కుప్పం టు గల్ఫ్: ఏపీకి బిలియన్ డాలర్ల గ్రోత్ ఇంజిన్ అవుతుందా..!?
నేరుగా నింగికెగరనున్న పంటలు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం వల్ల 2,200 కోట్లతో పారిశ్రామిక విప్లవంపై వీడియో కథనం
మూడు రాష్ట్రాల కూడలిలోని రాయలసీమ సరిహద్దు పట్టణం కుప్పం వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిబంధకాలు ఎదురువుతున్నాయి. ఎయిర్ స్ట్రిప్ ను కార్గోగా ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుగా నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కుప్పం నుంచి ఆకాశమార్గంలో నేరుగా అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేయాలనే సంకల్పానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. కుప్పం ప్రాంతంలో రైతులు పండించే పూలు, పండ్లతో ఇక్కడ ఇప్పటికే 'డాలర్ల సేద్యం' సాగుతోంది.
"గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంతో ఆర్థిక విప్లవం తీసుకుని వస్తాం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెబుతున్నారు.
"ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు సరిహద్దులోని కుప్పం త్రిభుజ కారిడార్‌లో ప్రధాన వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది" అని సీఎం చంద్రబాబు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు.
కుప్పంలో ఏర్పాటు చేసే విమానాశ్రయం వల్ల సమీపంలోని బెంగళూరు, చెన్నై, తిరుపతి విమానాశ్రయాలపై దీని ప్రభావం ఎంత ఉంటుంది?!
9 విమానాశ్రయాలకు ప్రతిపాదనలు
రాష్ట్రంలో గంట ప్రయాణంతో కోరుకున్న నగరానికి చేరాలనేది ప్రభుత్వ సంకల్పం. దీనికోసం 9 కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందులోనే చిత్తూరు జిల్లా కుప్పం విమానాశ్రయం మొదటి దశ అభివృద్ధికి ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. మొదట ఎయిర్‌స్ట్రిప్‌గా శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ప్రాథమికంగా కార్గో ఎయిర్‌పోర్ట్‌గా, భవిష్యత్తులో UDAN పథకం కింద చిన్న తరహా ప్యాసింజర్ విమానాలు నడిపేలా 'గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంగా' తీర్చిదిద్దేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ విశేషాలు, భూసేకరణ సమాచారం, పారిశ్రామికాభివృద్ధి, పొరుగున ఉన్న ప్రధాన విమానాశ్రయాలపై ప్రభావం ఎంత ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
భూసేకరణ.. ప్రాజెక్టు ఖర్చు..
కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, రామకుప్పం మండలాల పరిధిలో విమానాశ్రయం కోసం ప్రాథమికంగా 1,405 ఎకరాల భూసేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశ కోసం 1,788 ఎకరాలను గుర్తించి ఇప్పటికే దాదాపు 1,300 ఎకరాలను సేకరించారు. మొదటి దశ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 734 కోట్లు కాగా, హడ్కో (HUDCO) నుంచి రూ. 313.25 కోట్ల రుణ ఒప్పందం కుదిరింది. ఇక్కడ మొదట ఎయిర్ స్ప్రిప్ ఏర్పాటుకు 2014లో సీఎం నారా చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి భూ సేకరణకు సంబంధించి వివాదం సాగుతోంది.
"మా ప్రాంతంలో ఎకరా, ఆలోపు ఉన్న రైతులు భూములు కోల్పోయారు. పంటలు పండే భూములు కల్పోవడం అనేది రైతులను వేధిస్తున్నది. 12 ఏళ్లుగా ఊరించడం మినహా, భూమి పై పనులు మాత్రం కనిపించడం లేదు" అని శాంతిపురం ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు హరి అభిప్రాయపడ్డారు. అయితే, శాంతిపురం వద్ద కార్గో కేంద్రంగా ఆ తరువాత ఇప్పుడు , చివరికి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు ఆమోదించారు.
కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటుకు 1,848 ఎకరాలు సేకరించాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఇప్పటికే 800 ఎకరాలకు పరిహారం చెల్లించారు. "మిగతా భూమి సేకరణకు 163 కోట్లు అవసరం. అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారని సమాచారం. 2027 చివరి నాటికి పనులు పూర్తి చేయాలనే సంకల్పంలో ఇక్కడ సేకరించే భూముల్లో వాణిజ్య కలాపాలకు 900 ఎకరాలు కేటాయించే అవకాశం ఉందనేది రెవెన్యూ అధికారవర్గాల సమాచారం.
పరిహారంలో సమానం..
శాంతిపురం మండలంలో పట్టా భూములకు ఎకరాకు రూ. 16 లక్షల చొప్పున చెల్లించారు. ఇటీవల డీకేటీ హక్కు పత్రాలు లేని 143 మంది రైతులకు సంబంధించి 178.32 ఎకరాలకు ఎకరాకు రూ. 12.44 లక్షల వంతున ప్రభుత్వం రూ. 22.18 కోట్ల ప్రత్యేక పరిహారాన్ని మంజూరు చేసింది.
"ఇందులో రైతులకు వ్యత్యాసం లేకుండా పరిహారంలో న్యాయం చేయడానికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోంది" అని శాంతిపురం తహసీల్దార్ ప్రకాష్ బాబు ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. ప్రాథమికంగా ఎకరాకు 16 లక్షలు ప్రకటించినా, ఈ మొత్తంపై ప్రభుత్వం సమీక్షించే అవకాశాలు లేకపోలేదు" అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
శాంతిపురం మండలంలో విమానాశ్రయం ఏర్పాటు వల్ల భూ నిర్వాసితులుగా మారిన వారిలో 40 సుమారు 40 మంది వరకు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి శంకుస్థాపన స్థాయిని ఈ విమానాశ్రయం దాటలేక ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోంది.అయినా,
"సైట్ క్లియరెన్స్ కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA)కు అధికారులు ప్రతిపాదనలు పంపారు"
డాలర్ల సేద్యం..
కుప్పంలో ఇజ్రాయల్ సేద్యం ప్రయోగాత్మకంగా అమలు చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. ఇక్కడ పూలు, పండ్ల తోటలు రోజా పూలు, మామిడి, బొప్పాయి తోటల సాగుతో విదేశాలకు ఎగుమతి చేయడంలో కీలకంగా వ్యవహరించారు. దీనికోసం ఉద్యానవన పంటల సాగు, ప్యాకింగ్ కేంద్రాలకు నిలయంగా మారింది.
కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె పరిధిలో దాదాపు 20,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. ఇక్కడ పండించే రోజా పూలు, చామంతి, మామిడి, బొప్పాయి, ఆలుగడ్డ, అరటికాయలకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. గతంలో ఇజ్రాయెల్ సేద్యం సాంకేతికత అటకెక్కినా.. రైతులు తమ కష్టంతో పూలు, పండ్ల ఎగుమతులను విజయవంతంగా కొనసాగిస్తూ డాలర్ల సేద్యం చేస్తున్నారు.
మధ్యవర్తుల తొలగింపు: ఇప్పటివరకు ఇక్కడి ఉత్పత్తులను బెంగళూరు, తమిళనాడు వ్యాపారులు కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. లేదా రోడ్డు మార్గాన బెంగళూరు (125 కి.మీ), చెన్నై (235 కి.మీ) తరలించాల్సి వస్తోంది.
కుప్పంలోనే కార్గో ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే, పంట కోసిన కొద్ది గంటల్లోనే నేరుగా గల్ఫ్, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేయవచ్చు. దీనివల్ల పొరుగు రాష్ట్ర వ్యాపారులు, మధ్యవర్తుల ప్రమేయం తగ్గి రైతులకు నేరుగా భారీ ఆదాయం దక్కుతుంది.
పరిశ్రమలతో పెట్టుబడుల ప్రవాహం ..
టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం పారిశ్రామిక చిత్రాన్ని వేగంగా మారుస్తోంది. రూ. 2,203 కోట్ల పెట్టుబడులు: సౌత్ ఇండియా, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన ప్రముఖ పారిశ్రామిక గ్రూపులతో ఒప్పందాలు జరగగా, ఇటీవల ఒకేసారి 7 ప్రధాన పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు.
