
అయ్యయ్యో ఆస్ట్రేలియా! ఇక ఇంటికే..
టీ20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమణ
టీ20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియాకు భారీ షాక్! మాజీ ఛాంపియన్లు గ్రూప్ స్టేజ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు. వర్షం వల్ల మంగళవారం జరగాల్సిన ఐర్లాండ్ vs జింబాబ్వే మ్యాచ్ రద్దవడంతో ఆసీస్‌కు సూపర్ 8కి చేరే అవకాశం పూర్తిగా సన్నగిల్లాయి.
గ్రూప్ బీలో శ్రీలంక (6 పాయింట్లు) ఇప్పటికే సూపర్ 8కి క్వాలిఫై అయింది. ఐర్లాండ్-జింబాబ్వే మధ్య మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పల్లెకెలే స్టేడియంలో జరగాల్సి ఉంది. కానీ ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దైంది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ దక్కింది. జింబాబ్వే 5 పాయింట్లతో సూపర్ 8కి అర్హత సాధించింది.
ఆస్ట్రేలియా ఇప్పటికే ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓడిపోయి కేవలం 2 పాయింట్లతో ఉంది. శుక్రవారం (ఫిబ్రవరి 20) ఒమన్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచినా వారి ఖాతాలో గరిష్టంగా 4 పాయింట్లే వస్తాయి. దీంతో అది నామమాత్రపు మ్యాచ్ గా మిగలనుంది. సూపర్ 8 అవకాశం ఇప్పటికే ముగిసిపోయింది.
గ్రూప్ బీ నుంచి శ్రీలంక, జింబాబ్వే సూపర్ 8కి వెళ్లగా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ జట్లు రెండూ టోర్నీ నుంచి వైదొలగనున్నాయి. ఒమన్ మూడు మ్యాచుల్లోనూ ఓడి ఇప్పటికే నిష్క్రమించినట్టయింది.
ఇతర గ్రూపుల నుంచి భారత్ (గ్రూప్ ఏ), వెస్టిండీస్, ఇంగ్లాండ్ (గ్రూప్ సీ), దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ (గ్రూప్ డీ) సూపర్ 8కి అర్హత సాధించాయి. గ్రూప్ ఏ లో మరో స్లాట్ కోసం పాకిస్థాన్, యూఎస్‌ఏ మధ్య పోటీ ఉంది.
ఈ టోర్నీలో జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓటమి ఆస్ట్రేలియా జట్టును ఘోరంగా దెబ్బతీసినట్టయింది. 2021 ఛాంపియన్లుగా నిలిచిన ఆస్ట్రేలియా ఇప్పుడు గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. వర్షం ఆసీస్‌ను చివరి దెబ్బ తీసింది. దీంతో ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టాల్సి రావడంతో క్రికెట్ అభిమానులు సైతం విస్తుపోతున్నారు.

