
ముగింపు సభలో అభివాదం చేస్తున్న సీఐటీయూ నాయకులు
రాబోయే రోజులన్నీ పోరాటాలవే!
ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ఉద్యమించడానికి కార్మిక లోకం సిద్ధంగా ఉండాలని సీఐటీయూ మహాసభ పిలుపునిచ్చింది.
విశాఖపట్నంలో ఐదు రోజులుగా జరుగుతున్న 18వ సీఐటీయూ ఆలిండియా మహాసభలు ఆదివారం రాత్రి ముగిశాయి. నగరంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ ముగింపు సభకు సీఐటీయూ జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరై మాట్లాడారు. ఆ సభలో ఎవరేం మాట్లాడారంటే..
మాట్లాడుతున్న సీఐటీయూ జాతీయ అధ్యక్షుడు సుధీర్ దత్తా
సీఐటీయూ జాతీయ నూతన అధ్యక్షుడు.. సుధీర్ దత్తా..
‘దేశంలోని కార్మిక సంఘాలన్నీ ఫిబ్రవరి 12న అతిపెద్ద సమ్మె చేయాలని నిర్ణయించాయి. ఆరోజు ప్రతి నగరంలోని కార్మికులంతా రోడ్లపైకి వద్దాం. రైళ్లను ఎక్కడికక్కడే నిలిపేద్దాం. ఉత్పత్తిని నిలిపేద్దాం. దేశాన్ని స్తంభింపజేద్దాం. కార్మిక శక్తిని చాటుదాం. గతంలో పోరాటాల ద్వారా సాధించుకున్న ఏ హక్కునూ వదులుకోవద్దని మహాసభ తీర్మానం చేసింది. ప్రభుత్వరంగ సంస్థ వివాఖ ఉక్కును కాపాడుకోవడానికి కార్మికులంతా తీవ్రంగా ఉద్యమిస్తున్నారు. దీనిని తెలుగు ప్రజల భావోద్యేగ సమస్యగా మలిచారు. దేశానికి ఆదర్శంగా నిలిచారు. కార్మికులకు అన్యాయాలపై మనం వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ప్రతిరోజూ ముందడుగు వస్తూ పోరాటంలో ముందుకు వెళ్లాలి. దేశంలోని సంపదనకు కాజేయాలని కార్పొరట్లు చూస్తున్నాయి ఈ మహా పోరాటంలో మన ప్రాణాలు పోవచ్చు. జైలుకెళ్లొచ్చు. అన్నిటికీ సిద్ధపడి పోరాటాలకు సిద్ధం కండి’.
సభకు హాజరైన సీఐటీయూ సభ్యులు
సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు తపన్‌సేన్
‘వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం విచారకరం. పోరాటాలు, బలిదానాలతో వచ్చిన విశాఖ ఉక్కును ముంచేయడానికే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకు అవసరమైన పరిస్థితులను సృష్టిస్తోంది విశాఖ నగరం పెట్రోలియం రంగానికి, షిప్‌యార్డుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇప్పటికే పెట్రోలియం రంగంలో 40 శాతానికి పైగా ప్రైవేటీకరణ చేసింది. రక్షణ రంగాన్ని కూడా కొంతవరకు ప్రైవేటుకు అప్పగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజలు, కార్మికులను వేరు చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగించడంపైనే శ్రద్ధ చూపుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంటుతో పాటు దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి సమరశీల ఉద్యమాన్ని కొనసాగిస్తాం.
విశాఖ నగరంలో భారీ ఊరేగింపు
సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీం
కేంద్ర ప్రభుత్వం 2019 నుంచీ కార్మిక చట్టాలను లేబర్ కోడ్‌లుగా మార్చాలని చూస్తోంది. దీనిని అడ్డుకోవడానికి అందరితో కలుపుకుని ముందుకెళ్లాం. టీడీపీ కూడా లేబర్ కోడ్లను దుర్మార్గంగా మద్దతునివ్వడం బాధాకరం. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం మరో ప్రమాదకర పరిణామం. దేశంలో ఒక్క కేరళ రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ విధానాలు అమలవుతున్నాయి. కేరళలో ఉన్న వామపక్ష ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుంటూ వస్తోంది. గత, ప్రస్తుత ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను అడ్డుకోలేదు. బీఎంఎస్ మినహా మిగిలిన అన్ని కార్మిక సంఘాలు అన్నీ లేబర్ కోడ్‌లు, ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దేశ ప్రజలు ఐక్యంగా ఉద్యమించడం ద్వారా ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అడ్డుకోగలం. వచ్చే రోజులన్నీ పోరాటాలు చేయాల్సినవే.
అలరించిన గిరిజన, జానపదాలు
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు..
సమరశీల పోరాటానికి మారుపేరు సీఐటీయూ మాత్రమే. సర్వసంపదను సృష్టించేది కార్మిక వర్గమే. అలాంటి కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు అమ్మేస్తాం. కార్మికులను పర్మినెంట్ చేయం. పెన్షన్లు ఇవ్వం అని తెగేసి చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.32 లక్షల కోట్లు మాఫీ చేసింది. క్యూబా, వెనిజులా, కేరళలను ఆదర్శంగా ముందుకెళ్లాలి. ఐదేళ్లుగా పోరాటం చేయడం ద్వారానే ఒక్కశాతం కూడా వాటా అమ్మకుండా స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటున్నాం. షిప్‌యార్డు ప్రైవేటుపరం కాకుండా అడ్డుకున్నాం. అన్ని కార్మికవర్గాలు ఐక్యం కావాలి. కార్మికుల జీతాలు పెంచకపోతే సీఎం చంద్రబాబు ఇంటినైనా ముట్టడిస్తాం.
సిఐటీయు శ్రేణుల కవాతు
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే మాటగా ప్రైవేటీకరణకే మొగ్గు చూపడం దుర్మార్గం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో భూములు కోల్పోయిన రైతుల కోసం పోరాడుతున్న రైతు సంఘం నాయకుడు అప్పలరాజుపై పీడీ యాక్ట్‌తో జైలులో పెట్టారు. నిర్బంధాలు, అరెస్టులు మాకు కొత్త కాదు.. చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతాం. ఏపీలోని ప్రభుత్వాస్పత్రుల్లో 50 ఏళ్లకే నిర్బంధంగా ఇంటికి పంపేయాలని చూస్తున్నారు. 104, 108 సిబ్బందితో తక్కువ జీతాలకే పని చేయిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
Next Story

