అంతర్జాతీయ క్రికెట్ కు రహానే గుడ్ బై
x
రహానే

అంతర్జాతీయ క్రికెట్ కు రహానే గుడ్ బై

36 పరుగుల అవమానం నుంచి గబ్బా గెలుపు వరకు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ముగింపు


2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. ఆస్ట్రేలియా గడ్డ.. అడిలైడ్ టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే కుప్పకూలింది. భారత టెస్టు చరిత్రలోనే అత్యంత చేదు ఓటముల్లో ఒకటిగా అది నిలిచిపోయింది. ఆ మ్యాచ్ తర్వాత వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ స్వదేశానికి రావడంతో జట్టు నాయకత్వ బాధ్యతలు అజింక్య రహానే భుజాలపై పడ్డాయి.

ఆ సమయంలో టీమిండియాపై పెద్దగా ఆశలు లేవు. ప్రధాన ఆటగాళ్లు గాయాలతో దూరమవడం, 36 పరుగుల అవమానం, ఆస్ట్రేలియా సొంతగడ్డపై బలమైన ప్రత్యర్థి... ఈ పరిస్థితుల్లో భారత్ సిరీస్‌ను గౌరవప్రదంగా ముగిస్తే చాలని చాలా మంది భావించారు. కానీ రహానే మాత్రం ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేశాడు.

మెల్‌బోర్న్‌లో అద్భుతమైన సెంచరీతో జట్టుకు ఆత్మవిశ్వాసం నింపిన రహానే, యువ ఆటగాళ్లతో కూడిన జట్టును సమర్థంగా నడిపించాడు. చివరికి గబ్బాలో చారిత్రాత్మక విజయం సాధించిన భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుని, వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా గడ్డపైనే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంది. భారత క్రికెట్ చరిత్రలో ఆ విజయానికి రహానే నాయకత్వం ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది.

ఇప్పుడు అదే రహానే తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ వీడియోను పంచుకుంటూ అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. "ముందుకు సాగడానికి ఇదే సరైన సమయం" అని పేర్కొన్నాడు.

2013లో భారత జట్టులో అడుగుపెట్టిన రహానే, దాదాపు పదేళ్లకు పైగా దేశానికి సేవలందించాడు. ఈ కాలంలో 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 38.46 సగటుతో 5,077 పరుగులు చేసి 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలు నమోదు చేశాడు. వన్డేల్లో 2,962 పరుగులు సాధించి మూడు సెంచరీలు, 24 అర్ధసెంచరీలు చేశాడు. టీ20ల్లో 375 పరుగులు చేశాడు. 2023లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం భారత జట్టుకు దూరమైనా, ఈ ఏడాది ఐపీఎల్ వరకు కూడా తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కుతుందనే ఆశతో కొనసాగాడు.

వీడ్కోలు సందేశంలో రహానే జీవిత సత్యాన్ని గుర్తుచేశాడు. "ప్రతిదానికి ఒక ప్రారంభం ఉంటుంది.. అలాగే ముగింపు కూడా ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని గౌరవించి ముందుకు సాగాలి. నేను బ్యాటింగ్‌లో ఎప్పుడూ టైమింగ్‌ను నమ్ముకున్నాను. అందుకే ఇప్పుడు కూడా ఇదే సరైన సమయమని భావిస్తున్నాను" అని చెప్పాడు.

డోంబివాలి నుంచి ప్రాక్టీస్ కోసం రోజూ చేసిన ప్రయాణాలే తన క్రికెట్ జీవితానికి పునాది అని గుర్తుచేసుకున్నాడు. ప్రతి ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున ఆడాలన్నదే తన కల అని, దేశం కోసం ఆడే అవకాశం రావడం తన జీవితంలో అతిపెద్ద గౌరవమని పేర్కొన్నాడు.

అంతర్జాతీయ కెరీర్ ముగిసినా, క్రికెట్‌తో తన అనుబంధం కొనసాగుతుందని రహానే స్పష్టం చేశాడు. తర్వాతి తరానికి తన అనుభవాన్ని పంచుకోవాలని, ఈ ఆట తనకు నేర్పిన విలువలను యువ ఆటగాళ్లకు అందించాలని కోరుకుంటున్నానని తెలిపాడు.

తన పేరుకు ఉన్న అర్థాన్ని కూడా ఆసక్తికరంగా ప్రస్తావించాడు. "అజింక్య అంటే ఓడించలేనివాడు. కానీ క్రికెట్ నాకు ఓటమిని అంగీకరించడం నేర్పించింది. విజయాల కంటే పరాజయాలే ఎక్కువగా ఎదురవుతాయి. జట్టు కూడా ఓడుతుంది.. వ్యక్తిగతంగా తప్పులు కూడా జరుగుతాయి. కానీ అభిమానుల ప్రేమలో మాత్రం నేను ఎప్పుడూ ఓడిపోలేదు. నాపై మీరు చూపించిన ప్రేమ, నమ్మకం, మద్దతు జీవితాంతం గుర్తుండిపోతాయి" అని భావోద్వేగంగా చెప్పాడు.

జాతీయ జట్టుకు దూరమైన తర్వాత కూడా రహానే దేశీయ క్రికెట్‌లో చురుగ్గా కొనసాగాడు. ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తూ 2023-24 రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భపై విజయం సాధించి, జట్టుకు రికార్డు స్థాయిలో 42వ టైటిల్ అందించాడు.

సంఖ్యల పరంగా చూస్తే రహానే కెరీర్ గొప్పదే. కానీ గణాంకాలకంటే అతడిని చిరస్థాయిగా నిలబెట్టింది సంక్షోభ సమయంలో చూపించిన నాయకత్వం. 36 పరుగుల అవమానం తర్వాత కుంగిపోకుండా జట్టును నిలబెట్టి, గబ్బాలో చరిత్ర సృష్టించిన కెప్టెన్‌గా అజింక్య రహానే పేరు భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Read More
Next Story