కలిసి కట్టుగా ఉంటారు.. పద్దతిగా దోచుకుంటారు..
x

కలిసి కట్టుగా ఉంటారు.. పద్దతిగా దోచుకుంటారు..

ఒకటి రెండు కాదు. ఏళ్ల తరబడి ఈ దందా కొనసాగుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లడం టన్నులు టన్నులు ఇసుకను తరలించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.



పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా ఇసుక అక్రమ రవాణా చేయడమే వారి మెయిన్‌ టార్గెట్‌. అందుకు అనుకూలంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతూ ఉంటారు. పార్టీ ఏదైనా ఐక్యమత్యంగా ఉండటం, పద్దతిగా ఇసుకను దోచుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లడం తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం వారి నైజం. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా? ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏళ్ల తరబడి ఈ దందా సాగుతోంది. కృష్ణా నది కరకట్ట ప్రాంతం వెంబడి అంతా ఇదే దందా. లంక దిబ్బలను వేదికగా చేసుకొని అక్రమ రవాణా సాగిస్తుంటారు. ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టొకొచ్చిన నేపథ్యంలో ఈ దందా మరో సారి చర్చనీయాంశంగా మారింది.
రాత్రుల్లో అయితే ఎవరికీ అనుమానాలు రావు. ఇసుక అక్రమ రవాణా అంతా రాత్రి వేళల్లో చేస్తారు. అందరు నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో వీరు పనిలోకి దిగుతారు. డిమాండ్‌ ఉన్న సమయాల్లో అయితే సాయంత్రం పూట నుంచే పనుల్లోకి దిగుతారు. ఇసుక అక్రమ రవాణా అంతా లంక దిబ్బల్లో చేస్తుంటారు. బయట వారికి తెలిసే అవకాశం ఉండదు. ఒక్కో బోటుకు కనీసం 10 మంది వరకు వర్కర్లు ఉంటారు. ఎక్కడైతే ఇసుకను తీయాలనుకుంటారో అక్కడకు చేరుకుంటారు. నదిలోకి దిగి ఇసుకను బోట్‌లోకి డంప్‌ చేస్తారు. అలా బోట్‌లోకి డంప్‌ చేసిన ఇసుకను చెట్ల మధ్యలో ఉన్న ఒడ్డున అన్‌లోడ్‌ చేస్తారు. ఎవరైతే నదిలో ఇసుకను తోడుతారో అదే టీమ్‌ ఒడ్డుకు చేర్చి అన్‌లోడ్‌ చేస్తారు. కొంత మంది బోట్‌లో నుంచి ఇసుకను తీస్తుంటే మరి కొంత మంది ఒడ్డున పోస్తారు. అలా రెండు మూడు లారీలకు సరిపడా లోడ్‌ అవుతుందనకున్నప్పుడు ఒడ్డున ఉన్న ఇసుకను ప్రొక్లేన్ల సాయంతో లారీల్లోకి డంప్‌ చేస్తారు. తెల్లారే సమయానికి ఒక ఇసుక రేణువు కూడా లేకుండా అక్కడ నుంచి తరలించేస్తారు.
కృష్ణా నది తీరం వెంబడి ఉన్న కరకట్ట పొడవునా ఈ వ్యాపారం జరుగుతుంది. తుళ్లూరు మండలంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. విచ్చల విడిగా జరుగుతుంది. ఇలా అమరావతి వరకు జరుగుతుంది. కొల్లిపర మండలంలో కూడా అధికంగానే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఇసుక రేవులు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇసుక అక్రమ రవాణ జరగడం రివాజుగా మారింది. ప్రకాశం బ్యారేజీకి ఎగువ భాగంతో పాటు దిగువ భాగంలో కూడా ఇలాంటి వ్యాపారం సాగుతూనే ఉందని పేరు వెల్లడించని ఒక బోటు యజమాని తెలిపారు.
