
ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కావాలి
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ను కోరిన ఏపీజేఏసీ అమరావతి నేతలు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను తక్షణం పరిష్కరించాలంటూ ఏపీజేఏసీ అమరావతి నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయాలి
ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు నేతృత్వంలోని నేతలు మంత్రిని కలిసిన సందర్భంగా ప్రధాన డిమాండ్లను వివరించారు. 2004కి ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఎంపికైన అన్ని ఉద్యోగులకు యాక్టు 57 ద్వారా పాత పెన్షన్ స్కీమ్ (OPS) అమలు చేయాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వం తన మార్గదర్శకాల మేరకు 2004కి ముందు నోటిఫికేషన్ వచ్చి, సెప్టెంబర్ 1, 2004 తర్వాత నియమితులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు OPS వర్తింపజేసినట్లుగానే రాష్ట్రంలోనూ అదే విధానం అమలు చేయాలని సూచించారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి
పబ్లిక్ సెక్టర్, గురుకులాలు, సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ తక్షణం క్రమబద్ధీకరించాలని, కూటమి ప్రభుత్వ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కూడా కోరారు.
గత ప్రభుత్వంలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి?
అక్టోబర్ 18, 2025న ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చించి, అదే రోజు ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో మహిళల చైల్డ్ కేర్ లీవ్, ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు, ఒక డీఏ మంజూరు, పోలీసు ల సరెండర్ లీవు వంటి కొన్ని సమస్యలు పరిష్కరించినా, గత ప్రభుత్వ హయాంలోనే పెండింగ్‌లో ఉన్న ప్రధాన ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని ఈ అంశాల వల్ల ఉద్యోగులు, పెన్షనర్లలో పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ అసోసియేట్ చైర్మన్ టి.వి. ఫణిపేర్రాజు, కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు, ఏపీ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకటరాజేష్, ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు, క్లాస్-4 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యస్. మల్లేశ్వరరావు, ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జివి నరసయ్య లు పాల్గొన్నారు.

