ఎక్జిట్ పోల్స్ వెనక ఉండేది కామెర్ల చూపా లేక బెట్టింగ్ కుట్రనా
x

ఎక్జిట్ పోల్స్ వెనక ఉండేది కామెర్ల చూపా లేక బెట్టింగ్ కుట్రనా

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజ ఫలితాలు ఎప్పుడూ ఒకటి కాదు. నిజ ఫలితాలకు ఫోటో స్టాట్ కాపీ వంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎప్పటికీ సాధ్యం కాదు.


(ఇఫ్టూ ప్రసాద్)

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజ ఫలితాలు ఎప్పుడూ ఒకటి కాదు. నిజ ఫలితాలకు ఫోటో స్టాట్ కాపీ వంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎప్పటికీ సాధ్యం కాదు. సర్వ సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజ ఫలితాలకు మైనస్ 5% లోపు లేదా ప్లస్ 5% లోపు తేడాతో వుంటే, స్థూలంగా శాస్త్రీయ సర్వే క్రిందికి వస్తాయి. ఒకవేళ అవి మైనస్ 10% లేదా ప్లస్ 10% తేడా వరకు ఉన్నా అవి అసహజమైనవైతే కాదు. తేడా 15% గానో 20% గానో మారి, అసహజత్వంతో కూడినవని అనుకున్నా, వాటి వెనక కుట్ర కోణం గూర్చి అనుమానించే స్థితి సాధారణంగా రాదు. వాటి ఆశాస్ట్రీయత మాత్రమే చర్చనీయాంశం అవుతుంది. కానీ ఈసారి ఎగ్జిట్ పోల్స్ గురికి బెత్తెడు లేదా జానెడు దూరంలో కాక బారెడు దూరం ఉండడంతో ప్రత్యేకంగా నేడు కుట్రకోణం చర్చనీయాంశంగా మారింది.

గత 17 సార్లు ఎన్నికలు స్థూలంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అంతర్గత పోటీ క్రిందికి వస్తాయి. తాజా ఎన్నికలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకూ ఫాసిస్టు వ్యవస్థకూ మధ్య పోటీ క్రిందికి వస్తాయి. ప్రస్తుత రాజ్యాంగాన్ని సైతం రద్దు చేసి దేశాన్ని నగ్నమైన ఫాసిస్టు రాజ్యంగా మార్చే లక్ష్యం గల ఫాసిస్టు శక్తులకూ, వాటికి వ్యతిరేకంగా నిలబడే శక్తులకీ మధ్య పోటీ ఈ 18వ లోక్ సభ ఎన్నికల విశిష్టత! పై నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ సరళి, తీరుతెన్నులు, వాటి ప్రభావాలు, సంకేతాలు, వాటి వెనక కారణాలు, కారకాల పై చర్చ జరగడం సహజం. ఈ ఎన్నికల ప్రచార సరళిని తమదైన దృష్టితో స్థూల వీక్షణ చేసిన ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ పరిశీలక వర్గాలకు కొన్ని అంచనాలు ఉండడం సహజమే. వారి ప్రాథమిక అంచనాల్ని తాజా ఎగ్జిట్ పోల్స్ తలక్రిందుల్ని చేసింది. అవి ఏమిటో, అవి ఎందుకు తలక్రిందులైనవో చూద్దాం.

18వ లోక్ సభ ఎన్నికల పై ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తుల అంచనాల్ని స్థూలంగా మూడు రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. వాటిని చూద్దాం.

1-ఇండియా కూటమి స్పష్టమైన అధిక్యతని సాధిస్తుంది.

2-అది కనీసం బొటాబొటీ అధిక్యతతోనైనా విజయం సాధిస్తుంది.

3-అది విజయం సాధిస్తుందనే గ్యారెంటీ లేకపోయినా, బీజేపీ గెలుపు నల్లేరుపై నడక కాదు.

