సరిహద్దులో ఎయిర్పోర్ట్:తమిళనాడు ప్రతిపాదన ప్రభావం ఎంత?
తిరుపతి ఎయిర్పోర్టుకు బాలారిష్టాలపై వీడియో కథనం
చిత్తూరు జిల్లా తిరుపతి (రేణిగుంట)లోని 56 ఏళ్ల నాటి విమానాశ్రయానికి అడుగడుగునా ప్రతిబంధకాలు తప్పడం లేదు. తాజాగా ఆంధ్ర సరిహద్దులో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేసింది. దీని వల్ల తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాలు ఎగరుతాయా? అనే ధర్మసందేహం తెరపైకి వచ్చింది.
తిరుపతి విమానాశ్రయానికి 2017లో అంతర్జాతీయ హోదా దక్కింది. దీనికోసం యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ 2010లో టెంకాయ కొట్టారు. కొత్త టెర్మినల్ కు 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయినా, ఇప్పటి వరకు సింగపూర్ కు ట్రయల్ రన్ కింద ఓ విమానం నడిపారు. ఆ తరువాత ఆ ఊసే లేదు.
"ఒక అంతర్జాతీయ విమానం వస్తే హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉంది" అని ఓ తిరుపతి విమానాశ్రయాఅధికారి చెప్పారు.
రన్ వే ఉన్నా, టెర్మినల్ పనులు ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు పెంచడం తోపాటు సెక్యూరిటీ మరింత అవసరం అని చెబుతున్నారు.
శ్రీవారి దర్శనానికి ఎన్ఆర్ఐలు నేరుగా రావడానికి, వ్యాపార దిగ్గజాలు సులువుగా రావడానికి గత నెలలో ఈ వీసా సదుపాయం కల్పిస్తే ఏఏఐ నోటిఫికేషన్ జారీ చేయడం ప్రయాణికులకు ఊరట కల్పించింది.
తమిళనాడు పోటీ అవుతుందా..?
ఈ పరిస్థితుల్లో ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
"ఇది తిరుపతి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు" అని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.
ఇదిలావుంటే.. రాయలసీమ ప్రాంతం నుంచి లక్షల సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి కోసం ఓపెన్ స్కై పాలసీ కింద కువైట్ కు విమానం నడపాలని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి 2023లో ఏప్రిల్ నెలలో కోరడంతో పార్లమెంట్ లో సానుకూల స్పందన వచ్చింది. 400 సీట్లతో విమానం నడపడానికి కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని అప్పటి రేణిగుంట విమానాశ్రయం డైరెక్టర్ రాజ్ కిషోర్ చెప్పిన మాటలు ప్రస్తావనార్హం. కానీ ఇంతరకు విదేశీ విమానాలు ఎగిరిన దాఖలాలు లేవు.
ఇక ఆలస్యం ఎందుకు?
ఇండిగో పాటు రెండు విమానయాన సంస్థలు అంతర్జాతీయ విమానాలు నడపడానికి సంసిద్ధంగా ఉన్నా, ఆ దిశగా అధికార ప్రయత్నాలు సాగడం లేదు. దీనికి సవాలక్ష కారణాలు చెబుతున్నారు.
తిరుపతి గరుడ టెర్మినల్లో ఇమిగ్రేషన్ కౌంటర్లు, కస్టమ్స్ చెకింగ్, ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) విభాగాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినా, విమానాలు నడవకపోవడంతో ఇవి పూర్తిస్థాయి వినియోగంలో లేవు. ఇక్కడ ఆధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC ) సెంటర్, రన్వే సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. పెద్ద విమానాలు (Code-E టైప్ aircrafts) కూడా ల్యాండ్ అయ్యేలా రన్వే పొడవు పెంచారు. కార్గో (Cargo): డొమెస్టిక్ కార్గో (Domestic Cargo) హ్యాండ్లింగ్ అందుబాటులో ఉంది. అంతర్జాతీయ కార్గో ప్రాసెసింగ్ సదుపాయాలకు ఫుల్-స్కేల్ ఆపరేషన్లు, ఏజెన్సీ అనుమతులు మరింత పెరగాల్సి ఉంది.
చిత్తూరు జిల్లా తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయానికి అన్నీ జాతీయ రహదారులే. కానీ, దరిదాపుల్లో డొమెస్టిక్ మినహా అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవు. 120 కిలోమీటర్ల దూరంలో చెన్నై. 240 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు కెంపే గౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. హైదరాబాద్ షంషాబాద్ విమానాశ్రయం 800 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ లెక్కల ఆధారంగా రేణిగుంట ఏయిర్ పోర్టులో అన్ని హంగులూ ఉన్నా, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు.
రేణిగుంట ప్రాధాన్యతలు ఇవీ..
చిత్తూరు జిల్లా తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో ప్రపంచ వాణిజ్య ఉత్పాదక సంస్థలకు శ్రీసిటి నిలయంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలే కాదు. నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి కూడా కువైట్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ కు ఉపాధి కోసం వెళ్లిన కార్మికుల సంఖ్య లక్షల్లో ఉంది. కేవలం కువైట్ లోనే దాదాపు నాలుగు లక్షల మంది తెలుగు వారు ఉన్నారు.
"రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా తీసుకుని రావడం అనేది నా ప్రమేయమే. దీనిని ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడానికే నిర్వీర్యం చేస్తున్నారు" అని తిరుపతి మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ ఆవేదన చెందారు.
రేణిగుంట విమానాశ్రాయానికి దేశీయంగానే విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మినహా, అంతర్జాతీయ సర్వీసులు రాకపోకలు సాగించే ఆధునిక సాంకేతిక వ్యవస్థ, వనరులు ఉన్నా, నిర్లక్ష్యానికి గురవుతోంది. నిర్వహణకు అయ్యే ఖర్చుకు ఆదాయానికి కేంద్ర విమానయాన శాఖ లంకె పెడుతోంది.
"ప్రస్తుతం ఉన్న అన్ని హంగుల నేపథ్యంలో అంతర్జాతీయ విమానయాన సంస్థలు క్రాఫ్టులు నడిపితే, ప్రయాణికులు, కార్గొ సేవలతో రేణగుంట విమానాశ్రాయం ఏపీలోని కేంద్రాలే కాదు. పొరుగు రాష్ట్రాలకు మించి ఆదాయం రావడం. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి మెరుగుపడతాయి" అని సీపీఎం నేత కందారపు మురళీ వ్యాఖ్యానించారు.
ఎందుకు నడవడం లేదు?
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం శ్రీవారి యాత్రికులకే కాదు. పారిశ్రామికవేత్తలకు కూడా ఉపయోగంగా ఉంది. నిత్యం వీఐపీ, వీవీపీలకు కేంద్ర బిందువుగా మారిన ఈ విమానాశ్రయం ఆ శాఖ కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మాటల్లో చెప్పాలంటే ఏపీకి ప్రధాన ద్వారం, తిరుమలకు మహద్వారం లాంటిదే. ఇక్కడి నుంచి అంతర్జాతీయ విమానాలు ఎగరడానికి జెండా ఊపడానికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఆదాయానికి, నిర్వహణ వ్యయానికి పోలిక లేదనేది విమానయాన మంత్రిత్వ శాఖ చెబుతున్న మాట. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు అనుమతి లభిస్తే, తిరుపతి ఏయిర్పోర్టు పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.
Next Story

