బొద్దింకల గర్జన, పార్లమెంటు స్తంభన
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చలో పార్లమెంటు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ 'కాక్రోచ్ జనతా పార్టీ' ఇచ్చిన "చలో పార్లమెంట్" పిలుపుతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది యువత, విద్యార్థులు, ఉద్యమకారులు జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. దీంతో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంలో ఏపీ ఫెడరల్ నిర్వహించిన చర్చా కార్యక్రమం ఇది. ఇందులో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు చలసాని నరేంద్ర, ది ఫెడరల్ తెలంగాణ అసిస్టెంట్ ఎడిటర్ ఫణికుమార్, జీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వక్తలువ్యక్తం చేసిన అభిప్రాయాలతో కూడిన చర్చ ఇది.
నిర్వాహకుల అంచనా ప్రకారం పదివేల మందికి పైగా నిరసనకారులు హాజరైనట్లు పేర్కొనగా, పోలీసులు మాత్రం అధికారిక సంఖ్యను వెల్లడించలేదు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భారీ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంట్ పరిసరాల్లో మూడు స్థాయిల భద్రతా వలయాలను ఏర్పాటు చేశారు. కొన్ని మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసి, నిషేధాజ్ఞలు కూడా అమలు చేశారు.
నిరసనకారులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. విద్యా వ్యవస్థలో జరిగిన వైఫల్యాలు, ముఖ్యంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని వారు డిమాండ్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ, సభలో చర్చకు అనుమతి లభించలేదు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడినట్లు సమాచారం.

