రిజిస్ట్రేషన్ల ’ప్రైవేటీకరణ’ చిచ్చు! మీ ఆస్తి రికార్డులు భద్రమేనా?
పాస్‌పోర్ట్ తరహా సేవల వెనుక రహస్యం ఏంటి?
భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రభుత్వ నిర్ణయం ప్రకంపనలు రేపింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 396 జీఓ వల్ల డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు పెన్ డౌన్ చేశారు. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మందగించడం వల్ల రోజూకు సగటున 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల వరకు ఆదాయానికి గండి పడింది.
ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో పబ్లిక్ ప్రయివేటు పార్టనర్ షిప్ (Public-Private Partnership (PPP) ) వల్ల ప్రయివేటు భూ యజమానులకు రక్షణ లేకుండా పోతుంది. డాక్యుమెంట్ రైటర్ల ( Document writers ) జీవన భృత కోల్పోయి ఐదు లక్షల మంది రోడ్డున పడతారు. వీటన్నింటికంటే ప్రధానంగా రికార్డుల గోప్యత, భద్రకు ముప్పు వాటిల్లింది అనేది డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన. ఈ పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆనగాని సత్యప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.
కక్షిదారులు అంటే భూ యజమానులు, కొనుగోలుదారులకు సత్వర సేవలు అందించడానికి చర్యలు తీసుకున్నాం. పాస్ పోర్టు కార్యాలయాల తరహాలో పారదర్శక సేవలు, త్వరగా అందించాలనేది మాత్రమే మా లక్ష్యం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇది ఎంతమాత్రం నమ్మదగింది కాదని డాక్యుమెంట్ రైటర్లు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు.
"రిజిస్రేషన్ల శాఖలో ప్రయివేటు వ్యక్తులను చొప్పించే సేవా కేంద్రాల వల్ల అనేక ప్రమాదాలు, జీవనానికి ఆటకం కలుగుతుంది" అని తిరుపతిలోని సీనియర్ డాక్యుమెంట్ రైటర్ వజ్రాల దామోదర్ ఆందోళన వ్యక్తం చేశారు.
"రిజిస్ట్రేషన్ శాఖ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రైవేటీకరించడం లేదు. ప్రజలకు ఒకే చోట పారదర్శకంగా, సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన సమయపాలనతో కూడిన సేవలను అందించేందుకు మాత్రమే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది" అని అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ బీ. శ్రీనివాసులు స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ కు సంబందించిన అన్ని చట్టబద్ధ అధికారాలు, పత్రాల పరిశీలన, నమోదు రికార్డుల నిర్వహణ తదితర విధులు యధావిధిగా సబ్ రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్ శాఖ ఆధీనం లోనే కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ డేటా లేదా ప్రజల ఆస్థి వివరాలు ఏ ప్రైవేట్ సంస్థకు బదిలీ చేయరనీ అందువల్ల డేటా భద్రతపై వ్యక్తమౌతున్న ఆందోళనలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన తేల్చి చెప్పారు.
రిజిస్ట్రేషన్ శాఖలో ప్రయివేటు వ్యక్తులను చొప్పించడం అంటే ఖచ్చితంగా అక్రమాలకు తెరతీయడమే అని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకరరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఇటీవల విడుదల చేసిన వీడియోలో అనేక అంశాలు ప్రస్తావించారు.
"యజమానుల భూముల భద్రత, రికార్డుల గోప్యత దేవుడెరుగు, టాంపరింగ్ చేయడానికి, తారుమారు చేసేందుకు కూడా తెరతీయడమే" అని వైసీపీ ( YCP ) అధికార ప్రతినిధి పుత్తా శివశంకరరెడ్డి ఆరోపించారు.
రిజిస్ట్రేషన్ శాఖ పుట్టుపూర్వోత్తరాలు ఇవీ..
దేశంలో బ్రిటిషు వారి కంటే ముందు ఆస్తుల విక్రయాలు, ఒప్పందాలు రాజుల లేదా నవాబుల ముద్రలతో (సనద్‌లు, తాళపత్రాలు) చెల్లుబాటు అయ్యేవి. అయితే, నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తులను హస్తగతం చేసుకునే కేసులు పెరగడంతో చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ అవసరం ఏర్పడింది. బ్రిటిష్ పాలన హస్తగతం చేసుకున్నాక అంటే 18-19 శతాబ్దాల మధ్య ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో వ్యాపారం, భూముల క్రయవిక్రయాలు విస్తరించడంతో పక్కా రికార్డులు నిర్వహించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చట్టాలను రూపొందించింది.
దేశంలో అధికారికంగా "రిజిస్ట్రేషన్ చట్టం, 1864" (Registration Act, 1864) ద్వారా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను, ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ శాఖను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలు/ప్రాంతాల్లో ఉన్న వేర్వేరు చట్టాలను ఏకీకృతం చేస్తూ "ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1908" (Registration Act, 1908) ను తీసుకువచ్చారు. నాటి నుంచి దేశంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ చట్టం ఆధారంగానే నడుస్తోంది.
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
సాధారణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి 10 వేల కోట్ల నుంచి 12 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది (రోజుకు సగటున 40 కోట్ల నుంచి ₹60 కోట్లు). ఈ 10 రోజులు డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ సమ్మె కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రభుత్వ ఖజానాకు సుమారు ₹500 కోట్ల నుంచి ₹600 కోట్ల వరకు భారీ రాబడి గండి పడుతోందని అంచనా.
తాజాగా ఏపీలో చెలరేగిన ఆందోళనకు ఎందుకు దారి తీసిందో వివరించే ఈ వీడియో చూడండి
Next Story

