ఆయన ఆశయాలకు చావు లేదు
x
బాలసుబ్రమణ్యం ఐపీఎస్

ఆయన ఆశయాలకు చావు లేదు

ఎన్ బాలసుబ్రమణ్యం ఐపీఎస్ మరణం మనసును ఎంతో బాధించింది.


నిత్యాన్వేషి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరుగుతోందో తెలుసుకోవాలనే కుతూహలం. పోలీసు కుటుంబాల సంక్షేమం పట్ల నిబద్ధత. బాధితుల బాధలు వినడం. తప్పు జరిగినప్పుడు ఎవరైనా సరే కఠినంగా వ్యవహరించడం. ఇవన్నీ ఎన్. బాలసుబ్రహ్మణ్యం ఐపీఎస్ దినచర్యలో భాగమయ్యాయి. 1994 బ్యాచ్‌కు చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో పోలీసు, ఇంటెలిజెన్స్, రవాణా శాఖల్లో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి పదవీ విరమణ చేశారు. ఆయన ఇక మనతో లేరనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది.

ఆయన ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టగానే నేను మెసేజ్ పెట్టాను. వెంటనే రిప్లై వచ్చింది. జీపీ ఎలా ఉన్నావు. కలుద్దామని రాశారు. ఆ మాటలు ఇప్పటికీ చెవిలో మోగుతున్నాయి. కానీ ఇంతలోనే ఆయన పదవీ విరమణ, తర్వాత అనారోగ్యం, చికిత్స... అన్నీ కళ్లుమూసి తెరిచేలోగా జరిగిపోయాయి. హృదయం భారంగా మారింది.

ఒంగోలులో ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రోజుల్లో నేను ఆంధ్రజ్యోతి జిల్లా బ్యూరో ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నాను. మహేష్ చంద్ర లడ్డా పై మావోయిస్టుల దాడి తర్వాత బాధ్యతలు చేపట్టిన ఆయన మావోయిస్టులను అదుపులోకి తెచ్చేందుకు ప్రధాన పాత్ర పోషించారు. 2005 నుంచి 2006 వరకు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మావోయిస్టులు చర్చలకు వెళ్లారు. హైదరాబాద్ వెళ్తూ పూర్వపు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నారుట్ల (నల్లమల అడవి) నుంచి పెద్దదోర్నాల మీదుగా పిడుగురాళ్ల వద్ద గుత్తికొండ బిళం వద్ద పెద్ద సభ పెట్టి అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లారు. ఆ సందర్భంలో పర్యవేక్షణ బాధ్యతలన్నీ ఆయనవే. ప్రతి ఒక్కరినీ గుర్తించేలా ఫోటోలు, వీడియోలు తీయడంలో సఫలమయ్యారు. చర్చలు విఫలమై వారు తిరిగి అడవుల్లోకి వెళ్లారు.

నల్లమల అడవుల్లోని కృష్ణా నదీ తీర ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న స్థావరాలను గుర్తించడంలో సఫలమయ్యారు. ఒక రోజు ఒంగోలు క్యాంపు కార్యాలయంలో నేను ఒక్కడినే కూర్చున్నాను. మావోయిస్టుల గురించి చర్చ వచ్చింది. అడవుల్లో వారు ఎక్కడెక్కడ ఉన్నారో ఎలా గుర్తిస్తారని అడిగాను. ఆయన రూపొందించిన వ్యూహం గురించి వివరంగా చెప్పారు. హైదరాబాద్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో అప్పటికే అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. శాటిలైట్ ద్వారా కదలికలను గుర్తించేందుకు టెక్నికల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆ రూములో ఆయన పర్యవేక్షణలోనే అన్నీ జరిగేవి. అడవిలో తిరిగే మనుషులు ఒక రంగు, ఆయుధాలు మరో రంగు, పశువులు, చెట్లు, రాళ్లు ఇలా ప్రతి కదలిక గురించి సమాచారం వచ్చేది. దాని ఆధారంగా ఏపీఎస్పీ బృందాల ద్వారా అనేక మంది నాయకులను గుర్తించినట్లు చెప్పారు. ఆయన ఎప్పుడూ సాంకేతికతను పోలీసు పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగించేవారు.