బోట్ల ద్వారా ఒడ్డుకు చేర్చిన ఇసుక మొత్తాన్ని గుట్టుచప్పుడు బయటకు తరలించేస్తారు. ఎవరి కంట పడరు. అందుక ఈ దందా రాత్రి వేళల్లోనే సాగుతుంది. అయితే ఎవరికిపడితే వారికి అమ్మరు. నమ్మకం ఉన్న వారితోనే ఈ చీకటి వ్యాపారం చేస్తారు. బిల్డర్లు, భవన నిర్మాణం చేపట్టే కాంట్రాకర్లతో వీరికి కాంటాక్ట్స్‌ ఉంటాయి. వారికి మాత్రమే అధిక శాతం విక్రయిస్తారు. కొనేవారికి ముందుగానే సమాచారం ఇస్తారు. కొన్ని సార్లు ఇన్ని లోడ్లు కావాలని ముందుగానే మాఫియాకు సమాచారం అందిస్తారు. ఆ లెక్కల ప్రకారం రవాణా చేస్తారు. తక్కువ ధరలకే తరలించేస్తారు. బయట రూ. 10వేలు వరకు ధర ఉంటే.. వీరు రూ. 8వేలు, రూ. 7వేలుకే అమ్మేస్తుంటారు. రోజుకు ఎన్ని లారీలు లోడ్‌ చేయాలనే దానిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతే మొత్తంలో నదిలో నుంచి ఇసుకును ఒడ్డుకు చేర్చుతారు. దానిని లారీలకు లోడ్‌లు వేసి తరలించేస్తుంటారు. అంతకంటే ఎక్కువ మొత్తంలో బయటకు తీసుకొనిరారు. అలా తెస్తే బయటకు తెలిసి పోతుంది, మొదటకే మోసం వస్తుందనే ఉద్దేశంతో ఈ లెక్కలు పాటిస్తారు. గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలో దాదాపు 70 బోట్ల వరకు ఉంటాయి. వీటిల్లో 10 నుంచి 15 బోట్లతో అక్రమ రవాణా చేస్తుంటారని టాక్‌ ఉంది.
అయితే ఈ మాఫియా బృందాల్లో ఒక నియమం ఉంది. దానిని ఖచ్చితంగా పాటిస్తారు. ఎవరి ఏరియాలో వారే అక్రమ రవాణా చేసుకుంటారు. ఒకరి ఏరియాలోకి మరొకరు వెళ్లరు. దీనిని మాత్రం నూరు శాతం పాటిస్తారు. అలా వెళ్తే గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అవి బయటకు పొక్కుతాయి. దీంతో గుట్టుగా సాగుతున్న వ్యాపారం కాస్తా రట్టు అవుతుంది. అలాంటి పొరపచ్చాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
రాత్రి వేళల్లో అక్రమ ఇసుక రవాణాకు ఉపయోగించిన బోట్లను పగలు ఎవరి కంటా కనబడనీకుండా లంక దిబ్బల్లో లంగర్లేసి కట్టేస్తారు. ఎలాంటి వరదలకు కూడా కొట్టుకొని రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కొత్త వాళ్లు ఆ ప్రాంతానికి వెళ్లినా, అలికిడి అయిందని తెలిసినా రెండు, మూడు రోజులు వాటి జోలికి వెళ్లరు. హడావుడి సర్థుబణిగాక వాటిని బయటకు తీస్తారు.
అయితే ప్రకాశం బ్యారేజీకి కొట్టొకొచ్చిన పడవలు అక్రమ ఇసుక రవాణాకు వినియోగించేవిగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒడ్డున సరిగా కట్టక పోవడం వల్లే ఇవి కొట్టొకొచ్చాయని బోట్ల యజమానులు, కార్మికుల్లో చర్చ సాగుతోంది. వీటిని గొల్లపూడిలో కట్టేశారని చెబుతున్న దాంట్లో ఎంత మేర వాస్తవం ఉందనేది ప్రశ్నార్థకమైంది. ఒక వేళ గొల్లపూడిలో కట్టేస్తే అంత పెద్ద వరదకు నేరుగా ప్రకాశం బ్యారేజీ వైపు వచ్చే చాన్స్‌ లేదని, ఎక్కడో లంక దిబ్బల్లో కట్టేసినవే ఇలా కొట్టొకొచ్చానే చర్చ సాగుతోంది. వరద ఫ్లోటింగ్‌కు పడవ ఎప్పుడూ స్ట్రైట్‌గా వెళ్లదు. మెలికలు తిరుగుతూ వెళ్తాయి. లంక దిబ్బల్లో కట్టేయడం వల్లే బ్యారేజీకి కొట్టొకొచ్చాయని మాట్లాడుకుంటున్నారు.
ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్ల యజమానుల్లో ప్రభుత్వం ఇప్పటికే ఇద్దరి యజమానులను అదుపులోకి తీసుకుంది. ఉషాద్రి, రామ్మోహన్‌లు ఇద్దరు గతంలో వైఎస్‌ఆర్‌సీపీలో ఉన్నారని, అయితే ప్రభుత్వం మారడంతో టీడీపీలో చేరారనే టాక్‌ వినిపిస్తోంది.
ఒక్కో బోటుకు నాలుగురు వరకు యజమానులు ఉంటారని, ఆ లెక్కన నాలుగు పడవలకు 16 మందిని అరెస్టు చేయాల్సి ఉంటుందని, అలా చేస్తే టీడీపీకే డ్యామేజీ అవుతుందని మరో చర్చ ఉంది. ఎన్నికల సమయంలో బోట్ల యజమానుల్లో అధిక శాతం టీడీపీకి సపోర్టు చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా నేతృత్వంలో ఎక్కువ మంది టీడీపీలో చేరారు. ఎక్కువ మందిని అరెస్టు చేస్తే పార్టీకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వ పెద్దలు కూడా అందుకే బోట్ల యజమానుల అరెస్టుల గురించి మాట్లాడటం ఆపేసిందనేది కూడా బోట్ల అసోసియేషన్‌ సభ్యుల్లో వినిపిస్తున్న మాట.
Read More
Next Story