మొక్కజొన్న రైతులకు ‘శాపం’.. మధ్యవర్తులకు ‘బంగారం’!
x
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం కొమరోలు గ్రామం వద్ద కొత్తగా ఏర్పాటైన అడ్వాంటా మొక్కజొన్న ప్రాసెసింగ్ యూనిట్ వద్ద మొక్కజొన్న నిల్వలు

మొక్కజొన్న రైతులకు ‘శాపం’.. మధ్యవర్తులకు ‘బంగారం’!

మొక్కజొన్న పంటను కొనుగోలు చేయకుండా చేతులెత్తేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం


మొక్కజొన్న “మేము కొనలేము” అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు ప్రకటించడం రైతు సమాజంలో తీవ్ర ఆందోళన, ఆగ్రహానికి దారితీసింది. ఇది కేవలం ఒక మంత్రి మాట కాదు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతా రాహిత్యానికి, రైతు వ్యతిరేక వైఖరికి స్పష్టమైన సంకేతం. రబీ సీజన్‌లో వరి తర్వాత రెండవ అత్యధిక సాగు జరిగిన మొక్కజొన్న పంట రైతులను డిస్ట్రెస్ సేల్‌కు నెట్టి, మధ్యవర్తుల జేబులు నింపుతోంది. ప్రభుత్వం మాత్రం “కేంద్రానికి లేఖ రాశాం” అని చేతులు దులుపుకుంటోంది.

వాస్తవాలు ఎలా ఉన్నాయంటే...

వ్యవసాయ శాఖ రెండవ ముందస్తు అంచనా ప్రకారం రబీలో మొక్కజొన్న సాగు 1.96 లక్షల హెక్టార్లు, ఉత్పత్తి 16.31 లక్షల టన్నులు మాత్రమే అని అంచనా వేశారు. కానీ క్షేత్ర స్థాయిలో సాగు 5.02 లక్షల హెక్టార్లు (255 శాతం అధికం)కు చేరుకుంది. ఫలితంగా ఉత్పత్తి 30 నుంచి 35 లక్షల టన్నులు మించి, కొన్ని అంచనాల ప్రకారం 41.5 లక్షల టన్నుల వరకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 12.41 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్‌టీఆర్, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో అత్యధిక సాగు నమోదైంది.

దారుణంగా పడిపోయిన ధరలు

కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటాల్‌కు రూ. 2,400 ఉన్నప్పటికీ, మార్కెట్‌లో ధరలు దారుణంగా పడిపోయాయి. తాజా మార్కెట్ వివరాల ప్రకారం సగటు ధర రూ. 1,500 రూ. 1,800 మధ్య మాత్రమే. కొన్ని ప్రాంతాల్లో రూ. 1,400 వరకు కూడా పడిపోయింది. పంట ఉత్పత్తి ఖర్చు క్వింటాల్‌కు రూ. 2,000 రూ. 2,200 ఉండగా, రైతులు క్వింటాల్‌కు రూ. 600 రూ. 900 నష్టపోతున్నారు. ఒక్క మొక్కజొన్న రైతులే రూ.2,500 నుంచి రూ.3,000 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవక పోవడంతో మార్కెట్‌లో పోటీ లేక మధ్యవర్తులు రైతులను ఒత్తిడికి గురి చేసి తక్కువ ధరలకు పంటను కొనుగోలు చేస్తున్నారు. ఇది రైతులకు శాపం, మధ్యవర్తులకు బంగారం!


ప్రాసెసింగ్ పూర్తయి ఎగుమతికి సిద్ధంగా ఉన్న మొక్కజొన్న బ్యాగ్ లు

గతంలో ఎలా ఉంది...

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019-20లో 4.17 లక్షల టన్నులు, 2020-21లో 3.06 లక్షల టన్నులు, 2022-23లో 73,302 టన్నులు మార్క్‌ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసింది. గత ఖరీఫ్‌లో కూడా తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్నను నేరుగా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఎంఎస్‌పీకి కొనుగోలు చేస్తున్నాయి. కానీ ఏపీలో? “మేము కొనలేము” అని మంత్రి ప్రకటన, సీఎం చంద్రబాబు కేవలం కేంద్రానికి లేఖ రాయడం. ఇది రైతు సమస్యను ‘కేంద్రం మీదకు’ నెట్టేసి చేతులు కడుక్కోవడం కాదా?

ఆకాశాన్ని అంటుతున్న ప్రకటనలు

క్షేత్ర స్థాయిలో రైతు కళ్లలో కన్నీరు, పంటలు నష్టాలు. గడచిన రెండు ఖరీఫ్‌లు, రెండు రబీల్లో అనేక పంటల రైతులు ఇదే సంక్షోభంలో కూరుకుపోయారు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలోకి వెళ్తోంది. కూటమి ప్రభుత్వం కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్నప్పటికీ నేరుగా కొనుగోలు చేయకపోవడం, కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం ఉద్దేశపూర్వకంగా మధ్యవర్తులకు లాభం చేకూర్చడం కాదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.


కేంద్ర మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు

వ్యవసాయ మంత్రి ఏమంటున్నారు...

ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు శనివారం క్యాంపు కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల వద్ద నిల్వ ఉన్న 1,78,250 టన్నుల మొక్క జొన్నను కొనుగోలు చేయాలని కోరారు. అయితే 15వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేసేందుకు కేంద్రం అంగీకరించింది.

YSRCP ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ యం వీ యస్ నాగిరెడ్డి

మాట్లాడుతూ “ప్రభుత్వం క్షేత్ర స్థాయి వాస్తవాలపై దృష్టి పెట్టాలి. వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి ఎంఎస్‌పీకి పంట కొనుగోలు చేయాలి. లేదంటే రైతుల సంక్షోభం మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది” అని అన్నారు. ప్రభుత్వం ఇంకా నిద్రపోతే, రైతుల కన్నీరు రాజకీయ ఖర్చుగా మారుతుంది. మొక్కజొన్న ఉత్పత్తి రైతులకు ఆదాయం కాకుండా రుణభారంగా మారుతోంది. ఇది కేవలం ఒక పంట సమస్య కాదు. రాష్ట్ర రైతాంగం భవిష్యత్తు. ప్రభుత్వం ఇంకెంత కాలం చేతులు దులుపుకుంటుంది అని ఆయన ప్రశ్నించారు.

Read More
Next Story