యర్రగొండపాలెం, పుల్లలచెరువు, పెద్దదోర్నాల మండలాల్లో మావోయిస్టులు ఎక్కువగా తిరిగేవారు. యర్రగొండపాలెం మండలం పాలుట్ల వద్ద రెండుసార్లు పోలీసులు వారిని చుట్టుముట్టారు. ప్రభుత్వ ఆదేశం మేరకు వెనక్కు తగ్గారు. తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌తో పాటు తొమ్మిది మంది మరణించారు. నేను, అప్పటి ఆంధ్రజ్యోతి జిల్లా ఫోటోగ్రాఫర్ మురళి దోర్నాల వరకు వెళ్లాం. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఫోటోగ్రాఫర్‌ను పంపించి నేను దోర్నాలలో ఆగాను. తిరిగి వస్తున్న సమయంలో డీజీపీ హెలికాప్టర్‌లో ఎక్కేందుకు ఫోటోగ్రాఫర్‌ను అక్కడ వదిలి రావాల్సి వచ్చిందని నాటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాకు చెప్పారు. సారీ జీపీ తప్పలేదు. మనవాళ్లతో కలిసి వస్తాడులే అంటూ సాంత్వన పరిచారు. ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సహజమైన మానవత్వమే అది.

మరుసటి రోజు వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆంధ్రజ్యోతికి ఇచ్చారు. ఆయనకు పోలీసు జాగిలాలంటే ఎంతో ఇష్టం. తన క్యాంపు ఆఫీసులో ఉండే జాగిలాన్ని ఉదయాన్నే తనతో పాటు బయటకు తీసుకొచ్చారు. నేను, ఆయన పరేడ్ గ్రౌండ్ అంతా రిగిగాము. ఇంటర్వ్యూ పూర్తయ్యే వరకు సునకం మాతోపాటే ఉంది. తర్వాత ఇద్దరం కలిసి టిఫిన్ చేశాం. మరుసటి రోజు మెయిన్ పేజీలో ఇంటర్వ్యూ ప్రచురితమైంది. వెంటనే అప్పటి డీజీపీ స్వర్ణజిత్ సేన్ నుంచి మెసేజ్‌ల పర్వం మొదలైంది. మీరెవరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. నేను కదా ఇవ్వాల్సింది అనే అర్థం వచ్చేలా. ఆయన సమాధానం స్పష్టం. మీరు సీనియర్, నేను జూనియర్. ఇద్దరం ఐపీఎస్‌లమే. పైగా నేను ప్రత్యక్షంగా ఉన్నాను కాబట్టి ఇచ్చాను అని. ఆ మెసేజ్‌ల వార్‌ను ఎప్పటికప్పుడు నాకు ఫార్వార్డ్ చేశారు. అంతటి ధైర్యం, నిజాయితీ కలిగిన వ్యక్తి.

పుల్లలచెరువు మండలంలోని ఎండ్రపల్లి తండా, మల్లాపాలెం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ల సమయంలో ఆయనతో పాటు నేను కూడా వెళ్లాను. మల్లాపాలెం వద్ద మాచర్ల శ్రీశైలం రహదారికి పడమటి వైపు ఉన్న కొండపైకి తుపాకీ భుజంపై పెట్టుకుని నడక అనలేము. పరుగు అనలేము. కానిస్టేబుళ్లతో కలిసి అంత వేగంగా వెళ్తున్నారు. ఆయనతో వెళ్లి రెండు చోట్ల మావోయిస్టుల శవాలు చూశాను. మూడోది కొండపైభాగంలో ఉంటే అక్కడికి వెళ్తున్నారు. నేను నడవలేక ఆగిపోయాను. ఆయన హయాంలోనే టెక్ మధు వంటి వారు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

స్నేహానికి వస్తే ఇంట్లో ముఖ్యమైన కార్యక్రమం ఉంటే తప్పకుండా పిలిచేవారు. అధికారిక కార్యక్రమాల్లో సాధారణంగా. ఆయన సతీమణి కూడా అంతే స్నేహభావం కలిగిన వ్యక్తి. ఒక సాంస్కృతిక కార్యక్రమంలో నన్ను ప్రత్యేకంగా పిలిచి భార్యాభర్తలతో ఫోటో తీయించారు. ఎన్నోసార్లు డిన్నర్లకు పిలిచారు.

