కోర్టుల్లో ఎస్పీపీ పోస్టులు రద్దు
x

కోర్టుల్లో ఎస్పీపీ పోస్టులు రద్దు

ఏపీలో నియమించిన సీఐడీ ఎస్పీపీ పోస్టులు రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులు ఎందుకిచ్చారు? ఎందుకు రద్దు చేశారనేది చర్చగా మారింది.


క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ లో ఉన్న కేసులు త్వరగా డిస్పోజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గత ప్రభుత్వం సీఐడీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించింది. ప్రస్తుతం వీరి అవసరం లేదని, కేసుల పరిష్కారంలో వీరు ఎటువంటి చొరవ తీసుకోలేదని ఏపీ ప్రభుత్వం భావించింది. అందుకే వీరి పోస్టులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉండగా ప్రత్యేకంగా వీరి నియామకం ఎందుకని ప్రస్తుత ప్రభుత్వం అంటోంది. రాజకీయ కోణంలో పరిశీలిస్తే కావాలని గత ప్రభుత్వం తమకు అనుకూలంగా వాదించి తీర్పులు ఇప్పించుకునేందుకు పన్నిన వ్యూహంలో భాగంగా వీరి నియామకం జరిగిందని భావించి టీడీపీ ప్రభుత్వం ఈ పోస్టులను ఏకంగా రద్దు చేసినట్లు సమాచారం.

గత ప్రభుత్వం వీరిని ఎందుకు నియమించింది?

ప్రతి కోర్టులోనూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ప్రభుత్వం తరపున వాదించేందుకు ఉన్నారు. వారు కాకుండా ప్రత్యేకంగా సీఐడీ కేసులు వాదించేందుకు ప్రత్యేక ప్రాసిక్యూటర్స్ నియామకం వెనుక రాజకీయాలు ఉన్నాయని ప్రస్తుత ప్రభుత్వం భావించింది. సిఐడిని అప్పటి ప్రతిపక్షమైన టీడీపీపై కక్ష తీర్చుకునేందుకే ఉపయోగించిందనే ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ వారు ప్రతిపక్షంపై దూకుడుగా వ్యవహరిస్తూ పలు కేసులు నమోదు చేశారని, ఆ కేసులు సక్రమమేనంటూ వాదించేందుకు ప్రత్యేకంగా సీఐడీ న్యాయవాదులంటూ పోస్టులు క్రియేట్ చేసి 13 కోర్టుల్లో నియమించినట్లు టీడీపీ వారు చెబుతున్నారు. అయితే పెండింగ్ కేసులు లేకుండా చేసేందుకే ఈ పోస్టులు క్రియేట్ చేసినట్లు వైఎస్సార్సీపీ చెబుతోంది. కేవలం వైఎస్సార్ సీపీపై కక్షతోనే ఈ పోస్టులు రద్దు చేసినట్లు వైఎస్సార్సీపీ వారు ఆరోపిస్తున్నారు.

స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులు రద్దు

జీవో ఆర్టీ నెంబరు 885 ద్వారా సిఐడీ వారు లా డిపార్ట్ మెంట్ నుంచి నియమించిన 13 మంది స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్వపు 13 జిల్లాలకు ఎస్పిపిలను ప్రభుత్వం నియమించింది. వీరు జిల్లాల్లోని ఫస్ట్ క్లాస్ కోర్టులు, సెషన్స్ కోర్టుల్లో వాదిస్తారు. విజయనగరం జిల్లాకు నండూరి వెంకట సత్య లింగేశ్వర్, విశాఖపట్నం ఎ శేషుబాబు, కాకినాడ పిల్లి శ్రీనివాస్, ఏలూరు మంద్ర రాజేంద్ర, మచిలీపట్నం కె మెహర్ ప్రసాద్, విజయవాడ బెల్లపు సత్యనారాయణ, గుంటూరు గొట్టం శివప్రసాదరెడ్డి, ఒంగోలు కొల్లా నాగేశ్వరరావు, నెల్లూరు నన్నం కనకదారి చెన్నయ్య, చిత్తూరు పనతి విజయ కృష్ణారెడ్డి, అనంతపురం పి రాజశేఖర్, కర్నూలు వి నాగలక్ష్మి, కడప జి వెంకటేశ్వరరెడ్డిలు నియమితులయ్యారు. వీరందరూ ఇకపై విధుల్లో ఉండే అవకాశం లేదు.

పదవీ కాలం మూడేళ్లు..

ఎస్పీపీల పదవీ కాలం మూడు సంవత్సరాలు. అయితే ప్రభుత్వం జీవో ఇవ్వడంతో శుక్రవారం నుంచి ఈ పోస్టులు పూర్తిగా రద్దయ్యాయి. ఈ పోస్టుల్లో ఉన్న వారికి ఇప్పటి వరకు నెలకు రూ. 40వేలు జీతం ఇచ్చారు. అయితే అనుకున్న విధంగా కేసులు పరిష్కారం కావడం లేదని, అందువల్ల ప్రభుత్వానికి భారం తప్ప ఉపయోగం లేదని భావించి తొలగించినట్లు ప్రభుత్వం చెబుతోంది. 2023లోనే వీరిని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా అప్పటి ప్రభుత్వం నియమించింది. తమకు ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికీ తొలగించారని, అలా తొలగించేందుకు వీలు లేదని ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా? అనేది కూడా చర్చకు దారితీసింది. అయితే ఇవి రాజకీయ కోణంలోనే జరిగాయి కాబట్టి ఎవ్వరూ పట్టించుకునే అవకాశం లేదనే వాదన కూడా ఉంది.

Read More
Next Story