
పల్లెపాడు గాంధీ ఆశ్రమం
మహాత్ముడి అడుగు జాడ.. పల్లెపాడు గాంధీ ఆశ్రమానికి కబ్జాదారుల పీడ!
ఎవరీ పొనకా కనకమ్మ? ఎందుకొచ్చిందీ ఆశ్రమం?
ఇవాళ మహాత్మాగాంధీ జయంతి. అక్టోబర్ 2.
గాంధీకి.. పల్లెపాడుకి సంబంధం ఏమిటీ?
అక్కడెక్కడో ఉన్న సబర్మతికి..
మన పినాకినీ గాంధీ ఆశ్రమానికి అనుబంధమేమిటీ?
ఎవరీ పొనకా కనకమ్మ? ఎందుకొచ్చిందీ ఆశ్రమం?
ఇప్పుడేం జరుగుతుందో చూసొద్దాం పదండి..
ఇదిగో.. ఇదే పల్లెపాడు గ్రామంలోని పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం.
గుజరాత్లోని సబర్మతి ఆశ్రమాన్ని పోలి ఉంటుంది. అదీ మన తెలుగు నేలపైన్నే! మహాత్ముడు స్వయంగా ప్రారంభించిన సబర్మతి లాంటి ఆశ్రమం ఇది.
నెల్లూరు నగరానికి పది,12 కిలోమీటర్ల దూరంలో, పెన్నా నది ఒడ్డున ఉన్న చారిత్రక ప్రదేశం. వందేళ్ల క్రితం స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి కేంద్రంగా నిలిచిన ఈ ఆశ్రమం వెనుక ఒక అద్భుత చరిత్ర ఉంది.. ఒక మహిళా త్యాగధనురాలి స్ఫూర్తిదాయక కథ ఉంది.
అది 1921 మార్చి నెల..
స్వాతంత్య్రోద్యమం ఉర్రూతలూగుతోంది. ఆంగ్లేయుల్ని తరిమి కొట్టే సమయం కోసం దేశం ఎదురుచూస్తోంది. ఇంగ్లీషోడికి దేశ ప్రజలు ససేమిరా సహకరించబోమంటున్నారు. గాంధీ పిలుపునకు జనం ఉప్పెనలా పోటెత్తుతున్నారు.
సరిగ్గా ఆ దశలో.. గాంధీజీ పల్లెపాడు పినాకిని ఆశ్రమానికి వచ్చారు. దీని వెనుక ఒక గొప్ప చారిత్రక సందర్భం ఉంది. ఆయన ఏదో సాధారణ పర్యటనలో భాగంగా ఇక్కడికి రాలేదు.
విజయవాడ కాంగ్రెస్ సదస్సు 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిపారు. అంటే.. ఈ ఆశ్రమాన్ని ప్రారంభించడానికి సరిగ్గా వారం రోజుల ముందు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) సమావేశాలు విజయవాడలో (అప్పటి బెజవాడ) జరిగాయి.
ఈ సదస్సు భారత స్వాతంత్య్ర చరిత్రలో ఒక మైలురాయి.
ఇక్కడే పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను గాంధీజీ ఆమోదించారు. అలాగే ఉద్యమ ఖర్చుల కోసం 'తిలక్ స్వరాజ్ నిధి' కింద ఒక కోటి రూపాయలు వసూలు చేయాలని, కాంగ్రెస్లో కోటి మందిని సభ్యులుగా చేర్పించాలని, 20 లక్షల రాట్నాలను (చరఖాలను) పంపిణీ చేయాలని ఈ సదస్సులో తీర్మానించారు.
విజయవాడలో తీసుకున్న ఈ తీర్మానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గాంధీజీ ఏప్రిల్ మొదటి వారంలో తన సతీమణి కస్తూర్బాతో కలిసి ఆంధ్రలో సుడిగాలి పర్యటన చేశారు.
ఏప్రిల్ 2న కాకినాడ, ఏప్రిల్ 3న ఏలూరు, ఏప్రిల్ 5న మచిలీపట్నం, ఏప్రిల్ 6న చీరాలలో ఆయన పర్యటించారు. ఖద్దరును ప్రోత్సహించడం, అంటరానితనం నిర్మూలన, హిందూ-ముస్లిం ఐక్యత గురించి ఆయన ప్రతి ఊరిలో సభలు పెట్టి ప్రసంగించారు.
ఈ ఆంధ్ర పర్యటనలో భాగంగానే ఏప్రిల్ 7, 1921న ఆయన నెల్లూరుకు చేరుకున్నారు. నెల్లూరులో ముందుగా 'తిలక్ విద్యాలయ'ను ప్రారంభించారు.
ఆ తర్వాత అక్కడికి సమీపంలో ఉన్న పల్లెపాడు గ్రామానికి వెళ్లి, పెన్నా నది ఒడ్డున పొనకా కనకమ్మ తదితరులు ఏర్పాటు చేసిన 'పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని' తన చేతుల మీదుగా ప్రారంభించారు. గాంధీజీ సూచన మేరకు ఈ ఆశ్రమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రూ.10,000 ఆర్థిక సాయం కూడా అందించింది.
