
వాయుగుండం ప్రతీకాత్మక చిత్రం
వేళ గాని వేళ.. అరుదైన వాయుగుండం!
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం. దీనివల్ల చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో వర్షాలు, మిగతా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగిన భావన కలిగిస్తుంది.
ఈశాన్య రుతుపవనాల సీజను అక్టోబర్ నుంచి డిసెంబరు వరకు కొనసాగుతుంది. ఆ సమయంలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులు ఏర్పడుతుంటాయి. వాటి ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని సార్లు అత్యంత భారీ వర్షాలు కురుస్తుంటాయి. డిసెంబర్ ఆఖరి వారంతో ఈశాన్య రుతుపవనాలు బలహీన పడతాయి. దీంతో ఇక అప్పట్నుంచి వర్షాలు కనుమరుగవుతాయి. శీతాకాలం తీవ్ర రూపం దాల్చి చలి విజృంభిస్తుంది. మళ్లీ మార్చి వరకు వానలకు ఆస్కారం ఉండదు. ఈ నేపథ్యంలో జనవరి నెలలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడవు. ఎప్పుడైనా ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే అవి అత్యంత అరుదుగా సంభవిస్తుంటాయి.
ఈస్టర్లీ వేవ్స్‌ను తెలిపే శాటిలైట్ చిత్రం
బంగాళాఖాతంలో రేపటికి వాయుగుండం..
ఇప్పుడు బంగాళాఖాతంలో అలాంటి అరుదైన వాయుగుండమే ఏర్పడింది. సోమవారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి బుధవారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం నాటి బులెటిన్‌లో వెల్లడించింది.
దీని ప్రభావం ఏ ప్రాంతంపై ఉంటుంది?
నైరుతి బంగాళాఖాతంలో బలపడనున్న వాయుగుండం ప్రభావం ఎక్కువగా దక్షిణ తమిళనాడుపై ఉండనుంది. ఆ ప్రాంతంలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. దానికి చేరువలో ఉన్న దక్షిణాంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వచ్చే రెండు మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో గంటకు 45–50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది.
చలి తీవ్రత పెరుగుతున్న అనుభూతి..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2–3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. దీనికి తూర్పు గాలులు తోడు కానున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న చలి తీవ్రతకంటే మరింత ఎక్కువగా ఉండే అనుభూతి కలుగుతుందని వాతావరణ శాఖ అధికారి ఒకరు ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధికి చెప్పారు. ‘దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలతో పోల్చుకుంటే ఉత్తరాంధ్రలో చలి తీవ్రత ఎక్కువ అనిపిస్తుంది. వాయుగుండం బలహీన పడే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆపై మేఘాలేర్పడ్డాక కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి చలి ప్రభావం కాస్త తగ్గుతుంది’ అని వివరించారు.
ఓఎస్‌ఆర్‌యూ భానుకుమార్
వాయుగుండానికి ఈస్టర్లీ వేవ్సే కారణం..
ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడడానికి పసిఫిక్ మహాసముద్రంపై ఈస్టర్లీ వేవ్స్ ప్రభావమే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ‘ఈశాన్య రుతుపవనాల సీజను ముగిశాక జనవరిలో అల్పపీడనాలు, వాయుగుండాలు చాలా అరుదుగా ఏర్పడుతుంటాయి. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో ఈస్టర్లీ వేవ్స్ ప్రభావం వల్ల తాజా అల్పపీడనం ఏర్పడింది. ఇలాంటివి గతంలో జనవరి, సంక్రాంతి రోజుల్లోనూ సంభవించిన పరిస్థితులున్నాయి. ఒక్కోసారి ఈస్టర్లీ వేవ్స్ వల్ల తుపాను సమయంలో కురిసే వర్షాలను కూడా కురిపిస్తుంటాయి’ అని విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణం, సముద్ర అధ్యయన విభాగం పూర్వ అధిపతి ఓఎస్‌ఆర్‌యూ భానుకుమార్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.
160 ఏళ్లలో జనవరిలో నాలుగే తుపాన్లు..
జనవరి నెలలో తుపాన్లు అరుదుగా ఏర్పడుతుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం తమిళనాడు, ఆంధ్రప్రపదేశ్‌ల్లో జనవరిలో గడచిన 160 ఏళ్లలో కేవలం నాలుగు సార్లే తుపాన్లు సంభవించాయని వీరు ఉదహరిస్తున్నారు. ఉదాహరణకు 1926, 1939, 2005 సంవత్సరాల్లో జనవరి నెలలో వాయుగుండాలు/తుపాన్లు సంభవించాయి. తాజాగా రెండ్రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడబోతోంది.
ఇది కూడా చూడండి
Next Story

