పంజాబ్ కింగ్స్ కి మారనున్న హార్దిక్ పాండ్యా?
x

పంజాబ్ కింగ్స్ కి మారనున్న హార్దిక్ పాండ్యా?

ముంబై ఇండియన్స్ తో పీబీకేఎస్ చర్చలు సఫలం?


ముంబై ఇండియన్స్‌తోనే ఐపీఎల్ కెరీర్ ప్రారంభం.. ఆ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి తొలి సీజన్‌లోనే జట్టుకు టైటిల్ అందించాడు. రెండో సీజన్‌లోనూ జట్టును ఫైనల్‌కు చేర్చినా, తృటిలో ట్రోఫీ చేజారింది. అనంతరం తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు. అయితే ఈసారి కెప్టెన్‌గా వచ్చినా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాడు. అభిమానుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఇప్పుడు అతడిని జట్టు నుంచి తప్పించేందుకు ముంబై యాజమాన్యం సిద్ధమవుతోందా? ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భవితవ్యంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

గత కొన్ని ఐపీఎల్ సీజన్లుగా ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ప్లేఆఫ్‌కు చేరడం పక్కన పెడితే, కనీస పోటీ ఇవ్వడంలోనూ జట్టు విఫలమవుతోంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాలకు పరిమితమవుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వదులుకోవాలని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఇందులో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ముంబై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పాండ్యాకు బదులుగా పేసర్ అర్ష్‌దీప్ సింగ్, వికెట్ కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్‌ను ముంబైకి తీసుకురావాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ట్రేడ్‌పై రెండు ఫ్రాంచైజీలు దాదాపు అంగీకారానికి వచ్చినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ వారాంతంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

హార్దిక్ ఐపీఎల్ ప్రయాణం..

హార్దిక్ పాండ్యా ఐపీఎల్ కెరీర్‌ను ముంబై ఇండియన్స్‌తోనే ప్రారంభించాడు. 2015 నుంచి 2021 వరకు ఆ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాడు. ఈ కాలంలో 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబై టైటిళ్లు గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌కు మారిన హార్దిక్.. ఆ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. తొలి సీజన్‌లోనే టైటిల్ అందించగా, రెండో సీజన్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే 2024 ఐపీఎల్‌కు ముందు తిరిగి ముంబై ఇండియన్స్‌కు చేరి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. కానీ అప్పటి నుంచి జట్టు ప్రదర్శనతో పాటు, వ్యక్తిగతంగా కూడా అతడికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ప్రస్తుతం గాయం కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

హార్దిక్‌పై గిల్ ప్రశంసలు..

మరోవైపు, న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు ముందు ఆక్లాండ్‌లో మీడియాతో మాట్లాడిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. హార్దిక్ పాండ్యా సామర్థ్యాలను ప్రశంసించాడు. జట్టుకు అతడు అందించే ప్రయోజనాలు చాలా విలువైనవని పేర్కొన్నాడు.

కొత్త బంతితో బౌలింగ్ చేయడం నుంచి మధ్య ఓవర్లు, డెత్ ఓవర్ల వరకు బాధ్యతలు నిర్వహించగల సత్తా హార్దిక్‌కు ఉందని గిల్ వివరించాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించగల అతడు అరుదైన ఆల్‌రౌండర్ అని కొనియాడాడు. ఐపీఎల్ తర్వాత అతడు క్రికెట్‌కు దూరం కావడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డాడు.

హార్దిక్‌తో తాను పలుమార్లు మాట్లాడినట్లు గిల్ వెల్లడించాడు. ఇండియా ఏ తరఫున ఆడాల్సి ఉన్న సమయంలో అతడికి స్వల్ప నొప్పులు తిరిగి రావడంతో మ్యాచ్‌లకు దూరమయ్యాడని తెలిపాడు. త్వరలోనే కోలుకుని దేశవాళీ క్రికెట్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత తిరిగి భారత జట్టులోకి వస్తాడని గిల్ పేర్కొన్నాడు.

ఒకవైపు గాయం నుంచి కోలుకునే ప్రయత్నంలో ఉన్న హార్దిక్.. మరోవైపు ఐపీఎల్‌లో తన భవిష్యత్తుపై వస్తున్న వార్తలతో చర్చనీయాంశంగా మారాడు. అయితే ముంబై, పంజాబ్ ఫ్రాంచైజీల మధ్య జరుగుతున్నట్లు ప్రచారంలో ఉన్న ఆటగాళ్ల మార్పిడిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.


Read More
Next Story