అయితే ఈ ఆశ్రమం వెనుక గాంధీజీ స్ఫూర్తి ఎంత ఉందో, దాని కోసం తన భూమిని త్యాగం చేసిన పొనకా కనకమ్మ సంకల్పం కూడా అంతే ఉంది. సబర్మతి ఆశ్రమం తర్వాత గాంధేయ సిద్ధాంతాలతో ఏర్పాటైన అతి ముఖ్యమైన కేంద్రాల్లో పల్లెపాడు ఆశ్రమం ఒకటి.
ఆ రోజుల్లో ఇదొక నివాస స్థలం మాత్రమే కాదు.. స్వాతంత్య్ర ఉద్యమ కార్యకర్తలకు శిక్షణా కేంద్రం. ఖద్దరు వినియోగం, స్వదేశీ ఉద్యమం, అంటరానితనం నిర్మూలన వంటి ఎన్నో కార్యక్రమాలకు ఈ ఆశ్రమం వేదికగా నిలిచింది. 1930 ఉప్పు సత్యాగ్రహం సమయంలో ఉద్యమకారులు ఇక్కడి నుంచే తమ కార్యాచరణను ప్రారంభించారు.
ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ ఆశ్రమం కోసం ఆ రోజుల్లో 13 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన మహిళా శిఖామణి పొనకా కనకమ్మ. పినాకిని ఆశ్రమం అనగానే దుగ్గిరాల హనుమంతరావు, చతుర్వేదుల కృష్ణయ్య లాంటి పేర్లతో పాటు ప్రముఖంగా వినిపించే పేరు పొనకా కనకమ్మదే.
1892లో నెల్లూరు జిల్లా మినగల్లులో పుట్టారు కనకమ్మ. అదొక సంపన్న భూస్వామ్య కుటుంబం. ఎనిమిదేళ్లకే పెళ్లి అయింది. ఆనాటి సామాజిక పరిస్థితుల వల్ల ఆమెకు బడికెళ్లి చదువుకునే అదృష్టం దక్కలేదు. కానీ, చదువుకోవాలన్న కసి ఆమెను ఆపలేదు. స్వయంకృషితో తెలుగు, హిందీ, సంస్కృత భాషలు నేర్చుకున్నారు.
చిన్నతనంలోనే వందేమాతరం ఉద్యమం (1907) పట్ల ఆకర్షితురాలైన ఆమె.. బిపిన్ చంద్రపాల్ కు ఆతిథ్యం ఇచ్చారు. తొలుత సాయుధ విప్లవ భావాలతో ఉన్న కనకమ్మ, విప్లవకారులకు సహాయం చేయడానికి ఈ పల్లెపాడు భూమిని కొనుగోలు చేశారు. కానీ, మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో ఆమె అహింసా మార్గం వైపు మళ్లారు. తన 13 ఎకరాల భూమిని పినాకిని సత్యాగ్రహ ఆశ్రమానికి విరాళంగా రాసిచ్చేశారు.
కనకమ్మ కేవలం ఆశ్రమం స్థాపించడానికే పరిమితం కాలేదు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, ఆరు నెలల పాటు కఠిన కారాగార శిక్షను, ఆ తర్వాత 1932లో మరో 13 నెలల జైలు శిక్షను అనుభవించారు. రాయవెల్లూరు జైలులో రాజాజీ, దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి ఉద్ధండులతో కలిసి ఆమె జైలు జీవితం గడిపారు.
కనకమ్మ జీవితంలో ఉన్న ఒక ఆసక్తికరమైన మానవీయ కోణం ఏమిటంటే.. చిన్నతనంలో తాను బడికి వెళ్లలేకపోయినా, రాబోయే తరాల ఆడపిల్లలు చదువుకు దూరం కాకూడదని ఆమె గట్టిగా నిశ్చయించుకున్నారు.
ఆ సంకల్పంతోనే 1923లో నెల్లూరులో శ్రీ కస్తూరిదేవి విద్యాలయాన్ని స్థాపించారు. టంగుటూరి ప్రకాశం పంతులు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పాఠశాల.. 1929లో ఏకంగా మహాత్మా గాంధీ చేతుల మీదుగానే శాశ్వత భవనానికి శంకుస్థాపన జరుపుకుంది. నిధుల కోసం నాటకాలు వేసి మరీ ఆ పాఠశాలను నడిపించారామె.
ఇదండీ గాంధీజీ పల్లెపాడు పర్యటన కథ. ఈ ఆశ్రమం నాటి సహాయ నిరాకరణ ఉద్యమానికి రణ క్షేత్రం.
పినాకిని ఆశ్రమాన్ని ప్రారంభించిన గాంధీజీ అక్కడ ఎన్ని రోజులున్నారో తెలియదు గాని, ఆయన అడుగుపెట్టిన ఆశ్రమాన్ని ఇవాళ మనం కాపాడుకోవాల్సిన అవసరమూ ఉంది.
గాంధీ జయంతి వేళ మహాత్ముడి విగ్రహాలకు పూలమాలలు వేయడం ఎంత ముఖ్యమో..
ఆయన అడుగుజాడల్లో నడవడమూ అంతే ముఖ్యం.
కనకమ్మ లాంటి త్యాగధనుల చరిత్రను కాపాడాలి,
పల్లెపాడు ఆశ్రమాన్ని కబ్జాకోరుల పాలు కాకుండానూ కాపాడుకోవాలి.
ఇందుకు నేటి తరం నడుంకట్టాలి.
అదే ఇవాళ మనం గాంధీకి సమర్పించే నిజమైన నివాళి!
Next Story