పై మూడు రకాల అంచనాలు తప్ప బిజెపి కూటమి గెలుపు ఖాయమనే నాల్గవ అంచనాకి నాకు తెల్సిన మేరకు ఫాసిస్టు వ్యతిరేక శిబిరంలో ఏ ఒక్క విభాగం కూడా రాలేదు.

మొదటి, రెండవ కోవల అంచనాలు వేసిన పరిశీలక వర్గాలనే కాక మూడవ కోవ వారిని కూడా ఎగ్జిట్ పోల్స్ తీవ్రంగా షాక్ తినిపించాయి.

ఇది ఓటర్లను ఓటింగ్ లో ప్రభావితం చేసే లక్ష్యంతో మైండ్ గేమ్ కాకపోవచ్చు. ఎందుకంటే, ఇవి ప్రీ పోల్ ఫలితాలు కానందున! ఇవి ఆచరణలో పోస్ట్ పోల్ ఫలితాలు ఐనందున! వాటి ప్రభావంతో ఓటర్ల నాడి మారి ఫలితాలను తారుమారు చేసే అవకాశం లేనందున!

ఎగ్జిట్ పోల్ ఫలితాలు తీవ్ర షాక్ తినిపించే విధంగా వెల్లడి కావడానికి గల కారణాల్ని పరిశీలిస్తే, మూడు కోవల్లో ఎదో ఒకటై ఉండే అవకాశం ఉంది. వాటిని క్రింద చూద్దాం.

1-సర్వే విధివిధానాలలో సమగ్రత లేకపోయినా లేదా పాక్షికదృష్టి వున్నా అశాస్త్రీయ సర్వే అవుతుంది. ఫలితంగా ఫలితాలు ప్రజానాడిని వ్యక్తం చేయలేవు.

2-ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ పరిశీలక వర్గాలే ప్రజానాడిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమై, ఇండియా కూటమి గెలుస్తుందనే పొరపాటు అంచనాకి వచ్చి ఉన్నట్లయితే, సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ వాస్తవ స్థితికి ఇంచుమించు అద్దం పట్టే అవకాశం ఉంది.

3-కార్పొరేట్ల జోక్యంతో ఒకవేళ 'చీకటి రాజ్యం' (డీప్ స్టేట్) EVM లతో ప్రజానాడిని తారుమారు చేయడానికి కుట్ర పన్నితే, దానికి అనుగుణంగా ఎగ్జిట్ పోల్స్ వెల్లడౌతాయి. జూన్ 1 ఎగ్జిట్ పోల్స్ కి జూన్ 4 వాస్తవ ఫలితాలు జిరాక్స్ కాపీగా మారతాయి.

(బెట్టింగ్ ద్వారా పందాలు కాయించి, మార్కెట్లో డబ్బు చెలామణి చేయించడం కోసం తప్పుడు ఫలితాల్ని వెల్లడించి వుండొచ్చనే ఓ వాదన వున్నా అది పేర్కొనదగిన నాల్గవ కారణంగా భావించడం లేదు.)

పైన పేర్కొన్న మూడింటిలో మొదటిది నిజమైతే ఎగ్జిట్ పోల్స్ వల్ల ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులు పొందిన నిరుత్సాహం రెండు రోజులకి పరిమితం. ఐనప్పుడు ఎగ్జిట్ పోల్స్ నిష్ఫలమైనవే కాకుండా నిరూపయోగమైనవి కూడా! అది వాస్తవాచరణలో బిజెపికి నష్టమే తప్ప లాభం లేదు.

రెండవది నిజమైతే, ఫాసిస్టు ప్రమాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజల్లో నిజంగా తగు చైతన్యం లేకపోయినా, ఉందనే భ్రమకు ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులు గురౌతున్న నిజాన్ని గుర్తించాలి. తగు గుణపాఠం తీసుకోవాలి. కర్తవ్యోన్ముఖం కావాల్సి ఉంది.

