శ్రీవారి క్షేత్రంపై శాటిలైట్ కంటితో నిఘా..!
ఈసారి రెండు బ్రహ్మోత్సవాలు. తిరుమల చరిత్రలో చారిత్రక ఘట్టాలకు శ్రీకారంపై వీడియో కథనం.
అధిగ మాసం కావడం వల్ల ఈ ఏడాది తిరుమలలో శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. మూడేళ్ల తరువాత తిరుమల యాత్రికులకు అరుదైన అవకాశం కలగనుంది. దీనికి ఖగోళశాస్త్రం ఆధారంగా మారింది. మొదటిసారి బ్రహ్మోత్సవాలకు అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు. యాత్రికుల భద్రత తోపాటు శ్రీవారి క్షేత్రంపై నింగి నుంచి నిఘా ఉంచనున్నారు.
తిరుమలలో ఈ నెల 14వ తేదీ నుంచి మొదటి బ్రహ్మోత్సవం, అక్టోబర్ లో వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ సన్నాహాలు ప్రారంభించింది. 2026 బ్రహ్మోత్సవాల చరిత్రలో చారిత్రక అంశాలు నమోదు కాబోతున్నాయి.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి 310 సంవత్సరాల చరిత్ర నేపథ్యంలో బంగారు డాలర్ విడుదల చేయనున్నారు. దాదాపు 900 కోట్ల రూపాయలతో అత్యంత ఆధునిక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారు.
ఖగోళశాస్త్రానికి శ్రీవారి ఉత్సవాలకు లంకలేమిటి?
ఒకే ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం మనం 'చాంద్రమానం' (చంద్రుడి గమనం) ఆధారంగా పండుగలను లెక్కిస్తాం. సూర్యుడి గమనం ఆధారంగా 'సౌరమానం' నడుస్తుంది. సౌర సంవత్సరానికి 365 రోజులు ఉంటే, చాంద్ర సంవత్సరానికి 354 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే టా ఈ రెండింటి మధ్య 11 రోజుల వ్యత్యాసం వస్తుంది.
ఇలా మూడేళ్లు గడిచేసరికి దాదాపు ఒక నెల (33 రోజులు) తేడా వస్తుంది. ఈ వ్యత్యాసాన్ని సర్దుబాటు చేస్తూ.. ప్రతి మూడేళ్లకు ఒకసారి పంచాంగంలో ఒక అదనపు నెలను కలుపుతారు. దాన్నే 'అధిక మాసం' అంటారు. ఈ ఏడాది అలా అధిక మాసం రావడంతో.. తిరుమలలో సాంప్రదాయబద్ధంగా 'సాలకట్ల బ్రహ్మోత్సవాలు', 'నవరాత్రి బ్రహ్మోత్సవాలు' అని రెండు విడతలుగా స్వామివారి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు."
మొదటి బ్రహ్మోత్సవాలు
సెప్టెంబర్ 14: బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
15: ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.
9: అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ
సెప్టెంబర్ 22: వైభవంగా రథోత్సవం
సెప్టెంబర్ 23: చక్రస్నానంతో మొదటి బ్రహ్మెత్సవం ముగుస్తుంది.
రోజూ ఉదయం ఎనిమిది గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి ఏడు నుంచి రాత్రి తొమ్మది గంటల వరకు ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామివారి మాడవీధుల్లోని గ్యాలరీల్లో ఉన్న యాత్రికులకు దర్శనం ఇస్తారు.
రెండో బ్రహ్మోత్సవం: ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీ నుంచి 20 వరకు వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరగనున్నాయి.
తిరుమలలో విదేశీ కళార్చన
తిరుమలలో మొదటిసారి విదేశీ కళా ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి. శ్రీవారి వాహనసేవ ముందు దేశంలోని 29 రాష్ట్రాల నుంచి 298 కళాబృందాలు ప్రదర్శనలతో నీరాజనం సమర్పిస్తారు. 8 దేశాల NRI కళాకారులు కూడా ప్రదర్శనలు ఇచ్చే అవకాశం ఉంది.
నేపాల్ కళారూపం: సంప్రదాయ నేపాలీ నృత్యంలో శంఖు ధ్వనులు, భజనలు ప్రదర్శించనున్నారని తెలిసింది. నేపాలీ కళాకారులు అక్కడి పశుపతినాథ్ ఆలయ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు.
ఇండోనేషియా: బాలి ప్రాంతం నుంచి వచ్చే కళాకారులు రామాయణం, మహాభారత ఇతిహాసాలు ప్రదర్శించనున్నారని సమాచారం.
శ్రీలంక: కండ్యన్ నృత్యం కనువిందు చేయనుంది.
మలేషియా, సింగపూర్: కళాకారులు భరతనాట్యం, కూచిపూడి వంటి ప్రదర్శనలతో పాటు తమిళనాడులో సుప్రసిద్ధంగా కనిపించే కరగాట్టం, కావడి నృత్యాలు అలరించనున్నాయి.
మారిషస్, ఫ్రాన్స్: కళారూపాలే ప్రత్యేకంగా ఉండబోతాయని టీటీడీ అధికారవర్గాల తెలిసిన సమాచారం.
7డీ మ్యూజియం
తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వచ్చే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అనేక కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.
SV మ్యూజియం: తిరుమలలో ఉన్న మ్యూజియాన్ని TCS సంస్థ 145 కోట్ల విరాళంతో అధునాతనంగా మార్చింది. 14 గ్యాలరీలు TCS, 5 గ్యాలరీలు MAP Systems కలిపి 19 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 3D, 7D టెక్నాలజీతో శ్రీవారి చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపిస్తారు.
