వైసీపీ పదవుల్లో జగన్ మెప్పు పెద్దరెడ్లేకే..!
x

వైసీపీ పదవుల్లో జగన్ మెప్పు పెద్దరెడ్లేకే..!

నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు. ఇదీ వైఎస్. జగన్ నినాదం. పార్టీ పదవుల్లో ప్రాధాన్యత లేదు. నెల్లూరు జిల్లా పార్టీ పదవుల్లో స్పష్టమైంది.


రాష్ట్రంలో అధికారం కోల్పోయాక పార్టీని సంస్థాగతంగా తీర్చిదిద్దడానికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ దృష్టి నిలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన మార్పుల్లో రెడ్డి సామాజికవర్గానికే పెద్దపీట వేశారు. తాజా నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డికి అవకాశం ఇచ్చారు. "వైఎస్. జగన్ ఆత్మాహుతి దళం" అన్నట్లు మాటలతో విరుచుకుపడే మాజీ మంత్రి పీ. అనిల్ కుమార్ యాదవ్ కు ప్రాధాన్యం తగ్గించినట్లు కనిపిస్తోంది.


తాడేపల్లి కార్యాలయంలో తాజాగా నెల్లూరు జిల్లా నేతలతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు ఏ. విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా హాజరయ్యారు. అలాగే ఓటమి చెందిన మాజీ మంత్రులు కాకాణి గోవర్థనరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, నల్లప్పరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, మేకపాటి విక్రమ్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డితో పాటు మిగతా నాయకులు కూడా హాజరయ్యారు.
పెద్దరెడ్ల మధ్య అనిల్
నెల్లూరు జిల్లా అంటే పెద్ద రెడ్లకు పేరు. అందులో ప్రధానంగా ఆనం, మేకపాటి, నల్లపురెడ్డి కుటుంబాలు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తాయి. వీరి మధ్య వైసీపీ అధికారంలో ఉండగా బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పెద్దరెడ్ల కోటలో చక్రం తిప్పారు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఆయన నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని పార్టీ వ్యవహారాలకు పరిమితం చేస్తూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయనకు ప్రాధాన్యత పెరిగిందా తగ్గిందా? అనేది చర్చనీయాంశమైంది.

ఇదీ నెల్లూరు కమిటీ
నెల్లూరు జిల్లాతో పాటు ఇక్కడ విలీనమైన కందూరు అధ్యక్షుడిగా కాకాణి గోవర్థనరెడ్డి నియమితులయ్యారు. నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడిగా, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ సమన్వయకర్తగా ఎంఎల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, రూరల్ సెగ్మెంట్ కు డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డిని నియమించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ క తోడుగా డిప్యూటీ మాజీ మేయర్ మహ్మద్ ఖలీల్ అహ్మద్ ను నెల్లూరు కార్పొరేషన్ స్థాయిలో పార్టీ పరిశీలకుడిని చేశారు.
ఇదిలావుంటే..
నెల్లూరు నగరం అంటే ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డికి అడ్డగా ఉండేది. ఆ తర్వాత మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఇంతటి హేమాఏమీ రాజకీయ కుటుంబాల మధ్య బీసీ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్కు వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.
2014 ఎన్నికల నుంచి నెల్లూరు జిల్లాలో వైఎస్. జగన్ అంటే "ఆయనకు నేను ఆత్మహత్యదళ సభ్యుడిని" అనే స్థాయిలో టీడీపీ నేతలపై విరుచుకుపడేవారు. ఆ మాటల దాడి, నాయకుల వ్యక్తిత్వంపై దాడి చేయడంలో మాజీ మంత్రులు ఆర్కే రోజా, కొడాలి నాని వరుసలో అనిల్ కుమార్ యాదవ్ కూడా నిలిచారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికి వైసీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. ఆ సమయంలో కూడా అనిల్ కుమార్ యాదవ్ పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారు.
తన రాజకీయ జీవితం తుది వరకు వైయస్ జగన్ తోనే సాగుతుంది" అని అనిల్ కుమార్ యాదవ్ పదేపదే వల్లే వేసేవారు. పార్టీపైన ప్రధానంగా వైఎస్. జగన్ పై ఈగ వాలనివ్వని అనిల్ కుమార్ యాదవ్
2019 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి విజయం సాధించారు. తన మొదటి క్యాబినెట్ లోనే వైఎస్ జగన్ నెల్లూరు నుంచి పెద్దరెడ్లను కాదని అనిల్ కుమార్ యాదవ్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం అంతర్గతంగా నెల్లూరు పెద్దారెడ్డిలో అంతర్ మధురానికి తెరతీసింది. అయితే, అప్పట్లో వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమాత్రం భేషజం లేకుండా అనిల్ కుమార్ పక్కన నిలిచారు.
"అవును, అనిల్ కుమార్ నాకు తమ్ముడు. ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే తప్పేంటి? ఎప్పుడు రెడ్ల కేనా అవకాశాలు" అని కూడా అప్పట్లో కూటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంటే రాజకీయ చాతుర్యం లౌక్యం తెలిసిన శ్రీధర్ రెడ్డి, ఆ తర్వాత వైసీపీలో కొరకరాని కొయ్యగా మారారు. కార్యక్రమంలో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని అభియోగంపై అప్పటి వైఎస్ఆర్సిపి ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పార్టీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు.
2024 ఎన్నికల్లో నెల్లూరు నగరం ఎమ్మెల్యే స్థానం నుంచి అనిల్ కుమార్ యాదవ్ ను తప్పించి, పొరుగు జిల్లాలో నే నరసారావుపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించారు. టీడీపీ కూటమి హవాలో మిగతా వారితో పాటు అనిల్ కూడా ఓటమి చెందారు.
"నా తమ్ముడు అనిల్ కుమార్ అని గతంలో అనిల్ కుమార్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించిన కోటంరెడ్డి శ్రీధరరెడ్డి రాజకీయంగా సవాళ్లను ఎదుర్కొన్నారు"

