Ghat Eligible ఈ స్టిక్కర్ తిరుమల బస్సులపైనే ఎందుకు కనిపిస్తుంది?
ఈ పదాల వెనుక కథేమిటో వివరించే వీడియో స్టోరీ.
తిరుమల ఘాట్ రోడ్డలో ప్రయాణించే ఆర్టీసీ బస్సులకు ఇంజిన్ పక్కన హెడ్ లైట్లకు పక్కనే ఫిట్ ఫర్ ఘాట్ ( FIT FOR GHAT ROAD) లేదా ఘాట్ ఎలిజిబుల్ అనే పదాలు కనిపిస్తాయి. 50 మంది ప్రాణాలు భద్రంగా ఉంటాయనేది ఏపీఎస్ ఆర్ టీసీ ఇచ్చే భరోసా. మిగతా బస్సులకు ఆ సదుపాయం ఎందుకు ఉండదనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీని వెనుక పెద్ద కథే ఉంది.
ఈ వివరాలు సమగ్రంగా వివరించే వీడియో కథనం ఇది
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తిరుమల మధ్య ప్రయాణించే 250 బస్సులకు మాత్రమే అనుమతి ఉంటుంది. రోజుకు 1200 ట్రిప్పులు తిరుపతి తిరుమల మధ్య తిరుగుతాయి. ఘాట్ రోడ్డులో ప్రయాణానికి ఆరు సాంకేతిక భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. బస్సులకు సీల్డ్ టైర్లు మాత్రమే వాడతారు. రీబటన్ టైర్లు వాడరు.
గతాన్ని పరిశీలిస్తే...
తిరుమలకు గతంలో టీటీడీ చిన్న బస్సులు తిరిగేవి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు (తిరుమల నుంచి తిరుపతికి వచ్చే రోడ్డు)లో అలిపిరికి ఎగువభాగం నుంచి దాదాపు నాలుగు దశాబ్దాల కిందట ఓ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటన రెండో ఘాట్ రోడ్డు అవసరాన్ని గుర్తు చేసింది. అది కూడా పూర్తయింది. ఆ తరువాత కొండ బస్సుల స్థానంలో ఆర్టీసీ బస్సులు వచ్చాయి. సాధారణ మార్గాల్లో ప్రయాణించే విధంగానే బస్సులు నడపడం, ప్రమాదాలకు ఆస్కారం కలగడం, బ్రేకులు ఫెయిల్ వంటి ఘటనల నేపథ్యంలో ఆర్టీసీ, టీటీడీ అధికారులు సమీక్షించారు. దీంతో తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో కొన్ని ఆరు రకాల ప్రామాణికాలు రూపొందించారు.
"అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఘాట్ రోడ్డులో ప్రయాణించడానికి 100% ఫిట్‌నెస్ ఉన్న బస్సులకు మాత్రమే "ఘాట్ ఎలిజిబుల్" (Ghat Eligible) అనే సర్టిఫికేషన్ ఇచ్చి బస్సుపై రాస్తారు. ఈ బోర్డు ఉందంటే ఆ బస్సు తిరుమల కొండపైకి వెళ్లడానికి అన్ని విధాలా సురక్షితమని అర్థం" అని తిరుపతి జిల్లా ప్రజా రవాణా శాఖాధికారి శ్రీనివాసరావు చెప్పారు.
నిరంతర తనిఖీ..
అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద ప్రతి బస్సును డిపో మెకానిక్‌లు లేదా మోటార్ వాహన తనిఖీ అధికారులు (MVI) భౌతికంగా తనిఖీ చేసిన తర్వాతే కొండపైకి అనుమతిస్తారు.
ఇవీ ఆ నిబంధనలు. ఒక వేళ పొరబాటుగా సాంకేతిక సమస్యతో ఇబ్బంది ఎదురైతే మాత్రం. డిపోలోని మెకానిక్కులు బాధ్యులవుతారు. ఈ విధంగా తిరుపతిలోని తిరుపతి1,2, అలిపిరి, మంగళం డిపోల నుంచి రోజుకు 240 సర్వీసులు తిరుపతి, తిరుమల మధ్య నడుస్తున్నాయి. ఇవే కాకుండా, పుత్తూరు శ్రీకాళహస్తి, మదనపల్లె, చిత్తూరు. కుప్పం, పలమనేరు నుంచి రెండు బస్సులు తిరుమలకు నడుపుతున్నారు.
