
గ్యారీ సోబర్స్
‘‘సోబర్స్ లాంటి ఆటగాడు మళ్లీ రారు’’
విండీస్ దిగ్గజ క్రికెటర్ మృతిపై ఆటగాళ్ల సంతాప సందేశాలు
ఆరు బంతులకు ఆరు సిక్స్ లు మొట్టమొదట బాదిన మొనగాడు, టెస్టుల్లో 21 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ, పేస్, స్పిన్ బౌలర్, అత్యుత్తమ ఫీల్డర్, టెస్టుల్లో ఎనిమిది వేల పరుగులు.. 235 వికెట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఘనతలు ఎన్నెన్నో.. అలాంటి అలనాటి ఆటగాడు.. వాటన్నింటిని క్రికెట్ ప్రపంచానికి వదిలి శాశ్వతంగా రిటైర్ మెంట్ తీసుకున్నాడు.. ఆయనే విండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్.. 89 ఏళ్ల వయస్సులో వృద్ధాప్య సమస్యలతో బార్బడోస్ లో శుక్రవారం మరణించాడు. ఆయన మరణం పట్ల క్రీడా ప్రపంచం దిగ్భంతి వ్యక్తం చేసి ఘన నివాళులు అర్పించింది.
అత్యుత్తమ ఆల్-రౌండర్..
అన్ని కాలాలలోనూ అత్యుత్తమ ఆల్-రౌండర్‌గా విస్తృతంగా ప్రశంసలు పొందిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే నిస్సందేహంగా అది సోబర్స్ చెప్పవచ్చు. ఒక ఆకర్షణీయమైన బ్యాటర్, పేస్, స్పిన్ బౌలింగ్ రెండూ చేయగలడు. క్లోజ్-ఇన్ ఫీల్డర్‌గా, అలాగే ఇతర స్థానాల్లో కూడా ఉత్తమ ఫీల్డర్ గా గుర్తింపు పొందారు.
16 ఏళ్ల వయసులో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసి, ఏడాదిలోపే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన సోబర్స్, 21 ఏళ్ల వయసులో ట్రిపుల్ సెంచరీ( 365 నాటౌట్) తో క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. 1968లో నాటింగ్‌హామ్‌షైర్ తరఫున గ్లామోర్గాన్‌పై ఆడుతూ, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి బ్యాటర్‌గా కూడా అతనే నిలిచాడు.
1954 లో ప్రారంభమై రెండు దశాబ్దాల పాటు సాగిన తన అంతర్జాతీయ కెరీర్‌లో, సోబర్స్ 93 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 26 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు సాధించాడు. 8032 టెస్ట్ పరుగులు సాధించాడు. చాలా సంవత్సరాల తర్వాత జెఫ్రీ బాయ్‌కాట్ ఆ మార్కును అధిగమించే వరకు ఒక రికార్డుగా నిలిచింది. సోబర్స్ టెస్టుల్లో 235 వికెట్లు తీసి, 109 క్యాచ్‌లు అందుకున్నాడు. అతను ఒకే ఒక్క వన్డే ఆడి, ఒక వికెట్ తీశాడు.
గవాస్కర్.. గంగూలీ నివాళులు..
"అందరిలోకెల్లా గొప్ప ఆటగాడైన సర్ గారీ ఫీల్డ్ సోబర్స్ మరణవార్త విని నా హృదయం బరువెక్కింది. ఈ అందమైన ఆటను ప్రేమించే ప్రతి ఒక్కరికీ, సర్ గ్యారీ కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు. ఒక క్రికెటర్ ఎలా ఉండవచ్చో చెప్పడానికి ఆయనే అంతిమ ప్రమాణం.
