వాలీబాల్ కోర్టులో దుమ్ము రేపిన తిరుపతి కలెక్టర్!
తిరుపతి తారకరామ స్టేడియంలో ఘనంగా అమరావతి ఛాంపియన్ షిప్ 2026 పోటీలు ప్రారంభం
నిత్యం పరిపాలన వ్యవహారాల్లో బిజీగా ఉండే తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ సాలిజామల వెంకటేశ్వర్ వాలీబాల్ కోర్టులో ప్రత్యర్థి యువజట్లను ఢిఫెన్స్ లో పడేశారు. సర్వీస్ చేయడంలోనే కాకుండా క్రీడల్లో తనకు ఉన్న పట్టును ఆయన ప్రదర్శించిన తీరు అందరినీ ఫిదా చేసింది.
తిరుపతిలో వాలీబాల్ క్రీడా పోటీలను కలెక్టర్ డాక్టర్. వి. వెంకటేశ్వర్ లాంఛనంగా ప్రారంభించారు. ఒకపక్క జట్టులో యువక్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు. సర్వీస్ చేయడం, ఢిఫెన్స్, కట్ కొట్టడం తోపాటు క్రీడాకారులకు ఏమాత్రం తగ్గకుండా వాలీబాట్ కోర్టులో ఆయన ప్రదర్శించిన క్రీడాపటిమ ఆకట్టుకుంది. అంతకుముందు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడారు.
"అమరావతి ఛాంపియన్ షిప్ -2026 లో పాల్గొంటున్న క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేందుకు శిక్షణ ఇవ్వనున్నాం" అని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
రాష్ట్రంలో ఈ పోటీలను అండర్–17, అండర్–23 రెండు విభాగాల్లో, మొత్తం 12 క్రీడాంశాల్లో నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ పోటీలు చక్కటి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.
అనంతరం, వాలీబాల్ పోటీలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్, శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఎం. సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జీ. నరసింహ యాదవ్, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం చైర్మన్ మహేష్ యాదవ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోటా వాసు, శాప్ బోర్డ్ డైరెక్టర్ రజనీ పాల్గొన్నారు.