నేను ఒక కేసు గురించి చెప్పాను. విదేశాల నుంచి డోనర్లు పంపిన డబ్బుకు లెక్కలు చెప్పకపోవడంపై వచ్చిన కేసు. ఫిర్యాదుదారు ఇంగ్లండ్‌కు చెందినవారు. ఆ వ్యక్తి నా వద్దకు వచ్చి తమ డొనేషన్లకు లెక్కలు చెప్పకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన విదేశీయులైనా వారికి న్యాయం చేశారు. ఏ సమాచారం అడిగినా పత్రిక కోసం కాదనకుండా చెప్పేవారు. జీపీ నీకోసం చెబుతున్నా అనేవారు.

ఒంగోలు నుంచి బదిలీ అయిన తర్వాత నేరుగా నా ఇంటికి భార్యాభర్తలు వచ్చారు. అప్పుడు నేను సీఆర్పీ క్వార్టర్స్ వద్ద ఉంటున్నాను. ఉదయం పది గంటలకు మఫ్టీ కానిస్టేబుల్ వచ్చి ఎస్పీ సార్ మీ ఇంటికి వస్తానని చెప్పారు. ఒక గంటలో వస్తారని అన్నారు. ఆశ్చర్యం వేసింది. మా ఇంటిని అంత ఖచ్చితంగా ఎలా గుర్తుంచుకున్నారో అని అనుకున్నాను. నా భార్య హెల్త్ అసిస్టెంట్ కావడంతో ఆసుపత్రిలో ఉంది. కబురు చేసి ఎస్పీ బాలు సర్ ఇంటికి వస్తున్నారు. నువ్వు వచ్చి వెళ్లాలని చెప్పాను. ఆమె ఇంటికి వచ్చింది. ఇంట్లో స్నాక్స్ కూడా లేవు. ఏం చేయాలో తెలియని స్థితిలో నా భార్య సర్ మజ్జిగ ఇస్తానని అడిగింది. వెంటనే ఇవ్వమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించారు. అరగంట పాటు కూర్చుని మాట్లాడి వెళ్లారు. ఆ ఆప్యాయత ఇప్పటికీ గుర్తుంది.

ప్రకాశం ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొండమిట్టపై ఉండే ఎస్పీ బంగళాను పోలీసు కార్యాలయానికి మార్చారు. ఆయన వచ్చిన తర్వాతే క్యాంపు కార్యాలయం కొత్తగా నిర్మించారు. ఎస్పీ ఛాంబర్‌ను కూడా జిల్లా కార్యాలయంలో కొత్తగా నిర్మించారు. ప్రకాశం జిల్లాలో ఆయనతో కలిసి వేసిన అడుగులు ఇప్పటికీ గుర్తున్నాయి.

నేను తిరుపతిలో సాక్షి బ్యూరో ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పుడు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలో చంద్రబాబు నాయుడును ఎన్నుకునే సభ వద్ద ఆయన కనిపించారు. సార్ ఇక్కడేంటి అన్నాను. అవును జీపీ పొలిటికల్ ఇంటెలిజెన్స్ చూస్తున్నాను అన్నారు. ఆ తర్వాత నేరుగా కలిసి మాట్లాడింది లేదు.

ఒంగోలు నుంచి బదిలీ అయిన తర్వాత కొద్ది రోజులు సెలవులో ఉన్నప్పుడు హైదరాబాద్ వెళ్లాను. ఫోన్ చేసి ఎక్కడున్నారు సర్ అని అడిగాను. ఇంటి వద్దే ఉన్నాను జీపీ అన్నారు. నేను రావొచ్చా అని అడిగాను. వెంటనే లొకేషన్ పంపించారు. నేను, నా తోడల్లుడు శివప్రసాద్ రావులు కలిసి వెళ్లాం. ఇంటికి వెళ్లగానే గన్‌మెన్‌ను పిలిచి యాపిల్ కట్ చేసి తీసుకురమ్మన్నారు. అప్పుడు ఇంట్లో మేడం గారు లేరు. ఊరెళ్లారు జీపీ అన్నారు. ఆ రోజు ఆయనతో చర్చించిన అంశాలు ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాయి. ఏమైనా స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి ఆయన.

ఆయన ఆశయాలకు చావు లేదు. నిజాయితీ, ధైర్యం, మానవత్వం, సాంకేతిక దృష్టి... ఇవన్నీ ఆయనలో ఎప్పుడూ నిలిచి ఉన్నాయి. హృదయంలో ఆయన జ్ఞాపకం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

జి.పి. వెంకటేశ్వర్లు, చీఫ్ స్పెషల్ కరస్పాండెంట్, ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్, విజయవాడ.

Read More
Next Story