ఏపీలో యుద్ధ వాతావరణం : రేపు ఏం జరగబోతోంది?
x

ఏపీలో యుద్ధ వాతావరణం : రేపు ఏం జరగబోతోంది?

రేపు రాబోతున్న ఎన్నికల ఫలితాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు మాత్రమే కాదు, దాదాపుగా ఇరు పక్షాల కార్యకర్తలు, అభిమానులు కూడా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమ్‌గా పరిగణిస్తున్నారు.


-డీ ఎస్ శ్రావణ బాబు, సీనియర్ జర్నలిస్ట్

నిన్న జాతీయ న్యూస్ ఛానెల్ ఇండియా టుడేలో ఏపీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణను ప్రారంభిస్తూ హోస్ట్‌ రాహుల్ ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్‌ను ఒక ప్రశ్న అడిగాడు. ఏపీలో ఎన్నికల ఫలితాలను ఆ రాష్ట్ర ప్రజలు ఎందుకు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమ్‌గా చూస్తున్నారు అని అన్నాడు. అతను అన్నది నూటికి నూరుపాళ్ళూ నిజమే. రేపు రాబోతున్న ఎన్నికల ఫలితాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు మాత్రమే కాదు, దాదాపుగా ఇరు పక్షాల కార్యకర్తలు, అభిమానులు కూడా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమ్‌గా పరిగణిస్తున్నారు. ఫలితాలకోసం ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు. ఏపీలో తీవ్రమైన ఉత్కంఠ, ఉద్విగ్నత నెలకొని ఉన్నాయి. భావోద్వేగాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ పరిస్థితి ఏపీలో ముందెన్నడూ కానరానిది. బెట్టింగ్ రాయుళ్ళ సంగతి అయితే చెప్పనక్కరలేదు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఇదే స్థాయిలో టెన్షన్‌ ఫీలవుతున్నారు. ఏపీ ఫలితాలపై ఏ మాత్రం కాస్త సరకు ఉన్న వీడియో వచ్చినా వైరల్ అయిపోతోంది. దాదాపుగా ప్రతి ఒక్కరూ తామే అభ్యర్థులమైనంత స్థాయిలో ఫలితాలకోసం ఎదురుచూస్తున్నారు.

ఎందుకింత ఉత్కంఠ!

ఈ పరిస్థితికి కారణం ఆంధ్రప్రదేశ్ సమాజం నిట్టనిలువుగా చీలిపోయింది. కులాలవారీగా, మతాలవారీగా జనం విపరీతంగా పోలరైజ్ అయిపోయారు. కొన్ని ఏళ్ళ క్రితం తమిళనాడులో ఉండే పరిస్థితి (ఇప్పుడు అన్నాడీఎంకే బలహీనపడటంతో బైపోలార్ పరిస్థితి దాదాపుగా లేనట్లే) ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది. అక్కడ జయలలిత, కరుణానిధిల మధ్య వైరం రాజకీయ వైరంలాగా కాకుండా, వ్యక్తిగత వైరం లాగా ఉండేది. జనం కూడా ఒకసారి జయలలితకు, మరోసారి కరుణానిధికి పట్టం కట్టేవారు (ఒకసారి మాత్రం జయకు వరసగా రెండోసారి అధికారం ఇచ్చారు). ఇప్పుడు ఏపీలో కూడా అదే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడుల మధ్య వైరం వ్యక్తిగతంగా మారింది. తమిళనాడులో ఒకసారి డీఎంకేకు, మరోసారి అన్నాడీఎంకేకు అధికారం దక్కేది. ఏపీలో కూడా అదే పరిస్థితిలో అధికార మార్పిడి జరగవచ్చని పొలిటికల్ ప్యాటర్న్స్‌ అధ్యయనం చేసేవారు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

బెల్ వెదర్ నియోజకవర్గాలపై సర్వత్రా ఆసక్తి!

ఈ ఉత్కంఠ ఇలా ఉంటే, మరోవైపు బెల్ వెదర్ నియోజకవర్గాలుగా పిలవబడే కొన్ని స్థానాల ఫలితాలపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బెల్ వెదర్ నియోజకవర్గాలు అని వేటిని అంటారంటే - ఈ స్థానాలలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుంది. తెనాలి, తాడికొండ, ఆముదాలవలస, ఏలూరు, భీమవరం, శింగనమల, కాకినాడ వంటి ఈ నియోజకవర్గాలలో అధికారంలోకి వచ్చిన పార్టీయే అధికారంలోకి రావటం జరుగుతోంది.

ఇంకొన్ని సెంటిమెంట్లు కూడా ఉన్నాయి. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ అధికారంలోకి రాదు. ఇక్కడ ప్రస్తుతం టీడీపీకి చెందిన పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆయన వైసీపీకి చెందిన విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మధులతో పోటీ పడుతున్నారు. విశ్వేశ్వరరెడ్డి, మధు సొంత అన్నదమ్ములు కావటంతో అన్నదమ్ముల ఓట్ల చీలికతో పయ్యావుల లాభపడుతారనే అంచనాలు కూడా ఉన్నాయి. అలా జరిగితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుంది, ఈ సెంటిమెంట్ ప్రకారం.

ఇక రాయలసీమలోనిదే మరో నియోజకవర్గం గుంతకల్‌కు మరోరకమైన సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే అతను అధికారంలోకి రాడు అని అంటారు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ ఇక్కడ ప్రచారం చేయలేదు. మరోవైపు కడప జిల్లాలోని కమలాపురంలో ఏ నాయకుడూ మూడుసార్లు వరసగా గెలవడనే సెంటిమెంట్ ఉంది. ఈ సారి ఇక్కడి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు.

భారీ భద్రతా ఏర్పాట్లు

ఇదిలా ఉంటే పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో భారీగా పోలీసులను మోహరించారు. ఈ ప్రాంతాలలో కేంద్ర సాయుధబలగాలను కూడా రప్పించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్నికల సంఘం మొట్టికాయలు వేయటంతో ఏపీ పోలీస్ శాఖ అప్రమత్తమయింది. కౌంటింగ్ కేంద్రాలవద్ద భారీగా బలగాలను పహారాకు నియమించింది. ఫలితాలు వెలువడిన తర్వాత కూడా కేంద్ర బలగాలు 15 రోజులపాటు రాష్ట్రంలోనే ఉండాలని ఈసీ ఆదేశించింది.

Read More
Next Story