TTD Chairman | దశాబ్దాల చరిత్ర.. ఎస్టీ,ఎస్టీలకు నో ఛాన్స్...
నామినేటెడ్ పోస్టుల్లో కనిపించని సామాజిక న్యాయం. ఈఓ పోస్టుకు అదే స్థితి.
టీటీడీ పాలక మండలికి పెద్ద గౌరవం ఉంది. ఆ పోస్టు కోసం పోటీ ఎక్కువ. అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే తమకు అనుకూలురు, విధేయులను మాత్రమే ఆ పదవిలో నియమిస్తుంది. ఈ పదవుల భర్తీ అనగానే రాష్ట్ర రాజకీయం అసక్తి మారుతుంది. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి..
ప్రస్తుత టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్. నాయుడు, సభ్యుల పదవీకాలం మరో నెలలో ముగియనున్నది. దీంతో అప్పుడు ఆ పదవి రేసులో అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో మళ్లీ ఆ చర్చ ప్రారంభమైంది. మరోవైపు చైర్మన్ రేసులో నలుగురి పేర్లు బలంగా వినిపిస్తుండగా, ప్రస్తుత చైర్మన్ కాలపరిమితిని మరో ఏడాది పొడిగిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.
కానీ వీటన్నింటి మధ్య మళ్లీ తెరపైకి వచ్చిన కీలక ప్రశ్న.. టీటీడీ చరిత్రలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చైర్మన్ లేదా ఈఓ పదవులు ఎందుకు దక్కడ లేదు? గతంలో ఓ దళిత ఐఏఎస్ అధికారి ఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి వస్తే ఏం జరిగింది? అనే అంశంలో సామాజిక సమీకరణాలు ఎలా కీలకపాత్ర పోషిస్తాయి.
దళిత, గిరిజనులు సభ్యులే..!
టీటీడీ దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే... అత్యున్నత పదవులకు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారిని కేవలం పాలక మండలి (Trust Board) సభ్యులుగానే పరిమితం చేశారు. ఇప్పటివరకు ఏ ఒక్కరినీ టీటీడీ చైర్మన్ స్థానంలో నియమించలేదనేది స్పష్టమవుతోంది. కనీసం ఆ దిశగా పరిశీలన కూడా జరగకపోవడం గమనార్హం.
టీటీడీ చరిత్రలో ఎంతో మంది చైర్మన్లు మారారు. కానీచ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నేతలకు టీటీడీ చైర్మన్ లేదా ఈఓ పదవులు ఎందుకు దక్కడం లేదు? కేవలం పాలక మండలి సభ్యులుగానే ఎందుకు పరిమితం చేస్తున్నారు? టీటీడీ మొదటి పాలక మండలి 1932 (టీటీడీ యాక్ట్ ప్రకారం 1933)లో అమల్లోకి వచ్చింది. దశాబ్దాలుగా మారుతున్న ప్రభుత్వాలకు అనుగుణంగా చైర్మన్లు, పాలక మండలి సభ్యులు మారుతూ వస్తున్నారు.
టీటీడీ బోర్డులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను 'పాలక మండలి సభ్యులుగా' (Board Members) మాత్రమే నియమిస్తున్నారు తప్ప, 'చైర్మన్'గా అవకాశం ఇవ్వకపోవడంపై సుదీర్ఘకాలంగా విమర్శలు ఉన్నాయి.
టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) లేదా అదనపు ఈఓ (Additional EO)లుగా కూడా దళిత, గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐఏఎస్ (IAS) అధికారులను పూర్తిస్థాయిలో నియమించడంలో రాజకీయ, పరిపాలనాపరమైన ప్రాధాన్యతలు అడ్డంకిగా మారుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కుల సమీకరణాలు, రాజకీయ ప్రయోజనాలే టీటీడీ చైర్మన్ నియామకాన్ని శాసిస్తుండటంతో ఈ వర్గాలకు కీలక పదవులు దక్కడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
అగ్రకులాల ఆధిపత్యం: చైర్మన్ల నియామకం విషయానికొస్తే ఎక్కువగా కమ్మ, కాపు, రెడ్డి వంటి సామాజిక వర్గాలకు చెందిన నేతలకే కీలక అవకాశాలు లభించాయి.
