x

ఏమిటీ 3 డీ ప్రింటింగ్ ఇల్లు? ఎలా కడతారు?

రాష్ట్రంలో తొలిసారి ఈ 3 డీ ఇళ్లను నిర్మిస్తున్నారు. తక్కువ ఖర్చుతో వేగంగా నిర్మించే ఈ ఇళ్లు ఎలా కడతారో చూద్దామా..


ప్రస్తుతం ఎటుచూసినా వినపడుతున్న మాట ఏఐ
అంతరిక్షం మొదలు ఆపరేషన్ల దాకా రోబోలదే రాజ్యం
ఇప్పుడు ఇళ్ల నిర్మాణం వంతు వచ్చింది.
దేశంలోనే తొలిసారి ఏపీలో 3 డీ ఇళ్ల నిర్మాణం మొదలైంది.
ఆ 3డీ ఏమిటో, ఈ ఇళ్లు ఏమిటో ఓ సారి చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ టెక్నాలజీతో దేశంలోనే తొలి పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ద్వారా 177 ఇళ్లను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అక్టోబర్ 4, 2026న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. రూ. 14 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఒక్కో ఇంటి నిర్మాణం కేవలం 10 రోజుల్లోనే పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
1. డిజైన్, సాఫ్ట్‌వేర్ ప్లానింగ్ (Design & Planning):
ముందుగా ఇంటి నమూనాను కంప్యూటర్‌లో 3డీ సాఫ్ట్‌వేర్ అంటే ఆటోక్యాడ్ లాంటి వాటి ద్వారా డిజైన్ చేస్తారు. ఈ డిజైన్‌ను 3డీ ప్రింటర్ అర్థం చేసుకునే కోడ్‌గా (G-Code) మారుస్తారు. గోడల మందం, ఎత్తు, కిటికీలు, తలుపులు ఎక్కడ రావాలో అంతా ఈ కోడ్‌లోనే స్పష్టంగా ఉంటుంది.
2. పునాది నిర్మాణం (Foundation):
3డీ ప్రింటింగ్‌లో కూడా పునాది మన మామూలు పద్ధతిలోనే తీస్తారు. నేల స్వభావాన్ని బట్టి తొవ్వుతారు. కాంక్రీట్, ఇనుముతో పటిష్టమైన పునాదిని- ప్లింత్ లెవల్ వరకు- మనుషులే నిర్మిస్తారు.
3. ప్రింటర్ ఏర్పాటు (Printer Setup):
పునాది పూర్తయ్యాక, ఇంటి నిర్మాణం జరిగే ప్రదేశం చుట్టూ భారీ రోబోటిక్ 3డీ ప్రింటర్‌ను అంటే గ్యాంట్రీ యంత్రాన్ని అమర్చుతారు. ఇది మన క్రేన్ లాగానే ఉంటుంది. ఈ యంత్రానికి ప్రత్యేకంగా తయారు చేసిన, త్వరగా గట్టిపడే కాంక్రీట్ మిశ్రమాన్ని పంప్ చేసే గొట్టాలు అనుసంధానం చేస్తారు.
4. గోడల ప్రింటింగ్ (Printing the Walls):
కంప్యూటర్ ఇచ్చే కమాండింగ్ ఆదేశాల ప్రకారం ఆ యంత్రం అంటే ఇప్పుడు మనం చెబుతున్న ప్రింటర్ నాజిల్ (Nozzle) నుంచి కాంక్రీట్ మిశ్రమం టూత్‌పేస్ట్ లాగా బయటకు వస్తుంది. ఇది పునాదిపై ముందుగా గీసిన అంచుల వెంబడి పొరలు పొరలుగా పడుతూ గోడల ఆకృతిని నిర్మిస్తుంది. తలుపులు, కిటికీలు వచ్చే చోట ప్రింటర్ దానంతటదే ఖాళీ వదిలేస్తుంది.
5. ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులు (Plumbing & Electricals):
ఈ ప్రింటర్ యంత్రం గోడలను నిర్మించేటప్పుడే వాటి మధ్యలో ఖాళీ ప్రదేశాలు (Hollow spaces) ఉండేలా డిజైన్ చేస్తారు. గోడలు ఒకట్రెండు అడుగుల ఎత్తుకు రాగానే ఆ ఖాళీల్లో ఎలక్ట్రికల్ పైపులు, ప్లంబింగ్ పైపులు అమర్చుతారు.
6. పిల్లర్లు, భీమ్‌ల ఏర్పాటు (Reinforcement & Beams):
గోడల మధ్య వదిలిన ఖాళీల్లో ఇనుప రాడ్లు దించి, సాధారణ కాంక్రీట్ నింపుతారు. ఇవే ఇంటికి పిల్లర్లలా బలాన్ని ఇస్తాయి. తలుపులు, కిటికీల పైభాగంలోకి అంటే లింటెల్ స్థాయికి ప్రింటింగ్ రాగానే, అక్కడ ఇనుప రాడ్లు పెట్టి భీమ్ (Beam) పోస్తారు. ఆ పైన మళ్లీ ప్రింటర్ తన పని కొనసాగిస్తుంది.
