు కూటమి రాజకీయాల్లో ఏ స్థానాన్ని ఆక్రమించబోతోందో, రాధాకృష్ణ రాజకీయ గమ్యం ఏమిటో అనే ప్రశ్నలు ముందున్నాయి.
2019 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న హామీ అమలు కాకపోవడం, 2024 ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడం వంటి అంశాలు ఆయన రాజకీయ పయనంలో చర్చనీయాంశమయ్యాయి. టీడీపీలో కొనసాగుతూ కూటమి విజయానికి కృషి చేసినప్పటికీ, కీలక పదవులు దక్కకపోవడంతో ఆయన క్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది.
వంగవీటి రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. కూటమి సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాకపోయినా, బలమైన స్థానిక నేతను జనసేన జెండా కింద బరిలో దించే వ్యూహం టీడీపీ నాయకత్వ సమన్వయంతోనే జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తుపైనా, విజయవాడ పట్టణ రాజకీయాలపైనా దృష్టి పెరిగింది.