ఉపాధి కల్పన: ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, సోలార్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో రాబోయే ఈ పరిశ్రమల ద్వారా స్థానికంగా 22,000 మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
గుడుపల్లెపై ఫోకస్
కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె పొగురుపల్లె కేంద్రంగా పారిశ్రామికరంగంపై ఫోకస్ పెట్టారు. రాజకీయంగా ఇక్కడ మరింత పట్టు సాధించాలనేది టీడీపీ నేతల ముందు ఉన్న టాస్క్. ఈ ప్రాంతం నుంచి శాంతిపురం, రామకుప్పం మండలాల సరిహద్దులో ఏర్పాటు చేసే విమానాశ్రయం కోసం అప్రోచ్ రోడ్లు కూడా నిర్మిస్తున్నారు.
పొరుగు విమానాశ్రయాలపై ప్రభావం ఎంత?
కుప్పం నుంచి ప్రధాన విమానాశ్రయాల దూరాలు గమనిస్తే..
బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 120 - 127 కిలోమీటర్లు
చెన్నై మీనంబాకం విమానాశ్రయం: 230 - 240 కిలోమీటర్లు
తిరుపతి విమానాశ్రయం: ~249 కిలోమీటర్లు .
కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటు వల్ల ఆ మూడు విమానాశ్రయాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.
బెంగళూరు, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాల ప్యాసింజర్ ట్రాఫిక్‌పై కుప్పం వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. అయితే, కుప్పం చుట్టుపక్కల నుంచి బెంగళూరు, చెన్నై మీదుగా వెళ్లే 'అగ్రి-కార్గో' (పూలు, పండ్ల ఎగుమతులు) ఇకపై నేరుగా కుప్పం ఎయిర్పోర్ట్ నుంచే వెళ్తాయి.
కుప్పం విమానాశ్రయం శాంతిపురం, రామకుప్పం మండలాల పరిధిలో ఏర్పాటు చేస్తున్నారు. రామకుప్పం మండలం పరిధిలో భూ సేకరణ వ్యవహారాలు పూర్తయ్యాయని తహసీల్దార్ కమలేష్ చెబుతున్నారు.
ఆపరేషన్స్ మేనేజ్మెంట్ లో భాగంగా కుప్పం ఎయిర్పోర్ట్ నిర్వహణ, ఆపరేషన్ల కోసం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (BIAL) షరతులతో కూడిన NOC ని ఇవ్వడం కీలక పరిణామం. దీనివల్ల బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు పోటీగా కాకుండా, అనుబంధ లాజిస్టిక్ పార్ట్నర్గా కుప్పం పనిచేస్తుంది.
తిరుపతి ఎయిర్పోర్ట్: ప్రధానంగా ఆధ్యాత్మిక, ప్యాసింజర్ రవాణాపై ఆధారపడి ఉండగా, కుప్పం పూర్తిగా పారిశ్రామిక, అగ్రి-కార్గో హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. కాబట్టి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు ఇది అనుబంధ లాజిస్టిక్స్ సెంటర్‌గా ఉపయోగపడుతుంది.
లాజిస్టిక్స్ కనెక్టివిటీ: బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మధ్యలో ఉండటం వల్ల ఈ ప్రాంతం త్రిభుజ కారిడార్‌లో ప్రధాన వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నారు.
వ్యవసాయం, పరిశ్రమలు, విమానయానం సమ్మిళితమై కుప్పం ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త 'గ్రోత్ ఇంజిన్'గా మారబోతోందని ప్రభుత్వ అభిప్రాయపడుతోంది. 2027 నాటికి పూర్తి చేస్తాయలనే సంకల్పం నెరవేరడానికి భూసేకరణ చిక్కులు వీడి, ఈ విమానాశ్రయానికి ఎప్పుడు టెంకాయ కొడతారో అని ఎదురుచూస్తున్నారు.
Next Story