మూడవది నిజమైతే, దేశ ప్రజలిచ్చిన వాస్తవ తీర్పుకు పూర్తి విరుద్ధమైన తీర్పును ప్రకటింపజేయించిన రాజ్య కుట్రలకు వ్యతిరేకంగా ప్రజా ప్రతిఘటనోద్యమాల్ని నిర్మించే కర్తవ్యానికి ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులు అంకితమై దృఢంగా నిలిచి పోరాడాలి.

(పై మూడింటిలో మొదటి లేదా మూడవ ఆప్షన్లకు తప్ప రెండో ఆప్షన్ కి తావు లేదని వ్యక్తిగతంగా భావిస్తున్నా.)

ఒకవేళ EVM ల ద్వారా ఫలితాల్ని తారుమారు చేసే హైటెక్ సాంకేతిక పరిజ్ఞానంతో కుట్రకు పాల్పడితే సహజంగా ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులు షాక్ తినే ముప్పు పొంచి ఉంది. అదే జరిగితే మరో 24 గంటల్లో 'ఫాసిస్టు ఆధిపత్య మోడీ భారత్' కి తిరుగులేని ఓ విజయం చేకూరిందనే భ్రమ ఏర్పడి రాజ్యం ఏలనుంది. అంటే రేపు ఈ సమయానికి సాధారణ 'ప్రజాతంత్ర భారత్' తీవ్ర షాక్ కి గురై, ఇక 'ఫాసిస్టు మోడీ భారత్' ని ఓడించలేమనే 'మెంటల్ డిప్రెషన్' కి కూడా గురయ్యే ప్రమాదం ఉంది. ఫాసిస్టు వ్యతిరేక 'ప్రజాతంత్ర భారత్' ని దిగ్భ్రాంతికి గురి చేయడంతో పాటు 'మానసిక దుర్బల శక్తి' గా గురి చేయడం ఫాసిస్టు మోడీ ప్రభుత్వ నిజ లక్ష్యం కూడా!

వాస్తవ ఫలితాలను రేపు తారుమారు చేసే హైటెక్ కుట్రకు 'రాజ్యం' (ముఖ్యంగా 'డీప్ స్టేట్') పాల్పడిందని అనుకుందాం. అది నిజానికి మోడీ ఫాసిస్టు ప్రభుత్వం యొక్క బలానికి కాకుండా బలహీనతనే సూచిస్తుంది.

ఆచరణలో దేశ ప్రజల నాడి బ్యాలెట్ ద్వారా ఫాసిజాన్ని ఓడించే స్థితికి చేరి, అందుకు విరుద్ధంగా EVM ల ద్వారా కృత్రిమంగా ప్రజల్ని ఓడిస్తే ఏం జరుగుతుంది?

రేపటి మోడీ ఫాసిస్టు సర్కార్ ప్రజాగ్నితో కూడిన పీఠం పై కూర్చొని పాలన చేయడానికి సిద్ధపడాలి. అట్టి పరిస్థితి వాస్తవానికి ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తుల చేతుల్లో పదునైన రాజకీయ అస్త్రం వంటిది. దాన్ని సద్వినియోగం చేసుకొని నిలకడ గల ప్రజా ప్రతిఘటనకు సిద్ధం చేయడం ఫాసిస్టు వ్యతిరేకి రాజకీయ శక్తుల తక్షణ రాజకీయ కర్తవ్యంగా మారుతుంది. అదే జరిగితే, మోడీ ప్రభుత్వం దేశ ప్రజల మీద 'శాంతియుత పాలనాధిపత్యాన్ని' నెలకొల్పే స్థానాన్ని కోల్పోతోంది. అది మండే నిప్పుల కుంపటి మీద దినదిన గండంగా పరిపాలన సాగించాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది. తద్భిన్నంగా రేపు EVM కుట్ర ఫలితాల్ని చూసి 'ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులు' మానసిక నిబ్బరాన్ని కోల్పోతే, అది దేశ ప్రజలకు రాజకీయ శాపం గానూ; ఫాసిస్టు రాజకీయ శక్తులకు రాజకీయ వరం గానూ మారుతుంది.

