తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన అభయారణ్యాల్లో వాహనాల రాకపోకులపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. జనజీవనం రాత్రిళ్లు విశ్రాంతికి ఉపక్రమిస్తే, అడవుల్లో తెల్లవారుతుంది. వన్యమృగాల కళ్లలో వెలుగు వస్తుంది. పగలు విశ్రమించే వన్యప్రాణులు అడుగులు వేస్తాయి. వాటికి ప్రమాదం లేకుండా, తెలుగు రాష్ట్రాల్లోని ఐదు ప్రాంతాల్లో అడవుల గుండా సాగే రహదారులపై ఆంక్షలు అమలులో ఉన్నాయి. పగలు కనిపించని ఎన్నో అరుదైన వన్యప్రాణులు, నిశాచర జీవులు రాత్రి వేళల్లోనే ఆహారం, నివాసం కోసం బయటకు వస్తుంటాయి. ఈ ప్రాంతాల్లో వాహనాల రోద, శబ్ద కాలుష్యం ఆ జీవుల మనుగడకు ముప్పుగా మారుతున్న నేపథ్యలో అటవీ సంరక్షణ, జీవ వైవిధ్యం (Biodiversity) కాపాడే లక్ష్యంగా ప్రధాన అటవీ మార్గాలు, ఘాట్ రోడ్లలో రాత్రిళ్లు ప్రయాణాలపై కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న శ్రీశైలం ఘాట్ రోడ్డు నుంచి కడప జిల్లా వరకు విస్తరించి ఉన్న లంకమల అభయారణ్యం వరకు. దీనికి అనుబంధంగానే కడప జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు విస్తారణంగా ఉన్న రాపూరు సమీపంలో పెనుశిల నరసింహ అభయారణ్యం. అక్కడి నుంచి శేషాచలం అడవుల వరకు జీవవైవిద్యం కాపాడే లక్ష్యంగా రాత్రిళ్లు రహదారులు మూసివేస్తారు.దీని వెనుక ఉన్న బలమైన శాస్త్రీయ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కడప జిల్లాలోని శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యంలో వెళ్లే సిద్దవటం – బద్వేలు.. అంటే కడప మార్గంలో అరుదైన కలివి కోడి (Jerdon's Courser) రక్షణ కోసం విధించిన ఆంక్షలు ఉన్నాయి.
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు వాహనాల రాకపోకలపై అటవీ శాఖ కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది.
2008 – 2009 సంవత్సరం నుంచి ఆంక్షలు అమలు చేస్తోంది. అందుకు ప్రధాన కారణం అంతరించిపోయిందనుకున్న కలివి కోడి సిద్దవటం, రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో1986లో తిరిగి కనిపించడంతో ప్రభుత్వం లంకమల అటవీ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించింది.
లంకమల అభరయారణ్యంలో పగలు కూడా ప్రయాణించే వాహనాలకు వేగ పరిమితి విధించారు. తక్కువ వేగంతో మాత్రమే వెళ్లాలి. అటవీ సరిహద్దుల్లో బిగ్గరగా హారన్లు మోగించడం, వాహనాలు నిలిపి శబ్దం చేయడం నిషేధం. ఇంతటి ఆంక్షల వెనుక ప్రధాన నేపథ్యం కూడా ఉంది.
కలివికోడి ప్రాధాన్యత ఏమిటి?
కలివికోడి నిశాచర జీవి (Nocturnal Bird). ఇది పగటిపూట ముళ్ల పొదల్లో దాక్కుని, రాత్రి వేళల్లో మాత్రమే ఆహార సేకరణకు బయటకు వస్తుంది. ఈ పక్షి శారీరక స్వభావం ప్రకారం ఎత్తుగా ఎగరలేదని శాస్త్రవేత్తలు తేల్చిన అంశం. నేలపైనే వేగంగా పరిగెడుతుంది. రాత్రిపూట వాహనాల తీవ్రమైన వెలుగు (Headlights), శబ్దాల వల్ల ఇవి భయాందోళనకు గురై రోడ్లపైకి వచ్చి వాహనాల కిందపడి చనిపోయే ప్రమాదం ఉంది.
