అడుగంటిన భూగర్భ జలాలు.. నీళ్ల కోసం అల్లాడుతున్న జనాలు!
ఏయే జిల్లాల్లో ఎంతెంత లోతుకు నీళ్లు పోయాయంటే..
ఆంధ్రప్రదేశ్లో వర్షాకాలం ముగిసింది.
అయినా భూగర్భజలాలు పెరగక పోగా తరిగాయి.
కాల్వలు ఎండిపోతున్నాయి.
రిజర్వాయర్లు అడుగంటుతున్నాయి.
బోర్లు, బావులు బావురంటున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితి వచ్చింది.
ఏయే జిల్లాలలో పరిస్థితి ఏమిటో ఓసారి చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ లో వర్షాకాలం ముగిసింది. వర్షాలతో పెరగాల్సిన భూ గర్భ జలాలు తరిగాయి.
ముఖ్యంగా రాయలసీమలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
ఏలూరు జిల్లాలో భూగర్భజల మట్టం 22.35 మీటర్ల లోతుకు పడిపోయింది.
ఇది గత 20 ఏళ్లలో నమోదైన అత్యల్ప స్థాయి ఇది.
శ్రీ సత్యసాయి జిల్లాలో 21.18 మీటర్లు...
అన్నమయ్యలో 18.68 మీటర్లు...
అనంతపురంలో 15.27 మీటర్లు...
అంటే కొన్ని జిల్లాల్లో భూమి పైనుంచి 20 మీటర్ల లోతుకు వెళ్లినా నీరు దొరికే పరిస్థితి లేదు.
అక్టోబర్ 8న మధ్యాహ్నం 2 గంటల వరకు నమోదైన ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే...
రాష్ట్రంలో 22.35 మీటర్ల లోతుకు వెళితే గాని నీళ్లు దొరికే పరిస్థితి లేదు.
ఇది ఏలూరు జిల్లాలో పరిస్థితి కాగా
శ్రీ సత్యసాయి – 21.18 మీటర్లు.
అన్నమయ్య – 18.68 మీటర్లు.
అనంతపురం – 15.27 మీటర్లు.
వైఎస్ఆర్ కడప – 13.90 మీటర్లు.
నంద్యాలలో 9.17 మీటర్లు,
కర్నూలులో 8.69 మీటర్లు,
తిరుపతిలో 8.57 మీటర్లు,
చిత్తూరులో 7.90 మీటర్ల స్థాయిలో భూగర్భజలాలు నమోదయ్యాయి.
మార్కాపురం జిల్లాలో అనేక ప్రాంతాల్లో 18 మీటర్లకు పైగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
అంటే రాయలసీమలోని అనేక జిల్లాల్లో నీటి మట్టాలు గణనీయంగా తగ్గాయి.
రాయలసీమలోనే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో చూద్దాం.
రాయలసీమలో సగటు భూగర్భజల మట్టం 14.14 మీటర్లు.
అదే సమయంలో కోస్తా ఆంధ్రలో సగటు 8.55 మీటర్లు.
అంటే రాయలసీమలో భూగర్భజలాలు కోస్తా ప్రాంతంతో పోలిస్తే చాలా లోతులోనే ఉంటాయి.
దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి... తక్కువ వర్షపాతం.
మరోవైపు... అధిక ఉష్ణోగ్రతలు.
దీనికి తోడు వ్యవసాయం కోసం బోర్లపై పెరుగుతున్న ఆధారం.
వానలు లేనప్పుడు సాగునీటి కోసం రైతులు భూగర్భజలాలనే ఎక్కువగా తోడేస్తుంటారు.
కానీ... భూమిలోకి చేరే నీటి పరిమాణం కంటే బయటకు తీసే నీరు ఎక్కువైతే ఏం జరుగుతుంది?
భూగర్భజల మట్టం క్రమంగా పడిపోతుంది.
అదే ఇప్పుడు అనేక ప్రాంతాల్లో కనిపిస్తోంది.
అయితే ఈసారి కోస్తా ప్రాంతానికీ ఈ ముప్పు తప్పలేదు.
భూగర్భజలాల సమస్య కేవలం రాయలసీమకే పరిమితం కాదు.
కోస్తా ఆంధ్రలో కూడా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
ఏలూరు జిల్లాలో 22.35 మీటర్ల స్థాయి దీనికి స్పష్టమైన ఉదాహరణ.