బస్సులకు ఇచ్చే ఫిట్ నెస్ స్టాంప్
తిరుమల నుంచి తిరుపతికి రావడానికి ఘాట్ రోడ్డు 19 కిలోమీటర్లు. ఈమార్గంలో 36 హెయిర్ పిన్ బెండ్స్ లో బస్సు నడవానికి అతికష్టంగా ఉంటుంది. అందువల్లో డిపో మేనేజర్ తిరుమలకు వెళ్లే బస్సులపై ఫిట్ ఫర్ ఘాట్ అనే ఫిట్సెస్ స్టాంప్ వేయిస్తారు.
"అన్ని ఆర్టీసీ బస్సులు తిరుమలకు వెళ్లవు. అన్ని రకాలుగా ఫిట్‌నెస్ సాంకేతిక ప్రమాణాలు సిద్ధం చేస్తాం. 250 బస్సులకు మాత్రమే అనుమతి ఉంటుంది" అని తిరుపతి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు వివరించారు. బస్సులో ఎలాంటి ప్రత్యేక ప్రమాణాలు పాటిస్తామనేది ఆయన వివరించారు.
1: బ్రేక్ సిస్టమ్ - ప్రాణం: సాధారణ బస్సులకు ఒకసారి బ్రేక్ చెక్ చేస్తారు. తిరుమల బస్సులపై నిఘా ఉంటుంది మూడుసార్లు చెక్ చేస్తారు. ఫుట్ బ్రేక్, హ్యాండ్ బ్రేక్, ఎగ్జాస్ట్ బ్రేక్ (ఇంజిన్ బ్రేక్) వంద శాతం పనిచేసే విధంగా... బ్రేక్ లైనర్, బ్రేక్ ఆయిల్ లీకేజీ ఉంటే బస్సు ఆపేస్తారు.
2: టైర్లు, స్టీరింగ్: 80 శాతానికి పైగానే గ్రిప్ ఉన్న కొత్త టైర్లు మాత్రమే బస్సుకు వాడతారు. పంచర్ అయిన టైర్లు, అరిగిపోయినవి అస్సలు వాడరు. స్టీరింగ్ ప్లే ఉండదు. ఎందుకంటే మలుపుల్లో స్టీరింగ్ జామ్ అయితే ప్రమాదానికి ఆస్కారం ఉంటుంది. లోయలోకి జారుతుంది.
3: ఇంజిన్, క్లచ్ పవర్ : తిరుపతి నుంచి తిరుమల మార్గంలో ఘాట్ ఎక్కేటప్పుడు ఇంజిన్ ఆగకూడదు. అందుకే ఐదేళ్లలోపు బస్సులు. లేదా FC పాస్ అయిన బస్సులు మాత్రమే అనుమతిస్తారు. క్లచ్ ప్లేట్, గేర్ బాక్స్ స్మూత్ గా ఉండాలి. 1st, 2nd గేర్ లోనే ఘాట్ ఎక్కుతారు
4: డ్రైవర్ అర్హత: ఈ ప్రమాణాలు బస్సుకే కాదు. డ్రైవర్ కు కూడా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు. Ghat Eligible డ్రైవర్లు ప్రత్యేకంగా ఉంటారు. డ్రైవర్ కు ఘాట్ రోడ్డులో కనీసం మూడేళ్లు నడిపిన అనుభవం ఉండాలి. డ్రైవరుకు బీపీ. షుగర్, కంటి చూపు టెస్ట్ చేస్తారు. మందు మద్యం ఉన్నాడా అని తనిఖీ చేస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. కొత్త డ్రైవర్లకు తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు నడపడానికి అనుమతించరు.
5: కూర్చునే ప్రయాణం: సాధారణంగా సమతలంగా ఉన్న రోడ్డులో ప్రయాణించే బస్సుల్లో ప్రయాణికులు నిలబడి కూడా ప్రయాణిస్తారు. తిరుమల బస్సులో ఈ పద్ధతిని ఏమాత్రం అనుమతించారు. సీట్లు భర్తీ కాగానే, ఇంకెవరినీ ఎక్కనివ్వరు.
6: వేగం: తిరుమల ఘాట్ రోడ్డులో 19 కిలోమీటర్ల దూరాన్ని కనీస ప్రయాణం 40 నిమిషాలుగా టీటీడీ, ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. అంతకుమించి ముందుగా గమ్యస్థానం చేరితే, పనిష్‌మెంట్ తప్పదు నిదానంగా ప్రయాణించి, ప్రమాదాలు నిరవారించాలనేది ప్రత్యేకం. వేగం ఉన్నట్లు గమనించగానే అలిపిరి చెక్ పోస్ట్ వద్ద ఆపేస్తారు
7: విద్యుత్ బస్సులు: ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు అదనంగా 50 ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఆర్టీసీ నడుపుతోంది. వాటికి పూర్తి స్థాయి బ్యాటరీ పవర్ చెక్ చేసిన తరువాతే అనుమతిస్తారు.
Next Story