ఘాటు అనుభవం: గతంలో ఒక దళిత ఐఏఎస్ అధికారిని టీటీడీ ఈఓగా (Executive Officer) నియమించినప్పుడు కొన్ని వర్గాల ఆక్షేపణలు, అర్చకుల అభ్యంతరాల నేపథ్యంలో ఆయన తిరుమలకు వచ్చి బాధ్యతలు కూడా చేపట్టకుండా వచ్చిన రైలులోనే హైదరాబాద్కు తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చిందన్న ఉదంతాన్ని ఈ కథనం గుర్తుచేస్తోంది. చైర్మన్ల విషయాన్ని పక్కన పెడితే పరిపాలనాధికారులైన ఈఓల (EO) నియామకంలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన అధికారులకు అవకాశాలు కల్పించారు.
పొలిటికల్, సోషల్ ఈక్వేషన్స్
టీటీడీ పీఠం అనేది కేవలం ధార్మిక పదవి మాత్రమే కాదు. రాజకీయంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపే అత్యున్నత నామినేటెడ్ పోస్టు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకు సన్నిహితంగా ఉండే బడా నేతలు లేదా ఆర్థిక బలమున్న వర్గాలకే చైర్మన్ స్థానాన్ని కేటాయించడం పరిపాటిగా మారింది.
టీటీడీలో దళిత (ఎస్సీ) వర్గానికి చెందిన వ్యక్తి కార్యనిర్వహణాధికారి (Executive Officer - EO)గా నియమితులు కాకపోవడానికి చట్టపరమైన నిబంధనలు, రాజకీయ మరియు పరిపాలనాపరమైన కారణాలు ఉన్నాయి. టీటీడీ ఏర్పాటైన దాదాపు 93 ఏళ్ల చరిత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా ఐఏఎస్ అధికారులు ఈఓలుగా పని చేసినప్పటికీ, వారిలో ఒక్కరు కూడా దళిత సామాజిక వర్గానికి చెందినవారు లేరు. దీనికి కారణాలు ఏమిటనేది చేస్తే..
టీటీడీ చట్టం ప్రకారం ఈఓ మరియు జేఈఓల నియామకం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. సాధారణంగా సీనియర్ ఐఏఎస్ (IAS) అధికారులను ప్రభుత్వం ఈ పోస్టుకు ఎంపిక చేస్తుంది. ఏ ప్రభుత్వమూ ఇప్పటివరకు దళిత ఐఏఎస్ అధికారులను ఈ అత్యున్నత పదవికి నామినేట్ చేయకపోవడం ఒక ముఖ్య కారణం.
టీటీడీ బోర్డు చైర్మన్, ఈఓ, జేఈఓ వంటి అత్యున్నత పరిపాలనా పదవులు రాజ్యాంగబద్ధమైన లేదా ప్రభుత్వ సర్వీస్ కమిషన్ పరిధిలోకి వచ్చే ప్రత్యక్ష రిజర్వేషన్ పోస్టులు కావు. ఇవి ప్రభుత్వాలు నేరుగా నియమించే డెప్యుటేషన్,రాజకీయ పోస్టులు కావడంతో వీటికి ఎస్సీ, ఎస్టీ రోస్టర్ పాయింట్లు వర్తించవు.
టీటీడీ నిర్వహణ, ఆలయ నిబంధనలు ఎక్కువగా హిందూ సంప్రదాయాలు, ఆగమ శాస్త్రాలపై ఆధారపడి ఉంటాయి. ఉన్నత స్థానాల్లో సామాజిక సమతుల్యత పాటించాలనే ఒత్తిడి ఉన్నప్పటికీ, సాంప్రదాయవాదుల నుంచి వచ్చే వ్యతిరేకతను అధిగమించడానికి ప్రభుత్వాలు వెనకడుగు వేస్తుంటాయి.
ఇటీవలి కాలంలో దళిత సంఘాలు టీటీడీలోని కీలక పదవుల్లో దళితులకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని గళమెత్తుతున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో, టీటీడీ వెనుకబడిన, దళిత మరియు గిరిజన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం చేపడుతూ, ఆయా వర్గాల యువతకు పూజారులుగా శిక్షణ ఇచ్చి స్థానిక ఆలయాల్లో నియామకాలు చేపడుతోంది. అయినప్పటికీ, టీటీడీ ప్రధాన పరిపాలనా విభాగాధిపతి (ఈఓ) స్థానంలో దళితులకు అవకాశం కల్పించాలనే డిమాండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
"దేవుని ప్రాంగణంలో భక్తులందరూ సమానులే" అని చెప్పినా, టీటీడీ చైర్మన్, ఉన్నత పదవుల నియామకాల విషయంలో మాత్రం సామాజిక న్యాయం పాటించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
Next Story