తాజా పరిస్థితి

మీడియా ముందు, బహిరంగ సభలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడితే వేదిక దద్దరిల్లుతుంది.వైఎస్. జగన్ అభిమానులు, పార్టీ శ్రేణులోల్ ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆ డైలాగులు ఆషామాషీగా ఉండవు. ప్రత్యర్థులపై దాడి చేయడంలో నోటికి ఏ మాత్రం అదుపు ఉండేది కాదు. అంతలా వైఎస్. జగన్ పై అవ్యాజ్యమైన ప్రేమ, అభిమానాన్ని అనిల్ కుమార్ యాదవ్ చాటుకుంటూ ఉంటారు.

2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఓటమి చెందారు. అప్పటినుంచి ఆయన సైలెంట్ గా ఉన్నారు. పల్నాడు లోని మాచర్ల పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అరెస్టే నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వైఎస్ జగన్ వచ్చారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆ సమయంలో వైఎస్. జగన్ పక్కన ప్రత్యక్షమయ్యారు. విన ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాల నిర్వహణ అటుంచి, ప్రెస్ మీట్ లు కూడా లేవు. అదే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి,ఓటమి చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం నెల్లూరు జిల్లాలోనే కాదు. రాయలసీమలో ఎవరూ పాదం బయటికి మోపడానికి భయపడుతున్నా, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రం పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. మూడు నెలలుగా ఆయన ప్రెస్మీట్లో జనాలతో ఉంటున్నారు.
మాటల తూటాలే..
రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా కనిపించని రాజకీయ వాతావరణం సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు. గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ప్రజలకు ఇద్దరు టికెట్ లేని సినిమా చూపిస్తుంటాన్నారు. ఒకరి బండారాన్ని మరొకరు బయట వేసుకుంటూ, అవినీతిని ప్రజల ముందు ఉంచుతున్నారు. వీరిద్దరి వ్యవహారం నెల్లూరు జిల్లాలో విచిత్రంగా ఉంటుంది. చెప్పడానికి అవి మాటలు కూడా చాలకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో...
జిల్లా అధ్యక్ష బాధ్యతలు

