ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో భారీ కుదుపు
x

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో భారీ కుదుపు

75 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఉద్యోగుల భద్రతకు గండి


ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ACA)లో గత కొన్ని నెలలుగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 75 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా స్థిర ఉద్యోగులను ఒత్తిడి చేసి రాజీనామాలు చేయించడం, ఇష్టాయిష్టాలకు తగ్గట్టు కొత్త నియామకాలకు రంగం సిద్ధం చేయడం వంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్ నేతృత్వంలోని ప్రస్తుత కమిటీ 2024 సెప్టెంబర్‌లో అధికారం చేపట్టిన తర్వాత ఈ పరిణామాలు వేగం పుంజుకున్నాయి. 2025లో జరిగిన ఎన్నికల్లోనూ ఈ కమిటీయే తిరిగి గెలిచింది.

విశాఖ స్టేడియం మరమ్మతుల్లో అక్రమాల ఆరోపణలు

గతేడాది చివర్లో విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం మరమ్మతులకు సుమారు 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే అసోసియేషన్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చేయని పనులకు బిల్లులపై సంతకాలు చేయడానికి నిరాకరించారు. దీంతో అధ్యక్షుడి సొంత కంపెనీకి చెందిన సిబ్బంది ద్వారా పనులు పూర్తి చేయించి, అధికారిక ఇంజినీర్ల సంతకాలు లేకుండానే నిధులు విడుదల చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ విభాగం మొత్తాన్ని రాజీనామా చేయాలని మెయిల్ ద్వారా ఆదేశాలు పంపించారు.


విశాఖపట్నం ఏసీఏ క్రికెట్ స్టేడియం

40 ఏళ్ల అనుభవం ఉన్న అటెండర్‌కు గుండెపోటు

ఏసీఏలో నాలుగు దశాబ్దాలుగా పనిచేస్తున్న అటెండర్ ఖాశీంను ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించారు. కారణం ఆయన తెల్లటి షర్టు, ప్యాంటు వేసుకుని ఆఫీసుకు రావడం కమిటీ వారిలో కొందరికి నచ్చలేదు. ఏసీఏ ఇచ్చే టీ-షర్టులు ధరించాలని సూచించగా ఖాశీం దానికి అలవాటు లేదని, ఏకరూప దుస్తులు ఇస్తే వాటిని ధరిస్తానని చెప్పారు. అందుకు కమిటీలోని కొందరు అంగీకరించ లేదు. ఫలితంగా ఉద్యోగం పోగొట్టుకున్న ఆయన ఒత్తిడితో గుండెపోటుకు గురై ప్రస్తుతం విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా బెదిరింపు

ఏసీఏ ఆఫీసు నుంచి సుమారు 50 మంది ఉద్యోగులను విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతర్గత విషయాలు బయటకు పంపుతున్నారనే ఆరోపణలతో నాలుగు రోజుల పాటు ఫోన్లు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ఉద్యోగులు తెలిపారు.

లాయర్‌పై ఒత్తిడి

ఉద్యోగుల తరఫున కోర్టుల్లో కేసులు వేస్తున్న లాయర్ హుస్సేన్‌ను బెదిరించి కేసులు ఉపసంహరించేలా ఏసీఏ లోని కొందరు సభ్యులు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఓ రిటైర్డ్ మహిళా క్రికెటర్ ద్వారా ఫోన్ చేయించి అసభ్యంగా మాట్లాడినట్టు ఆరోపిస్తూ హుస్సేన్‌పైనే కేసు పెడతామని బెదిరించినట్టు సమాచారం. దీంతో ఆయన ఏసీఏ ఉద్యోగుల నుంచి కోర్టులో ఉన్న కేసులు ఉప సంహరించుకున్నారు.

కోచ్‌లు, ఇతర సిబ్బంది తొలగింపు ప్రక్రియ

ఇంజినీరింగ్ విభాగం తర్వాత కోచింగ్ సిబ్బందిని కూడా తొలగించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. బి శ్రీనివాసులు (పేరు మార్చాము) వాలీబాల్ కోచ్ మాట్లాడుతూ త్వరలో నేను రిటైర్డ్ కాబోతున్నాను. అటువంటి నన్ను తొలగించి ఏమి మూటగట్టుకోవాలనుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. రిటైర్డ్ అయిన ఉద్యోగుల స్థానంలో వారికి కావాల్సిన వారిని నియమించుకోవచ్చు. ఏ పార్టీకి సంబంధం లేకుండా పనిచేస్తున్న తనను ఉద్యోగం నుంచి కారణం లేకుండా తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. పైగా ఏసీఏలో నుంచి తొలగిస్తున్న వారికి ఎవ్వరికీ నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వటం లేదని, బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడ నుంచి విశాఖకు వైఎస్సార్సీపీ హయాంలో మార్చారు. ఇప్పుడు మళ్లీ విజయవాడకు మార్చే ప్రక్రియలోనూ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

గత వైఎస్సార్‌సీపీ హయాంలో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజును తప్పించి రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి అనుయాయులు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఒక్క ఉద్యోగినీ తొలగించలేదని, కానీ ప్రస్తుత కమిటీ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఈ అంశాలపై ఏసీఏ అధికారులు ఇంకా అధికారికంగా స్పందించలేదు.

Read More
Next Story