
షిర్డీ వెళ్లే తిరుపతి యాత్రికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్...
తిరుపతి నుంచి రేపు ప్రారంభం కానున్న రైలు.
తిరుపతితో షిర్డీ సాయినగర్ మధ్య యాత్రిక అనుబంధం మరింత బలపడనుంది. దీనికసం తిరుపతి నుంచి షిర్డీ వెళ్లే సాయి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి నుంచి ఈనెల 9వ తేదీ షిర్డీకి మరో రెగ్యులర్ రైలు ప్రారంభించనున్నారు.
"ఈ రైలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఎక్కువ మంది యాత్రికులు తిరుపతి నుంచి షిర్డీకి, షిర్డీ నుంచి తిరుమలకు రావడానికి మరింత మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుంది" అని తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ తెలిపారు.
షిర్డీ వెళ్లే 17425 నెంబరు రైలును తిరుపతి రైల్వే స్టేషన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు కూడా హాజరుకానున్నట్లు కుప్పల సత్యనారాయణ చెప్పారు. తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ రైలుకు ఉదయం 10 గంటలకు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు. తిరుపతి నుంచి బయలుదేరే ఈ రైలు 26.30 గంటల ప్రయాణం తర్వాత బుధవారం షిర్డీకి చేరుతుంది.
"తిరుపతి నుంచి సాయి నగర్ వరకు ప్రస్తుతం రెండు డైరెక్ట్ ట్రైన్లు నడుపుతున్నారు. యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా తిరుపతి ప్రాంత ప్రజా ప్రతినిధులు, మంత్రిత్వ శాఖ నిర్ణయంతో మరో రైలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది" అని తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ వివరించారు.
26 గంటల ప్రయాణం
తిరుపతి నుంచి సాయి నగర్ లోని షిర్డీ వెళ్లడానికి 26.30 గంటల సమయం పడుతుంది. తిరుపతిలో బయలుదేరే ఈ రైలు తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. గుంటూరు మీదుగా సికింద్రాబాద్ ఆ తర్వాత వికారాబాద్, శంభాజీ నగర్ మార్గంలో ఈ రైలు నడిపే విధంగా దక్షిణ మధ్య రైల్వే రూట్ ఎంపిక చేసింది. ఇందులో రెండు ఏసీ కంపార్టుమెంట్లతో పాటు స్లీపర్ కోచులు, సాధారణ ప్రయాణికుల కోసం కూడా జనరల్ కంపార్ట్మెంట్లను అందుబాటులో ఉంచింది. ఈ ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య కనెక్టివిటీ కోసం ఈ రైలు వల్ల యాత్రికుల ప్రయాణంతో పర్యాటక రంగాన్ని మరింత లాభదాయకం చేసే దిశగా రైలు సిద్ధం చేశారు.
రైలు చార్జీ
తిరుపతి నుంచి షిర్డీ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలులో స్లీపర్ కోచ్ లో ఒక ప్రయాణికుడికి 620 రూపాయలు, థర్డ్ ఏసీ కోచ్ లో 1650 రూపాయలు టిక్కెట్ ధరగా నిర్ణయించారు.
ట్రైన్ హాల్టింగ్..
తిరుపతి నుంచి షిర్డీకి బయలుదేరే సాయి నగర్ ఎక్స్ప్రెస్ ఏ స్టేషన్లో నిలుపుతారు అనేది కూడా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తినాలి, గుంటూరు, సికింద్రాబాద్, వికారాబాద్, మహారాష్ట్రలో బీదర్, లాతూర్ రోడ్, పర్భని, జాల్నా, శంభాజీ నగర్, నాగర్ సోల్, మన్మాడ్, కోపర్గావ్ మీదుగా సాయి నగర్ వరకు ఈ రైలు ప్రయాణిస్తుంది.
విపరీతమైన రద్దీ
తిరుపతి నుంచి షిర్డీకి బయలుదేరే రైలులో టికెట్ రిజర్వేషన్ దొరకడం కూడా కష్టంగా ఉంటుంది. రద్దీ ఎక్కువైన కారణంగా నెలలకు ముందే రిజర్వేషన్ చేసుకుంటే గానీ టికెట్ కన్ఫామ్ కావడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న రెండు రైళ్లకు అదనంగా 17417 తిరుపతి- షిర్డీ మధ్య మరో రైలు అందుబాటులోకి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకువచ్చిందని స్టేషన్ డైరెక్టర్ కుప్పల సత్యనారాయణ వివరించారు.
Next Story

