నిజాయితీకి ఇదేనా బహుమానం
x

నిజాయితీకి ఇదేనా బహుమానం

ఒంగోలులో నిజాయితీ పరునునిగా పేరు తెచ్చుకున్నఓ జిల్లా అధికారి చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఆ అధికారి ఎవరు? ఆ ప్రభుత్వ కార్యాలయం ఏది? అక్కడ ఏమి జరిగింది?


ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు. ఆ జిల్లాలో పనిచేసే అధికారులు నాయకులు చెప్పినట్లు నడుచుకోవాలి. లేకుంటే తిప్పలు తప్పవు. కో ఆపరేటివ్ జిల్లా ఆడిట్ అధికారిగా పనిచేస్తున్న రాజశేఖర్ చావు నుంచి తప్పించుకున్నారు. ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? ఏమి చేశారు? ఇవీ పలువురిని వేదిస్తున్న ప్రశ్నలు. సహకార శాఖలో చాలా సొసైటీలు అవినీతికి మారు పేరుగా మారాయి. ఈ సహకార సంఘాలు, సహకార బ్యాంకులపై ఆడిట్ అధికారిగా పనిచేస్తున్న రాజశేఖర్ ముక్కుసూటిగా వెళ్లే వాడని పేరు తెచ్చుకున్నారు. 2018లో గ్రూప్ 1 ద్వారా ఎంపికైన రాజశేఖర్ నంద్యాల జిల్లా కేంద్రానికి చెందిన వారు. ఒంగోలులోని జిల్లా కో ఆపరేటివ్ ఆడిట్ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు ఆడిట్ విషయంలో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఎవరి వత్తిళ్లకు లొంగకుండా విధులు నిర్వహిస్తున్నారనే పేరు సంపాదించుకున్నారు.

ఈయన ప్రభుత్వ ఉద్యోగం రాకముందు ఈనాడు సంస్థలో సబ్ ఎడిటర్ గా ఉద్యోగం చేసే వారు. గ్రూప్ 1 రాయడం ద్వారా అధికారిగా ఉద్యోగం పొందారు. జర్నలిజం బ్యాగ్రవుండ్ నుంచి వచ్చిన వారు కావడంతో కాస్త కరుకుగానే వ్యవహరించే వారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆరేళ్ల కాలంలో జిల్లా కలెక్టర్ల నుంచి అభినందనలు అందుకున్నారు. ప్రశంసా పత్రాలు పొందారు. ఇది తోటి ఉద్యోగుల్లో కొందరికి కంఠగింపుగా మారిందనేది రాజశేఖర్ చెబుతున్న మాట. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ ఒంగోలు, గిద్దలూరు ఎమ్మెల్యేలు తనకు ఫోన్లు చేసి కాస్త చూసీ చూడనట్లు పోవాలని అన్నారే కాని ఎప్పుడూ తనను ఇబ్బంది పెట్టలేదని రాజశేఖర్ చెప్పారు. ఈనెల 8వ తేదీన కలెక్టర్ ఆఫీస్ కు ఎదురుగా ఉన్న అంబేద్కర్ భవన్ సమీపంలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కర్రలు, కారంతో దాడి చేసి చితక బాదారు. వారి బారి నుంచి తప్పించుకుని బయట పడ్డాడు. ఈ సంఘటన రాత్రి 7.15 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దర్యాప్తు ఏమైంది?

రాజశేఖర్ నుంచి ఫిర్యాదు రాగానే అడిషనల్ ఎస్పీ క్రైం శ్రీధర్ రావు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, వన్ టౌన్ సీఐ నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అర్ధరాత్రి వరకు విచారణ జరిపారు. రాజశేఖర్ ను జీజీహెచ్ కు పంపించి వైద్యం చేయించారు. అక్కడి సీసీ పుటేజీని పరిశీలించారు. నిందితులు ఎవరనేది మాత్రం గుర్తుపట్టలేదు. సంఘటన జరిగి వారం దాటినా ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తన కార్యాలయంలో పనిచేస్తున్న ఐదుగురిపై తనకు అనుమానంగా ఉందని, వారే కిరాయి రౌడీలతో ఈ దాడి చేయించి వుంటారనే అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులో వారి పేర్లు కూడా ఇచ్చారు. అయితే వారిని పోలీసులు పూర్తి స్థాయిలో విచారించిన దాఖలాలు లేవు.

దాడికి కారణాలు ఏమిటి?

ఈయన జిల్లా కో ఆపరేటివ్ ఆడిట్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రకాశం జిల్లాలోని కారుమంచి, కొమరోలు, పొన్నలూరు, పల్లామల్లి కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీల్లో జరిగిన అవినీతిపై ఏకంగా 11 ఎంక్వయిరీలు వేయించారు. ఆడిట్ లో బయటపడిన అవినీతిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఎంక్వయిరీ కమిటీలు విచారణ జరుపుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు రూ. 3 కోట్లకు పైన రికవరీలు జరిగాయి. దీంతో కొందరు అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. దీంతో సొంత శాఖలోనే శత్రువులు ఎక్కువయ్యారు. మూడు సంవత్సరాలు జిల్లా కో ఆపరేటివ్ అధికారిగా ఇన్ చార్జ్ బాధ్యతలు నిర్వహించారు. ఆసమయంలోనూ కొన్ని ఎంక్వయిరీలు జరిగాయి. ఇవన్నీ మనసులో పెట్టకున్న కొందరు సహోద్యోగులు ఎలాగైనా ఇక్కడి నుంచి బయకు బదిలీ పంపించాలనే ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచక తన కార్యాలయ ఉద్యోగులే ఈ ఘాతుకానికి కారకులయ్యారనేది రాజశేఖర్ ఆరోపణ. ఆ కోణంలోనూ విచారణ జరుగుతోంది. సీనియర్ ఇన్స్పెక్టర్స్ కె కుమార్, డి ధామన్, ఉదయ కిరణ్, పి స్వర్ణ అనే వారిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ముక్కుసూటిగా వ్యవహరించడం వల్లనే తనను చంపాలని ప్లాన్ వేసి దాడి చేసినట్లు రాజశేఖర్ చెబుతున్నారు.

ఒంగోలులో జిల్లా అధికారిపై దాడి ఇదే మొదటి సారి...

ప్రకాశం జిల్లా ఏర్పాటైన తరువాత కలెక్టరేట్ ఎదుట మొదటిసారిగా ఒక జిల్లా అధికారిపై దాడి జరిగిందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లా అధికారికే రక్షణ లేకుండా పోతే ఇక సాధారణ ఉద్యోగుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశినంచారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాజశేఖర్ ను బదిలీ చేయాలంటూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలు

రాజశేఖర్ ను ఒంగోలు నుంచి బదిలీ చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ లు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఇచ్చారు. అయినా అధికారులు రాజశేఖర్ ను బదిలీ చేయలేదు. ఈ విధంగా భయపెడితేనైనా తనకు తానుగా బదిలీ చేయించుకుని వెళ్లిపోతాడనే భావనతో కొందరు సహచర ఉద్యోగులే ఈ పని చేయించి ఉంటారనే అనుమానం పలువురు ఉద్యోగ సంఘ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. సహకార సంఘాల్లో అవినీతిని వెలికి తీయడంలో రాజశేఖర్ మొదటి నుంచీ ముందున్నారని, అదే ఆయనపై దాడికి కారణమైందని ఉద్యోగ సంఘాల నాయకులు వరకుమార్, భాను రంగారెడ్డి, రామ్మోహన్ రావు, శ్రీనివాసరావు, మసూద్ అలీ తెలిపారు.

Read More
Next Story