ఈ రోజుల్లో మనం ఆల్‌రౌండర్ల గురించి మాట్లాడినప్పుడు, తరచుగా రెండు విభాగాలను సమతుల్యం చేసుకోగల ఆటగాళ్ల వైపు చూస్తాం. కానీ సర్ గ్యారీ? ఆయన ఐదింటిలోనూ ఆరితేరినవాడు. ఆయన కలలా బ్యాటింగ్ చేయగలడు, కొత్త బంతితో ఫాస్ట్-మీడియం బౌలింగ్ చేయగలడు, సునాయాసంగా సాంప్రదాయ లెఫ్ట్-ఆర్మ్ స్పిన్‌కు మారగలడు, రిస్ట్ స్పిన్ బౌలింగ్ చేయగలడు, షార్ట్ లెగ్ లేదా స్లిప్స్‌లో చిరుతపులిలా ఫీల్డింగ్ చేయగలడు.
ఆయన కాలర్లు పైకి మడిచి, ఆ సున్నితమైన, లయబద్ధమైన కరేబియన్ నడకతో క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టడాన్ని చూడటం అంటే, కదలికలో ఉన్న సంపూర్ణ వైభవాన్ని చూడటమే. ఆయన ఒక యుగాన్ని నిర్వచించిన అద్భుతమైన ఆనందంతో, తీవ్రమైన, పోటీతత్వపు హుందాతో ఆటను ఆడాడు." అని భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు.
"క్రికెట్ ప్రపంచానికి పూడ్చలేని నష్టం.. ఆ తరంలో అతని నైపుణ్యాలు చాలా మందికి తమ ప్రతిభను అంచనా వేసుకోవడానికి ఒక కొలమానంగా ఉండేవి.. అత్యంత అరుదైన వారిలో సోబర్స్ ఒకరు.. అతని ఆత్మకు శాంతి చేకూరాలి" అని భారత మాజీ కెప్టెన్ మాజీ బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ పీటీఐతో ఇలా అన్నారు.. "నేను అతని ఆటను ఎప్పుడూ చూడలేదు, కానీ అతని గురించి నాకు చాలా కథలు తెలుసు. అతను రిటైర్ అయిన తర్వాత నేను అతన్ని కొన్నిసార్లు కలిశాను. 1971లో ఆస్ట్రేలియా 'రెస్ట్ ఆఫ్ ది వరల్డ్'తో ఆడినప్పుడు అతను 254 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో అతని బ్యాటింగ్‌కు సంబంధించిన క్లిప్‌లు, రికార్డ్ చేసిన వీడియోలను నేను చూశాను. అతని టెస్ట్ రికార్డులు అద్భుతమైనవి." "ప్రపంచం ఇప్పటివరకు చూసిన గొప్ప ఆల్-రౌండర్ అని నేను చెబుతాను."
గొప్ప ఆటగాడు..
1967లో డ్రా అయిన చెన్నై టెస్టులో సోబర్స్ ఉత్తమ ఆటను తాను చూశానని అప్పటి స్పిన్ దిగ్గజం బీఎస్ చంద్రశేఖర్ అన్నారు. తాను బౌలింగ్ చేసిన వారిలో ఆ వెస్టిండీస్ దిగ్గజమే గొప్ప బ్యాటర్ అని అన్నారు. “నేను బౌలింగ్ చేసిన వారిలో ఆయనే గొప్ప బ్యాట్స్‌మెన్.
అతను నా వైవిధ్యాలన్నింటినీ చదవగలిగేవాడు. చాలా దూకుడుగా ఆడేవాడు. కానీ చెన్నైలో, అతను అత్యుత్తమ నాణ్యత గల రెండు అర్ధశతకాలు (95, 74 నాటౌట్) చేసి, సిరీస్ వెస్టిండీస్ గెలవడంలో సహాయపడ్డాడు” అని చంద్రశేఖర్ పీటీఐకి తెలిపారు. ఆయన మృతిపట్ల ఐసీసీ కూడా సంతాపం తెలిపింది. ఆయన మరణం క్రీడా ప్రపంచానికి తీరని లోటని పలువురు ఆటగాళ్లు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపాలు తెలిపారు.
Next Story