తూర్పుగోదావరి జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో భూగర్భజలాలు 20 మీటర్లకు పడిపోయాయి..
అంటే...
“రాయలసీమలోనే నీటి సమస్య” అని చెప్పుకునే పరిస్థితి లేదు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో... స్థానిక పరిస్థితులను బట్టి భూగర్భజలాలపై ఒత్తిడి పెరుగుతోంది.
ఇక గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
భూగర్భజలాలు పడిపోతున్నాయంటే... దాని ప్రభావం ముందుగా కనిపించేది బోర్లపై ఆధారపడే గ్రామాల్లోనే.
పట్టణాల్లో ప్రత్యామ్నాయ నీటి వనరులు ఉండొచ్చు.
కానీ గ్రామాల్లో చాలా కుటుంబాలు తాగునీటికి కూడా బోర్లపైనే ఆధారపడుతున్నాయి.
బోరు నీరు తగ్గితే...
మోటార్ పనిచేయదు.
నీటి సరఫరా తగ్గుతుంది.
కొత్త బోరు వేయాల్సి వస్తుంది.
అది కూడా పనిచేయకపోతే మరో బోరు.
ఇలా రైతులకు, గ్రామీణ కుటుంబాలకు ఖర్చు మీద ఖర్చు పెరుగుతూనే ఉంటుంది.
గిద్దలూరు ప్రాంతంలో ఇప్పటికే మూడు రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.
మార్కాపురంలోనూ అంతే.
చిత్రమేమంటే ఈసారి విశాఖపట్నంలోనూ ఇదే పరిస్థితి.
మరోపక్క రైతుల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి.
భూగర్భజలాలు 20 మీటర్లకు పైగా పడిపోవడంతో సాగునీటిని బోర్ల ద్వారా పారించడం రైతులకు కష్టంగా మారుతుంది.
నీరు మరింత లోతులోకి వెళ్లే కొద్దీ...
బోర్లను లోతుగా తవ్వాలి.
మోటార్ల సామర్థ్యం పెంచాలి.
విద్యుత్ వినియోగం పెరుగుతుంది.
అయినా నీరు దొరుకుతుందన్న గ్యారంటీ ఉండదు.
దీంతో సాగు ఖర్చు పెరిగే ప్రమాదం ఉంది.
చివరకు నీరు అందుబాటులో లేకపోతే...
పంటల ఎంపిక నుంచి సాగు విస్తీర్ణం వరకు ప్రభావం పడే అవకాశం ఉంది.
భూగర్భజలాలు తరిగిపోవడం వల్ల ఎంత ఇబ్బంది వస్తుందంటే...
కర్నూలు జిల్లాలో కరువు మండలాలను గుర్తించే సమయంలో భూగర్భజలాల స్థాయిని కూడా ఒక ప్రమాణంగా పరిగణించినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు.
అంటే...
భూగర్భజలాల పరిస్థితి ఇప్పుడు కేవలం నీటి శాఖకు సంబంధించిన అంశం కాదు.
కరువు తీవ్రతను అంచనా వేసే ఒక ముఖ్యమైన సూచికగా కూడా మారుతోంది.
రిజర్వాయర్లు కూడా అడుగంటుతున్నాయి.
ఇప్పుడు అసలు సవాలేమిటంటే... ఇది అక్టోబర్.
వచ్చే నెలల్లో కూడా వర్షాలు తగినంతగా లేకపోతే...
భూగర్భజలాలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా రాయలసీమలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఇది పెద్ద సమస్యగా మారవచ్చు.
మొదట తాగునీటిపై ఒత్తిడి.
తర్వాత సాగునీటిపై ఒత్తిడి.
ఆ తర్వాత బోర్లు వేయడానికి రైతులపై అదనపు ఆర్థిక భారం.
అంటే...
భూగర్భజలాల సమస్య ఒకేసారి తాగునీరు, వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేలా ఉంది.
వర్షాకాలం ముగిసింది.
నీటి మట్టాలు పెరగలేదు.
బావులు బావురంటున్నాయి.
బోర్లు వెలవెలబోతున్నాయి.
ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించనలవి కాదు.
ఇవే ఇప్పుడు సమాధానం వెతకాల్సిన ప్రశ్నలు.
Next Story