PAC-5 (Public Amenities Complex) వెంకటాద్రి నిలయం: భక్తులకు అతిపెద్ద సమస్య వసతి. దీని కోసం 102 కోట్లతో నిర్మించిన ఈ భవనంలో ఒకేసారి 10 వేల మంది ఉండొచ్చు. దీన్ని CM ప్రారంభిస్తారు.
బయోగ్యాస్ ప్లాంట్ : టీటీడీ ( TTD ), IOCL కలిసి తిరుమలలో కాకులమాను తిప్ప వద్ద 12.85 కోట్లతో ప్లాంట్ నిర్మించారు. ఇక్కడి నుంచి వచ్చే గ్యాస్ నేరుగా వకుళమాత అన్నప్రసాద కేంద్రానికి పైప్ లైన్ ద్వారా వెళ్తుంది. 40 టన్నుల తడి వ్యర్థాలను ఇక్కడ గ్యాస్ గా మార్చబోతున్నారు.
ఎలక్ట్రిక్ బస్సులు: తిరుమలలో యాత్రికులకు ఉచిత రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. ప్రస్తుతం ఉన్న ఈవీ బస్సులకు తోడుగా, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ 27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇస్తున్నారు. తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు. డ్రైవర్ల జీతం కూడా రిలయన్సే భరిస్తుంది.
AI హైటెక్ పోటు (వంటశాల): భక్తులకు రుచికరమైన అన్నప్రసాదం కోసం AI తో కూడిన కొత్త వంటశాలకు శంకుస్థాపన,
గోగర్భం రోడ్డుకు విశ్రాంతి: తిరుమల - పాపవినాశనం కొత్త రోడ్డు ప్రారంభం."
లడ్డూకు బంగారు డాలర్
తిరుమల లడ్డూ వయస్సు ఎంతో తెలుసా? దీని దిట్టం అంటే వంటకం లిస్టును TTD 1950-51 లోనే ఫిక్స్ చేసింది. అంటే ఈ దిట్టానికి 75 ఏళ్లు. దీనికి GI ట్యాగ్ కూడా ఉంది.
ఇంతటి ప్రాధాన్యత కలిగిన శ్రీవారి లడ్డూ ప్రసాదం బొమ్మతో బంగారు డాలర్ సిద్ధం చేస్తున్నారు. దీనిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆవిష్కరించనున్నారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి దిట్టం ( ముడి సరుకుల పట్టిక) ప్రకారం ఒక లడ్డూ తయారీకి 167 గ్రాముల సరుకు వాడతారు. 78 గ్రా చక్కెర, 39 గ్రా శనగపిండి, 36 గ్రా నెయ్యి, 7 గ్రా జీడిపప్పు, 3 గ్రా కిస్మిస్. రోజూ 700 మంది బ్రాహ్మణులు రెండు షిఫ్టుల్లో తయారు చేస్తారు.
బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు..
శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఈఓ ముద్దాడి రవిచంద్ర మాట్టాడుతూ..
"ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ గా పెట్టుకోవాలి" అని ప్రత్యేకంగా సూచించారు. సాధారణ రోజుల్లోనే నాలుగు లక్షలకు పైగానే శ్రీవారి లడ్డూ ప్రసాదాలు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఈఓ ప్రత్యేక సూచనలు చేశారు
ఆధునిక టెక్నాలజీతో భద్రత
ఈసారి బ్రహ్మోత్సవాల్లో అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు. యాత్రికుల భద్రత తోపాటు శ్రీవారి క్షేత్రంపై నింగి నుంచి నిఘా ఉంచనున్నారు.
1) మొదటిసారి ISRO శాటిలైట్ తో, ఎల్ అండ్ టీ (L&T) సంస్థ సహకారంతో భక్తుల రద్దీని లెక్కించబోతున్నారు. మాడ వీధుల్లో 36 భారీ LED స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా HD లైవ్ ఇవ్వడానికి టీటీడీ సన్నాహాలు ప్రారంభించింది.
గత ఏడాది లెక్క ప్రకారం 4,700 మంది పోలీసులు, 2,000 మంది TTD విజిలెన్స్ సిబ్బంది, 3,500 మంది శ్రీవారి సేవకులు, 450 మంది సీనియర్ అధికారులు, 4 వేల CCTV లతో కమాండ్ కంట్రోల్ లో 24 గంటలు పర్యవేక్షణ. దీనిపై టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి ఏమన్నారంటే..
"గత ఏడాది 3D వీడియోలు చూసి లోపాలు సరిదిద్దాం. 80 మంది పల్లకీ మోసేవారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ప్రతి మాడవీధికి ఒక సీనియర్ అధికారి. భక్తుడు సంతృప్తిగా వెళ్లేవరకు మా బాధ్యత" అన్నారు.
తిరుమలకు పెరుగుతున్న భక్తుల సంఖ్య, ఇటీవల రథసప్తమి సందర్భంగా సుమారు 3.75 లక్షల మంది భక్తులు, 15 వేల వాహనాలు వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీపై ముందస్తు అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో భక్తుల రద్దీ, వాహన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఆరోగ్యం, పారిశుద్ధ్యం, అన్నప్రసాదం, ఘాట్‌రోడ్ల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించినట్లు వివరించారు.
గత ఏడాది బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజు సుమారు 20 లక్షల ఫుడ్ పోర్షన్లు, వివిధ రకాల పానీయాలతో పాటు 15 రకాల మెనూలను భక్తులకు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈసారి రెండు బ్రహ్మోత్సవాల్లో కూడా అదే తరహాలో ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు.
Next Story

