
వైభవ్ ను వన్డే జట్టులోకి తీసుకోవాలి: మాజీలు
గిల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాలన్న ఫరూక్ ఇంజనీర్
జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్ అతడిని వెంటనే వన్డే జట్టులోకి తీసుకోవాలని సూచించగా, జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ కూడా అతడి ప్రతిభ, పరిణితిని కొనియాడారు.
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండు అర్ధశతకాలతో మొత్తం 151 పరుగులు చేసిన సూర్యవంశీ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును అందుకున్నాడు. మూడు ఇన్నింగ్స్‌లలో 50.33 సగటుతో పరుగులు చేసిన అతడు, చివరి టీ20లో మెరుపు వేగంతో 81 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
అయితే, ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన అరంగేట్ర టీ20 సిరీస్‌లో సూర్యవంశీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆ సిరీస్‌లో వరుసగా 13, 14, 15 పరుగులకే పరిమితమైన అతడు చివరి మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. భారత్ ఆ సిరీస్‌ను 0-4తో కోల్పోయింది.
వన్డేల్లో ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలి: ఫరూఖ్ ఇంజనీర్
సూర్యవంశీ ప్రదర్శనపై స్పందించిన మాజీ వికెట్‌కీపర్ ఫరూఖ్ ఇంజనీర్, 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు అతడిని భారత వన్డే జట్టులోకి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మతో కలిసి సూర్యవంశీ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే జట్టుకు మంచి ఆరంభం లభిస్తుందని ఆయన అన్నారు.
శుభ్‌మన్ గిల్ క్లాస్ బ్యాట్స్‌మన్ అని పేర్కొన్న ఇంజనీర్, అతడిని నాలుగో స్థానంలో ఆడిస్తే బ్యాటింగ్ క్రమం మరింత బలపడుతుందని సూచించారు. రోహిత్-సూర్యవంశీ ఎడమ-కుడి చేతి వాటం కలయిక ప్రత్యర్థులకు సవాలుగా మారుతుందని, విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయొచ్చని చెప్పారు.
సూర్యవంశీ జీనియస్ ఆటగాడు
టీ20, వన్డే ఫార్మాట్ల మధ్య పెద్దగా తేడా లేదని వ్యాఖ్యానించిన ఇంజనీర్, సూర్యవంశీ లాంటి ఆటగాడికి వన్డేల్లో కూడా అవకాశమివ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించే ఆత్మవిశ్వాసం అతడికి ఉందని, అలాంటి ఆరంభం జట్టుకు అనేక మ్యాచ్‌లు గెలిపిస్తుందని పేర్కొన్నారు.
షార్ట్ బంతులను సులభంగా సిక్సర్లుగా మలిచే సామర్థ్యం సూర్యవంశీకి ఉందని, తన తప్పుల నుంచి నేర్చుకుని మరింత మెరుగైన ఆటగాడిగా ఎదుగుతున్నాడని చెప్పారు. అతడిపై అనవసర ఒత్తిడి తీసుకురాకుండా సహజ శైలిలో ఆడనివ్వాలని సూచించారు. దిగ్గజ బ్యాట్స్‌మన్ వివ్ రిచర్డ్స్‌ను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, సూర్యవంశీ కూడా భారత క్రికెట్‌కు గొప్ప ఆస్తిగా మారే సామర్థ్యం కలిగిన ఆటగాడని అభిప్రాయపడ్డారు.
పరిణితి అమోఘం: వీవీఎస్ లక్ష్మణ్
మరోవైపు, వీవీఎస్ లక్ష్మణ్ కూడా సూర్యవంశీపై ప్రశంసలు కురిపించారు. గత ఆరు నెలల్లో అతడి పరిణితి, ఆటపై అవగాహన గణనీయంగా పెరిగిందని అన్నారు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో క్లిష్ట పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నాడని వివరించారు.
చివరి టీ20లో సెంచరీ చేసే అవకాశం కోల్పోవడంతో సూర్యవంశీ నిరాశ చెందాడని, అయితే ఇది అతడి కెరీర్‌లో తొలి అవకాశం మాత్రమేనని, భవిష్యత్తులో ఇంకా ఎన్నో శతకాలు సాధించే అవకాశం ఉందని అతడికి చెప్పామని లక్ష్మణ్ వెల్లడించారు.
సూర్యవంశీ ప్రతిరోజూ తన ఆటను మెరుగుపరుచుకోవాలనే తపనతో ముందుకు సాగుతున్నాడని, అవసరమైన ప్రతిభ, నైపుణ్యం అతడికి పుష్కలంగా ఉన్నాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టే సామర్థ్యం సూర్యవంశీకి ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

