
ఏపీఆర్ఎస్ఏ ఆరోసారి అధ్యక్షునిగా బొప్పరాజు
ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికలు విజయవాడలో ఆదివారం జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఏ) 18వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఆదివారం విజయవాడ రెవెన్యూ భవన్లో జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిగా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోసారి, ప్రధాన కార్యదర్శిగా చేబ్రోలు కృష్ణమూర్తి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సమావేశానికి ముందు అసోసియేషన్ జెండా ఆవిష్కరణ జరిగింది. కామ్రెడ్ తోట సుధాకర్ ప్రసాద్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 11.15 గంటలకు నామినేషన్లు స్వీకరించారు. ఎన్నికల అధికారి పి.వి. కృష్ణారావు, సహాయ ఎన్నికల అధికారి ఇ. ఫణికుమార్ ఫలితాలు ప్రకటించారు. స్టేట్ అసోసియేట్ అధ్యక్షుడిగా గొట్టాపు శ్రీరామమూర్తి, కోశాధికారిగా ఆర్.ఎన్. ధివాకర్ ఎంపికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులతో కలిపి మరో 26 మందిని కార్యవర్గంలో ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
నూతన నేతలు మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు బాధ్యతగా పనిచేస్తూ శాఖ గౌరవాన్ని కాపాడి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని, ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల ఖచ్చితత్వం, వివాదాల తగ్గింపు, యజమానులకు నమ్మకమైన రికార్డులు అందించడమే రెవెన్యూ ఉద్యోగుల కర్తవ్యమని స్పష్టం చేశారు.
గతంలో మాన్యువల్ రికార్డుల కాపీలు పొందడం కష్టమని, ప్రస్తుతం వెబ్ల్యాండ్ ద్వారా డిజిటల్ సేవలు, సర్టిఫికెట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం తర్వాత సెల్ఫోన్తోనే రెవెన్యూ సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. అనధికారిక లావాదేవీల నియంత్రణ, రికార్డుల భద్రత, లాకింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు.
22-ఏ నిషేధిత భూములు, డాటెడ్ ల్యాండ్స్ వంటి అంశాలపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అధికారాలను ప్రభుత్వం ఆర్డీఓలు, తహసీల్దార్లకు అప్పగించిన నేపథ్యంలో పారదర్శకంగా పనిచేయాలని తహసీల్దార్లను కోరారు.
ఖాళీగా ఉన్న గ్రేడ్-1 వీఆర్ఓ పోస్టులకు అర్హులైన గ్రేడ్-2 వీఆర్ఓలకు పదోన్నతులు, వాటా ప్రకారం గ్రేడ్-1 వీఆర్ఓలకు సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులు, పెండింగ్లో ఉన్న వీఆర్ఏల జీతం నెలకు రూ. 21,000కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
అసోసియేషన్ సాధనలుగా జూన్ 20ను రెవెన్యూ డేగా ప్రకటింపజేయడం, 58 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులు, 2019–24 ప్యానళ్లు, 2018–19 నుంచి 2025–26 వరకు ఏడు డిప్యూటీ తహసీల్దార్ ప్యానళ్ల ఆమోదం, 2022 నుంచి సుమారు 250 డిప్యూటీ కలెక్టర్ పదోన్నతులు, 116 మందికి అడాక్ డిప్యూటీ కలెక్టర్ పదోన్నతులు, 296 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్ పదోన్నతులు, కలెక్టరేట్లలో యూనిఫాం కేడర్ స్ట్రెంత్ సాధించినట్లు తెలిపారు.
ఇదే వేదికపై ఏపీ జేఏసీ అమరావతి స్పెషల్ బులెటిన్ విడుదలైంది. 2017లో 17 సంఘాలతో మొదలై 2026 నాటికి 94 శాఖా సంఘాల కలయికగా ఎదిగిన జేఏసీ పోరాటాలు, సాధనలు ఇందులో ఉన్నాయి. జేఏసీ స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ టి.వి. ఫణిపేర్రాజు, కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి బి. కిశోర్ కుమార్, ప్రచార కార్యదర్శి ఆర్. శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ బత్తిర రామకృష్ణ తదితరులు బులెటిన్ విడుదల చేశారు.

