
నిత్యం పెరుగుతున్న ధరలు.. పెరగని ఆదాయాలు
డబుల్ ఇంజన్‌లో ధరలు, పన్నులు డబుల్ మోత, చౌక దుకాణాలు మాత్రం ఖాళీ
వంటింట్లో పప్పు తక్కువైంది. నూనె బోను తేలికైంది. బియ్యం సంచి మాత్రం థరతో బరువెక్కింది. రెండు, మూడు నెలల్లోనే కేజీ బియ్యం రూ.15 నుంచి 20 పెరిగిందని సామాన్యులు చెబుతున్నారు. పప్పులు, నూనెలు, పంచదార, బెల్లం, ఉల్లి ఏది తీసినా బిల్లు పెద్దదే. జీతం అలాగే ఉంది. పెన్షన్ అలాగే ఉంది. కూలి కూడా అంతే. ధరలు మాత్రం ప్రతిరోజూ ఒక అడుగు ముందుకు. ప్రజలు కృంగిపోతున్నారు. పాలకులు మొద్దు నిద్రలో ఉన్నట్లు కనిపిస్తోంది.
మార్కెట్ మండుతోంది, వంటింట్లో నిప్పు
నిత్యావసరాలు ఇప్పుడు కేవలం కిరాణా జాబితా కాదు. కుటుంబ బడ్జెట్‌పై దాడి. రైతుకు పంటకు గిట్టుబాటు లేదు. వినియోగదారునికి మార్కెట్‌లో తగ్గింపు లేదు. రెండు వైపులా నష్టం. మధ్యలో వ్యాపారి, కార్పొరేట్, నల్లమార్కెట్. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, కరెంటు, ఇంటి పన్ను పెరిగితే రవాణా ఖర్చు పెరుగుతుంది. రవాణా పెరిగితే కిరాణా పెరుగుతుంది. ఇది గొలుసు. గొలుసు తెంచాల్సింది ప్రభుత్వం. తెంచకపోతే ధరలు తాపీగా పైకి వెళ్తాయి.
కేంద్రంలో ఎన్‌డీఏ, రాష్ట్రంలో కూటమి డబుల్ ఇంజన్ అంటూ చెబుతారు. ప్రజలు మాత్రం డబుల్ మోతే చూస్తున్నారు. అంతర్జాతీయంలో పెట్రోలియం తగ్గినా ఇక్కడ పంపు ధరలు అంతే. ఏడాదికి మూడు సిలిండర్ల సబ్సిడీ వాగ్దానం చాలా ఇళ్లకు ఖాతాలో కనిపించడం లేదు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఒకప్పుడు చెప్పారు. ఇప్పుడు ఆ మాటే లేదు.
చౌక దుకాణం ఉంది, సరుకు లేదు
ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంటేనే పేద ఇంట్లో ధరల ఒత్తిడి తగ్గుతుంది. ఆ వ్యవస్థ నీరు గారుతోందని విమర్శ. చౌక దుకాణంలో నాసిరకం బియ్యం, అరకేజీ పంచదార తప్ప మిగిలినవి కరువు. ఒకప్పుడు 16 రకాల నిత్యావసరాలు ఇస్తామన్నారు. ఇప్పుడు జాబితా కుదించేశారు. అంత్యోదయ కింద నిరుపేదలు, వితంతువులు, వికలాంగులకు 35 కేజీల బియ్యం ఉండేది. దాన్ని మనిషికి ఏడు కేజీలకు దించారని ఆరోపణ. మద్యం 24 గంటలు దొరుకుతుంది. రేషన్ మాత్రం కొలతతో ఉంటోంది.
రిటైల్‌లోకి, పంట కొనుగోళ్లలోకి పెద్ద కంపెనీలు దిగి మార్కెట్‌ను పట్టుకున్నాయని వ్యాపారులు, కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం చూస్తూ ఉందని మరో ఫిర్యాదు. సామాన్యుడు మార్కెట్‌లో ఒంటరివాడు. కార్పొరేట్‌కు కొమ్ము కాస్తే ధర తగ్గదు.
ఇంటింటా నిరసన.. వీధిలో ధర్నా
ఈ నేపథ్యంలోనే ఆదివారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, అజిత్ సింగ్ నగర్ 58వ డివిజన్‌లో సిపిఎం ధర్నా నిర్వహించింది. కార్యకర్తలు స్థానికులతో కలిసి నిత్యావసరాల సంచులు, బ్యానర్లు పట్టుకుని నిరసన తెలిపారు. రేషన్ డిపోల్లో అన్ని సరుకులు చౌకగా ఇవ్వాలని నినాదాలు చేశారు. స్థానికులు కూడా ధరలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్. బాబురావు, పార్టీ నేత బి. రమణారావు మాట్లాడుతూ రెండు, మూడు నెలల్లో బియ్యం కేజీకి రూ.15–20 పెరగడం ఇంతకు ముందెన్నడూ లేదన్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్, కరెంటు, ఇంటి పన్నులు పెంచి అగ్నికి ఆజ్యం పోస్తున్నారని ఆరోపించారు. రైతుకు ధర లేదు, మార్కెట్‌లో అన్నీ మండుతున్నాయని, ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర పోషించడం దుర్మార్గమని అన్నారు. ధరల స్థిరీకరణ నిధి మాట మరిచిపోయారని, పెట్రోలియం ధరలు తగ్గినా పంపు ధరలు తగ్గడం లేదని, మూడు సిలిండర్ల సబ్సిడీ అందరికీ జమ కావాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తూ ధరలు చూడకపోతే ప్రజలు ప్రతినిధులను నిలదీస్తారని హెచ్చరించారు. ఆందోళనను ఉధృతం చేస్తామని, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.

