
'ఢిల్లీ'కి చుక్కలు చూపించిన 'చెన్నై' సంజూ.. చరిత్ర సృష్టించెన్!
శాంసన్ సరికొత్త రికార్డు: హ్యాట్రిక్ POTM
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మళ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో సతమతమైనా, ఇప్పుడు నిలకడైన ఆటతీరుతో ప్రత్యర్థులను వణికిస్తోంది. ముఖ్యంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై మరో 15 బంతులు మిగిలి ఉండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
శాంసన్ సరికొత్త రికార్డు: హ్యాట్రిక్ POTM
ఈ మ్యాచ్‌లో అజేయంగా 87 పరుగులు చేసిన సంజూ శాంసన్, ఐపీఎల్ 2026లో మూడవసారి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' (POTM) అవార్డును అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేస్తూ 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు.
చారిత్రక భాగస్వామ్యం: సంజూ శాంసన్, యువ బ్యాటర్ కార్తీక్ శర్మ (41 నాటౌట్) కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 114 పరుగులు జోడించారు. 66 బంతుల్లోనే నమోదైన ఈ భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
ఢిల్లీపై ఆధిపత్యం: ఒకే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రెండుసార్లు వందకు పైగా భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్న ఏకైక బ్యాటర్‌గా సంజూ రికార్డు నెలకొల్పాడు.
చెన్నై ఐదో విజయం: ఈ విజయంతో చెన్నై ఈ సీజన్‌లో తన ఐదో విజయాన్ని నమోదు చేసుకుని ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.
మ్యాచ్ సాగిందిలా..
ఢిల్లీ తడబాటు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి చెన్నై బౌలర్లు చుక్కలు చూపించారు. స్పిన్నర్లు నూరహ్మద్ (2/22), అకీల్ హొసీన్ (1/19) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ 11 ఓవర్లకే 69 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. చివర్లో సమీర్ రిజ్వీ (40 నాటౌట్), స్టబ్స్ (38) రాణించడంతో 20 ఓవర్లలో 155 పరుగులు చేయగలిగింది.
సంజూ విధ్వంసం: స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రుతురాజ్ (6), ఉర్విల్ (17) త్వరగానే నిష్క్రమించారు. అయితే ఏడో ఓవర్ నుంచి సంజూ-కార్తీక్ జోడీ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడింది. కుల్దీప్ యాదవ్ ఓవర్లో 6, 6, 4 బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సంజూ, నటరాజన్ ఓవర్లోనూ అదే రీతిలో చెలరేగాడు. చివరికి 17.3 ఓవర్లలోనే చెన్నై లక్ష్యాన్ని చేరుకుంది.
సంజూ శాంసన్ మాటల్లో..
"మనకు ఏది బాగా వర్కవుట్ అవుతుందో అది గుర్తించి, ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉండాలి. ఈ ఫార్మాట్‌లో మన చేతులపై మనకు నమ్మకం ఉండాలి. నా ఫుట్ మూమెంట్‌పై కొంచెం పని చేశాను, అది ఇప్పుడు ఫలితాన్నిస్తోంది."
ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. సంజూ శాంసన్ ఫామ్ ఆ జట్టుకు కొండంత అండగా మారింది.
Next Story