బూటకపు మధుర హామీల వ్యామోహంతో 2014 లో, పుల్వామా, బాలాకోట్ ల ఉన్మాదంతో 2019 లో దేశ ప్రజలు "ఇష్టంగానే" మోడీ సర్కార్ ని గెలిపించడం ఒక భౌతిక సత్యం. కానీ EVM ప్రాతిపదికన రేపు మూడోసారి కూడా గెలిస్తే ఆ గెలుపులో దేశ ప్రజల పాత్ర ఉండదు. ప్రజల బాధ్యత ఉండదు. దేశ ప్రజలు తమ చేతుల్లోనే బ్యాలెట్ ఆయుధంతో ఫాసిజాన్ని ఓడిస్తే EVM ఆయుధంతో ఫాసిస్తులు గెలిచినట్లుగా భావించాలి. ప్రజల చేతుల్లో నుండి బ్యాలెట్ ఆయుధాన్ని కుట్రలో ఫాసిస్తులు స్వాధీనం చేసుకుంటే, అదే కుట్రపూరిత ఫాసిస్టు పాలకుల్ని ఓడించడానికి వీధి పోరాటాలు అనే ఆయుధాన్ని ప్రజల చేతికి అందించాల్సిన రాజకీయ బాధ్యత ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తుల మీద ఉంది.

పై హైటెక్ రాజ్య కుట్రకు పాల్పడితే దేశ పరిస్థితులు మారతాయి. ఫాసిజాన్ని ఓటు ద్వారా ఓడించిన దేశ ప్రజల ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ చైతన్యాన్ని రేపటి నుండి ప్రతిఘటనా చైతన్యంగా మార్చే ప్రక్రియకు ప్రాసంగీకత ఏర్పడుతుంది. అంటే ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ సంస్థలు, శక్తులు మనోనిబ్బరంతో దేశ ప్రజలకు సారథ్యం వహించే కర్తవ్యాన్ని చేపట్టాలి. అది వాటికి చరిత్ర అప్పగించే కర్తవ్యమౌతుంది. దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ తమ భుజస్కంధాల పై చరిత్ర మోపే కర్తవ్యాన్ని చేపట్టడానికి బదులు రేపు టీవీల ముందు కూర్చొని నీరుగారిపోతే అది చారిత్రక అపచారంగా కూడా మారుతుంది. ఒకవేళ తమను బ్యాలెట్ ద్వారా ఓడించిన దేశ ప్రజల్ని హైటెక్ కుట్రతో తాము ఓడించినట్లు ప్రకటించుకుంటే ఆ గెలుపులో దేశ ప్రజల భాగస్వామ్యం ఉండదు. ఈ పరిస్థితుల్లో ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ ఉద్యమ సంస్థలు, శక్తుల ఎదుట ఒక సవాల్ ముందుకొచ్చింది. అదేమంటే దేశ ప్రజలు ఇచ్చిన వాస్తవ తీర్పును ఒకవేళ కుట్రపూరిత పద్ధతుల్లో ఫాసిస్టు పాలకులు వమ్ము చేస్తే, అట్టి కుట్రపూరిత దాడిలో గాయపడనున్న దేశ ప్రజలకు అండగా నిలబడి మనో ధైర్యాన్ని అందించే చారిత్రక బాధ్యతని ఫాసిస్టు వ్యతిరేక శక్తులు, సంస్థలు నిర్వహిస్తాయో లేదా టీవీల ఎదుట నీరుగారి దేశ ప్రజల్ని ఫాసిస్టు రాజ్యం ఎదుట నిస్సహాయులుగా బలి పశువులుగా మార్చడానికి పరోక్షంగా సహకరిస్తాయో! ఇదే వాటి ఎదుట నేటి సవాల్!

Read More
Next Story