నెల్లూరు జిల్లాలో ఏ పార్టీ నాయకులు అయినా సరే రాజకీయ వ్యాఖ్యలు చేయడంలో ఎవరికి ఎవరు తీసిపోరు. అందులో మాటలు, విరుపులు, వ్యంగ్యాస్త్రాలు అందించడంలో కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమాత్రం ఎవరికీ తగ్గరు. జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని, పార్టీ స్థితిగతులను అంచనా వేసిన వైసీపీ అధ్యక్షుడు వైస్. జగన్ ముందుగా ఊహించినట్టుగానే కాకాణి గోవర్ధనరెడ్డికి ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షత బాధ్యతులు అప్పగించారు. ఆయన 2006లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, నెల్లూరు జెడ్పీ చైర్మన్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన 2011లో వైసీపీలో చేరారు. 2015 నుంచి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహిస్తున్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అప్పుడు అనిల్ కినుక .. ఇప్పుడు ప్రాధాన్య లేదు

2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు ఎమ్మెల్యే గా గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ క్యాబినెట్ల స్థానం దక్కించుకున్నారు. రెండేళ్ల తర్వాత పనితీరును విశ్లేషించిన ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన మంత్రివర్గం నుంచి అనిల్ కుమార్ యాదవ్ ను తప్పించి, కాకాని గోవర్ధన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. దీంతో పదవి ఆశించి భంగపడిన కొంతమంది పెద్దరెడ్లు నిరాశపడినా, సంతృప్తి చెందారు.. మళ్లీ మనరెడ్డికే అవకాశం వచ్చింది కదా. అనేది వారి భావన అన్నట్లు మాటలు వినిపించాయి. మంత్రివర్గంలో స్థానం కోల్పోయిన పీ. అనిల్ కుమార్ యాదవ్ అసంతృప్తికి లోనైనట్లు కూడా భావించారు. దీంతో కాకాణి గోవర్ధనరెడ్డి స్వయంగా నెల్లూరులో అనిల్ఇంటికి వెళ్లి సన్మానం చేయడం ద్వారా కలిసి పని చేద్దామని, మనమంతా ఒకటే అన్నట్లు మనసు విప్పి మాట్లాడుకున్నారు. ప్రస్తుతం పార్టీపరంగా అనిల్ కు ప్రాధాన్యత దక్కలేదు. ఆయనను యథావిధిగానే గతంలో మాదిరే నెల్లూరు నగరానికి మాత్రమే పరిమితం చేస్తూ, కార్పొరేషన్ పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే వైసీపీ జెడ్పీ చైర్ పర్సన్గా ఆనం కుటుంబం నుంచి అరుణమ్మ ఉన్నారు. ఆమె భర్త ఆనం విజయకుమార్ రెడ్డి పార్టీని నగరంతో పాటు రూరల్ పరిధిలో కూడా సమన్వయం చేసే దిశగా యత్నిస్తున్నారు. రానున్న ఎన్నికలకు ఆనం విజయకుమారరెడ్డి సర్దుబాట్లు చేసుకుంటున్ట్లు టాక్. ఇదిలావుండగా,

పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఏదీ?
అధికారం కోల్పోయిన తరువాత ఆలస్యంగా అయినా సరే వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ తన పార్టీలో సంస్ధాగత మార్పులు చేస్తున్నారు.
"నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు" అని ప్రతిసారి వైఎస్ జగన్ నినదిస్తుంటారు. కాగా, ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో మార్పులు చేస్తున్నారు. ఇందులో పరిశీలిస్తే, నెల్లూరు జిల్లాతో సహా అన్నమయ్య జిల్లాలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డిని నియమించారు. అనంతపురం జిల్లా అధ్యక్ష పదవిని సింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్కరణల కమిటీ సభ్యుడు ఆలూరు సాంబశివారెడ్డి పోటీ పడ్డారు. ఆయనను కాదని, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి పదవిని కట్టబెట్టారు. కర్నూలు జిల్లా అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ. మోహనరెడ్డికి అప్పగించారు. అన్నమయ్య జిల్లా బాధ్యతల నుంచి ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని తప్పించి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో ఎస్సీ, బీసీ, మైనారిటీ నినాదాన్ని వినిపించిన వైస్. జగన్ ప్రతిపక్షంలోకి వచ్చే సరికి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రకటించిన పదవుల్లో కూడా ఎస్సీ, బీసీ, మైనారిటీలకు అప్పగించిన దాఖలాలు లేవు. పార్టీ పరంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లా ప్రాధాన్యత లభించని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను జిల్లా పార్టీ అధ్యక్షులు ఎలా సమన్వయం చేస్తారు? క్యాడర్ లో జోష్ నింపగలరా? అనేది వేచిచూడాల్సిందే.
Read More
Next Story