కలివి పొదల ఆవాసాల సంరక్షణ కోసం రోడ్డు ప్రయాణాల వల్ల కలిగే కాలుష్యం, శబ్దం, మానవ సంచారం వల్ల వాటి సహజ నివాస స్థలాలకు భంగం కలగకుండా చూడడం ప్రధాన ఉద్దేశం. ఈ పక్షి ఆవాసాలను రక్షించడానికి గతంలో తెలుగుగంగ ప్రాజెక్టు ఉపకాలువల నిర్మాణ మార్గాన్ని కూడా కోర్టు ఆదేశాలు, పర్యావరణవేత్తల విజ్ఞప్తి మేరకు వేరే వైపునకు మళ్లించారు.
భక్తుల భద్రత, ఘాట్ రోడ్డు నిర్వహణ, చిరుతలు, ఏనుగులు వంటి జంతువుల సంచారం నుంచి రక్షణ ప్రధాన లక్ష్యం. మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల సంచారం ఎక్కువ. అవ్వాచారికోన సమీపంలో రోడ్డుపైకి ఏనుగుల మంద రావడం సహజం. రెండో ఘాట్ రోడ్డులో చిరుతలు ఎక్కువగా సంచరిస్తుంటాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, లంబసింగి ఘాట్ రోడ్డులో
రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఉంది.
శీతాకాలంలో తీవ్రమైన పొగమంచు, లంబసింగి ఘాట్లలో దృశ్యమానత తగ్గి ప్రమాదాలు జరగకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు.
మారేడుమిల్లి – భద్రాచలం అటవీ మార్గంలో కూడా ఎలాంటి ఆంక్షలు ఉన్నాయంటే..
రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు భారీ వాహనాలకు అనుమతి ఉండదు.
శీతాకాలంలో తీవ్రమైన పొగమంచు వల్ల దృశ్యమానత (Visibility) తగ్గి జరిగే ప్రమాదాలను నివారించడం.
ఘాట్ రోడ్డు మూసివేస్తారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు. వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు.
తెలంగాణ వైపు నుంచి ఉన్న మార్గంలో మన్ననూర్, ఆంధ్ర పరిధిలోని దోమలపెంట, శ్రీశైలం నుంచి వచ్చే సమయంలో సిఖరం వద్ద గేట్లు మూసివేస్తారు.
ఈ మార్గం అమ్రాబాద్, నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ (పులుల అభయారణ్యం) అటవీ ప్రాంతం గుండా వెళుతుంది. రాత్రి సమయంలో వాహనాల శబ్దం, వెలుతురు వల్ల పులులు, చిరుతలు, ఏనుగులు, జింకలు వంటి వన్యప్రాణులకు భంగం కలగకుండా నిరోధించడానికి ఈ నిబంధన అమల్లో ఉంది. ప్రధానంగా రాత్రి వేళల్లో రోడ్డు దాటే క్రమంలో జంతువులు వాహనాలను ఢీకొట్టడం వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టడం. అంతేకాకుండా, ప్రమాదకర మలుపులు, అటవీ ప్రాంతంలో రాత్రి వేళల్లో వాహనాలు నిలిచిపోతే ప్రయాణికుల భద్రతకు ఇబ్బంది కలగకుండా చూడడం.
సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నిషేధాజ్ణలు విధించారు.
తిరుపతి జిల్లాలోకి చేరిన కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి నుంచి రాపూరు ఘాట్ రోడ్డు కూడా చేరింది. ఇక్కడి పెనుశిల అభయారణ్యంలో చిట్వేలి నుంచి రాపూరు వరకు ఉన్న 18 కిలోమీటర్ల పెనుశిల అభయారణ్యంలోకి వెళ్లడానికి ముందే సలివెందుల బీట్ చెక్ పోస్టు వద్ద వాహనాలు నిలిపివేస్తున్నారు.
ఇటీవల కొన్ని నెలలుగా చిరుత పులులు రహదారులపైకి వచ్చి, పిట్ట గోడపై కూర్చొంటున్న దృశ్యాలు సర్వసాధారణంగా మారాయి. కార్లలో వెళ్లే ప్రయాణికులు ఆ వీడియోలు చిత్రీకరించారు. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా, వన్యప్రాణుల రక్షణ కోసం చర్యలు తీసుకున్నట్లు అటవీశాఖాధికారులు స్పష్టం చేశారు.
ఈ అభయారణ్యాల్లో రాత్రిళ్లు ప్రయాణాలపై ఉన్నవి ఆంక్షలు, కేవలం నిబంధనలు మాత్రమే కాదు. మన జీవవైవిధ్యాన్ని, అరుదైన వన్యప్రాణులను కాపాడుకోవడానికి తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయాలు.