x

'సీమ'లో కరువు ఛాయలు: కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల ఘోష ఇదీ...

31.90 టీఎంసీల కేటాయింపులు ఉన్నా ఖరీఫ్‌లో చినుకు నీరు లేక బీడువారుతున్న పొలాలు. పరిహార ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ (వీడియో స్టోరీ)



రాయలసీమలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. సాగునీటికి గుండెకాయ లాంటి కేసీ కెనాల్ ఆయకట్టులో ఇప్పుడు భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి కారణం 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు బీడుబారే పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం 31.90 టీఎంసీల నీటి కేటాయింపు కలిగిన కె.సి. కాలువకు (కడప-కర్నూలు కాలువ), ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. నారు మడులు సిద్ధం చేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుతడి పంటల సాకుకు నీరందడం కూడా సందేహమే. ఈ రెండు కారణాలతో నష్టపోయే రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం పరిహారం ప్యాకేజీ ప్రకటించాలని కూడా కోరుతున్నారు.

15 రోజుల్లో ముగియనున్న ఖరీఫ్

ఖరీఫ్ పంట కాలం ముగియడానికి మరో 15 రోజులే సమయం ఉంది. నీరు లేకపోవడంతో, 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు భూమి బీడుగా మారుతోంది. నీరు వస్తుందన్న ఆశతో రైతులు పెంచిన వరి నారుమళ్లు ఎండిపోతున్నాయి. సాధారణంగా, కె.సి. కాలువకు సుంకేసుల బ్యారేజీ నుండి నీరు అందాల్సి ఉంటుంది. తుంగభద్రలో నీటి లభ్యత తగ్గినప్పుడు, శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్స్ నుండి ముచ్చుమర్రి లిఫ్ట్ ద్వారా కె.సి. కాలువకు నీటిని సరఫరా చేసే ప్రత్యామ్నాయ వ్యవస్థ కూడా ఉంది. అయితే, ఈ ఏడాది కె.సి. ఆయకట్టుకు ఏ వైపు నుండీ నీరు అందడం లేదు. అదే సమయంలో, ఆహార ధాన్యాలు, పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ ప్రభుత్వం కె.సి. ఆయకట్టుకు నీటిని అందించలేకపోతే, రైతులకు అండగా నిలిచేందుకు ఏదైనా ప్రత్యామ్నాయ సాగునీటి ప్రణాళికను రూపొందించిందా?

కేసీ కెనాల్ ఆయకట్టు ఎంత?

రాయలసీమలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్ అయిన కేసీ కెనాల్ కింద కర్నూలు, కడప జిల్లాల్లోని దాదాపు 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. ప్రతి ఏటా సుంకేసుల బ్యారేజీ నుంచి ఈ కాలువకు నీటి సరఫరా జరుగుతుంది. ఒకవేళ తుంగభద్రలో నీటి ప్రవాహం తగ్గితే, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ ద్వారా 'ముచ్చుమర్రి లిఫ్ట్' ఉపయోగించి నీటిని ఇచ్చే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉంది. కానీ ఈ ఏడాది సుంకేసుల నుంచి గానీ, ముచ్చుమర్రి లిఫ్ట్ నుండి గానీ నీరు విడుదల కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. నీరు వస్తుందనే ఆశతో వేసిన వరి నారుమళ్లు ఎండిపోతుండటంతో రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలు మరియు పశుగ్రాసం కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరధరామిరెడ్డి మాట్లాడుతూ,
"కేసీ కెనాల్ ఆయకట్టును ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది" అని ఆరోపించారు. కేసీ కాలువకు కేటాయించిన 31.90 టీఎంసీల నీటిని హక్కుగా అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
"ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించకుండా ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే వరకు ఉపేక్షించడం రైతులకు తీవ్ర ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. ఇక్కడ విచిత్రపరిస్థితి ఏర్పడిందని రాయలసీమ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన బొజ్జ దశరధరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ద్రోహమైన చర్యగా అభివర్ణించారు.
శ్రీశైలం నీటి మట్టం నిలువ ఉంచడానికి తెలంగాణాకు నీరు ఇవ్వడానికి విద్యుత్ ఉత్పత్తి ఆపాలని అనంతపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు.
"రాయలసీమ రైతాంగాన్ని కాపాడుకునేందుకు క్షేత్రస్థాయి నుంచి పోరాటం ప్రారంభిస్తాం. కేసీ కెనాల్ పరివాహక ప్రాంతాల్లో రైతు ధర్నాలు, కాలువ ముట్టడి, కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం. శ్రీశైలం జలాశయం వద్దకు పోరుబాట సాగిస్తాం" అని కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హెచ్చురించారు. ప్రభుత్వం దిగివచ్చి నీరు విడుదల చేసేవరకు శాంతియుతంగా తీవ్రస్థాయి పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ మరో 15 రోజుల్లో ముగుస్తుంది. వర్షాకాలం కూడా సమాప్తం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి కేసీ కెనాల్ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తుందా? లేదా రైతులకు ఏదైనా నష్టపరిహార ప్యాకేజీ ప్రకటిస్తుందా? అని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.
Read More
Next Story