ఆమ్ ఆద్మీ పార్టీ థర్డ్ లిస్ట్ రిలీజ్..
x

ఆమ్ ఆద్మీ పార్టీ థర్డ్ లిస్ట్ రిలీజ్..

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు తేదీ దగ్గర పడుతుండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీగా ఉంది. ఇప్పటి దాకా 40 మంది పేర్లను ప్రకటించింది.


హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు 11 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం అర్థరాత్రి మూడో జాబితాను విడుదల చేసింది. అంతకుముందు ఆ పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. రెండు జాబితాల్లో హర్యానా ఆప్ అధ్యక్షుడు సుశీల్ గుప్తా పేరు లేదు. కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల చర్చలు విఫలమవడంతో ఆప్ 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సోమవారం విడుదల చేసింది. 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో 40 మంది అభ్యర్థులను పార్టీ ఇప్పటివరకు ప్రకటించింది.

AAP తన మూడవ జాబితాలో గర్హి సంప్లా-కిలోయ్ నియోజకవర్గం నుంచి హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అనుభవజ్ఞుడైన భూపిందర్ సింగ్ హుడాపై ప్రవీణ్ గుస్ఖానీని పోటీలో నిలిపింది. మిగిలిన వారిలో రాదౌర్ నుంచి భీమ్ సింగ్ రాఠీ, నీలోఖేరి నుంచి అమర్ సింగ్, ఇస్రానా నుంచి అమిత్ కుమార్, ఝజ్జర్ నుంచి మహేందర్ దహియా, రేవారి నుంచి సతీష్ యాదవ్, హతిన్ నుండి కల్నల్ (రిటైర్డ్) రాజేంద్ర రావత్ బరిలో ఉన్నారు.

నిన్న తొమ్మిది మందితో రెండో జాబితా..

రెండో జాబితాలో సధౌరా నుంచి రీటా బమానియా, థానేసర్ నుంచి కిషన్ బజాజ్, ఇంద్రి నుంచి హవా సింగ్ పోటీ చేయనున్నారు. అలాగే రాటియా నుంచి ముఖ్తియార్ సింగ్ బాజిగర్, అడంపూర్ నుంచి భూపేంద్ర బెనివాల్, బర్వాలా నుంచి ఛతర్ పాల్ సింగ్‌ బరిలో నిలిచారు. బవాల్‌ నుంచి జవహర్‌లాల్‌ , ఫరీదాబాద్‌ నుంచి ప్రవేశ్‌ మెహతా, తిగావ్‌ నుంచి అబాష్‌ చండేలా పోటీ చేయనున్నారు.

ఆప్ హామీలివి..

తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ, పంజాబ్‌ల మాదిరిగానే రాష్ట్రంలో ఉచిత విద్యుత్, 24 గంటల విద్యుత్ సరఫరా ఉంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో సునీతా కేజ్రీవాల్ ఇటీవల హర్యానాలో పర్యటించారు. ‘‘నగరాలు, గ్రామాల్లో ' మొహల్లా [పొరుగు] క్లినిక్‌లు ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉపాధి కల్పిస్తాం. ప్రతి మహిళకు నెలకు రూ.1,000 అందుతుంది. త్వరలో ఈ పథకాన్ని ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్ ప్రభుత్వం అమలు చేస్తుంది.’’ అని ప్రకటించారు.

అక్టోబర్ 5న పోలింగ్..

నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 12. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేయగా, పంజాబ్‌లో విడివిడిగా పోటీ చేశాయి. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో హర్యానాలో ఆప్‌కి కాంగ్రెస్‌ ఒక సీటు ఇవ్వగా ఓటమి పాలయ్యారు. 2019 హర్యానా ఎన్నికల్లో ఆప్ 46 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.

Read More
Next Story