తలుపులు, కిటికీలు వచ్చే చోట ప్రింటర్ ఆగిపోతుంది. అక్కడ ముందుగానే ఫ్రేమ్ (లేదా సపోర్ట్) పెడతారు, దాని పైనుంచి మళ్లీ ప్రింటింగ్ కొనసాగుతుంది. గోడలు పైవరకు వచ్చాక.. U-ఆకారంలో ఒక కాంక్రీట్ పొరను ప్రింట్ చేసి, అందులో ఇనుప రాడ్లు పెట్టి కాంక్రీట్ పోసి పటిష్టమైన రింగ్ భీమ్ (Ring Beam) తయారు చేస్తారు.
7. శ్లాబ్ లేదా పైకప్పు వేయడం (Slab / Roofing):
గోడల నిర్మాణం పూర్తయ్యాక 3డీ ప్రింటర్ పని ముగుస్తుంది. పైకప్పు లేదా శ్లాబ్‌ను మళ్లీ మనం మామూలుగానే వేసుకోవాలి. సెంట్రింగ్ కొట్టి, ఇనుప జాలీలు అల్లి కాంక్రీట్ పోయడం ద్వారా శ్లాబ్ పూర్తి చేస్తారు.
సమయం ఆదా చేయడం కోసం కొన్నిసార్లు ఫ్యాక్టరీలో ముందే తయారు చేసిన రూఫ్ ప్యానెల్స్‌ను (Pre-cast slabs) క్రేన్ల సాయంతో నేరుగా గోడలపై అమర్చుతారు.
8. తుది మెరుగులు (Finishing):
శ్లాబ్ వేసిన తర్వాత ప్లాస్టరింగ్ అవసరం లేకుండానే గోడలు మృదువుగా ఉంటాయి. నేరుగా పుట్టీ పెట్టి రంగులు వేసుకోవచ్చు. చివరగా తలుపులు, కిటికీలు బిగించి, ఫ్లోరింగ్ పూర్తి చేస్తారు.
ఈ పూర్తి ప్రక్రియలో ఇటుకలు పేర్చడం, సిమెంట్ కలపడం, ప్లాస్టరింగ్ చేయడం వంటి పనులు ఉండవు కాబట్టి.. నెలల తరబడి పట్టే గోడల నిర్మాణం కేవలం కొద్ది రోజుల్లోనే పూర్తవుతుంది.
బహుళ అంతస్తులు ఎలా నిర్మిస్తారు?
ముందుగా చెప్పుకున్నట్లుగానే 3డీ ప్రింటర్ సహాయంతో గ్రౌండ్ ఫ్లోర్ గోడలను నిర్మిస్తారు. బరువును మోయడానికి వీలుగా గోడల మధ్యలో ఇనుప రాడ్లు పెట్టి కాంక్రీట్ నింపుతారు.
మొదటి శ్లాబ్: గ్రౌండ్ ఫ్లోర్ గోడల నిర్మాణం పూర్తయ్యాక, సాధారణ పద్ధతిలో సెంట్రింగ్ పెట్టి ఇనుప జాలీతో శ్లాబ్ వేస్తారు (లేదా ముందే ఫ్యాక్టరీలో తయారైన ప్రీ-కాస్ట్ శ్లాబ్‌ను క్రేన్ ద్వారా అమర్చుతారు).
ప్రింటర్ ఎత్తు పెంచడం: మొదటి శ్లాబ్ గట్టిపడిన తర్వాత, ఆ శ్లాబ్ పైన యంత్రాన్ని అమర్చుతారు (లేదా భవనం చుట్టూ ఉండే క్రేన్ లాంటి యంత్రం ఎత్తును పెంచుతారు).
పై అంతస్తుల ప్రింటింగ్: మళ్లీ అదే పద్ధతిలో మొదటి అంతస్తు గోడలను ప్రింట్ చేయడం మొదలుపెడతారు. ఇలా ఎన్ని అంతస్తులు కావాలంటే అన్నిసార్లు శ్లాబ్ వేయడం, యంత్రాన్ని పైకి జరిపి గోడలను ప్రింట్ చేయడం కొనసాగిస్తారు.
ఇప్పటికే నిర్మించిన కొన్ని బహుళ అంతస్తుల ప్రాజెక్టులు
భారత్‌లో తొలి G+1 భవనం: ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ (L&T) తమిళనాడులోని కాంచీపురంలో 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో దేశంలోనే తొలి G+1 (రెండు అంతస్తుల) 3డీ ప్రింటెడ్ భవనాన్ని విజయవంతంగా నిర్మించింది.
దుబాయ్ రికార్డ్: దుబాయ్ మున్సిపాలిటీ కోసం 31 అడుగుల ఎత్తు, 6,900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండంతస్తుల 3డీ ప్రింటెడ్ భవనాన్ని నిర్మించారు.
జర్మనీలో మూడంతస్తులు: జర్మనీలోని బెక్సమ్ (Beckum) నగరంలో ఏకంగా మూడు అంతస్తుల (G+2) నివాస భవనాన్ని ఈ సాంకేతికతతో నిర్మించారు.
దేశీయంగా ఇతర ప్రముఖ ప్రాజెక్టులు (Notable Projects in India)పోస్ట్ ఆఫీసు:
భారత్‌లోని తొలి 3డీ ప్రింటెడ్ పోస్ట్ ఆఫీసును బెంగళూరులో 2023లో నిర్మించారు.
స్టార్టప్ చొరవ: ఐఐటీ మద్రాస్‌కు చెందిన 'త్వాస్తా' (Tvasta) స్టార్టప్ చెన్నైలో తొలి 3డీ ప్రింటెడ్ ఇంటిని విజయవంతంగా నిర్మించింది. ప్రస్తుతం పలు వాణిజ్య ప్రాజెక్టులను ఈ సాంకేతికతతో చేపడుతోంది.
Read More
Next Story