ఎక్సలెన్స్ గందరగోళం: సమస్యల కూపంలో ఎస్సీ విద్యార్థులు
గురుకుల పాఠశాలల్లో ముందస్తు ప్రణాళిక లేని బదిలీలతో తల్లిదండ్రుల ఆవేదన. మానసిక ఇబ్బందుల్లో పిల్లలు. సమాధానం చెప్పలేని స్థితిలో అధికారుల తీరుపై వీడియో కథనం.
రాష్ట్రంలో మూడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలను ఎక్సలెన్సీ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలనే ప్రభుత్వం నిర్ణయం వేలాది మంది దళిత విద్యార్థులకు శాపమైంది. 2026 27 విద్యా సంవత్సరం మధ్యలో ఈ నిర్ణయం అమలు చేయడం అనేది గురుకుల పాఠశాలలో చదువుతున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఇరుకుమురికి గదుల్లో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ గురుకుల పాఠశాలల్లో మూడింటిని ఎక్సలెన్సీ సెంటర్లుగా సి ఓ ఈ ఎస్ శిక్షణ కోసం నిర్ణయించారు. దీనికోసం 2026 జూన్ 11వ తేదీ జీవో ఆర్టీ నెంబర్ 144 జారీ చేశారు.
ఈ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా మేగాద్రి గడ్డ ఎస్సీ బాలికల గురుకులం పాఠశాల, గుంటూరు జిల్లా అమరావతి లోని తాడికొండ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం, నెల్లూరు జిల్లా గూడూరు ఎస్సీ నియోజకవర్గం లోని కోట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలను ఎక్సలెన్సీ కేంద్రాలుగా ఎంపిక చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ఆ మేరకు ఉత్తరంలో జారీ చేసింది
ఈ మూడు కేంద్రాలలో ఒక్కో గురుకుల పాఠశాలలో 3.9 కోట్ల రూపాయలు ఏడాదికి విద్యార్థులకు ఐఐటి- జేఈఈ jee , ఎన్ఈఈటి పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవసరమైన సాంకేతిక విజ్ఞాన బోధన చేయడానికి చర్యలు తీసుకున్నారు.
ఇదీ సమస్య
2026 27 విద్యా సంవత్సరం జరుగుతుండగా అర్ధాంతరంగా ఈ మూడు గురుకుల పాఠశాలలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను మిగతా ఎస్సీ రెసిడెన్షియల్ స్కూలుకు తరలించడం అనేది సమస్యగా మారింది. ఈ మూడు పాఠశాలలు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఆ మూడు కోర్సులో శిక్షణ ఇచ్చే కేంద్రాలుగా పరిమితం చేశారు. ఈ మూడు పాఠశాలల్లో ఉన్న హై స్కూల్ స్థాయి విద్యార్థులను ముందస్తు ప్రణాళిక లేకుండా తరలించడం అనేది కలకలం రేపింది. విద్యార్థుల మనసులు గాయపడేలా చేసింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆ విద్యార్థుల తల్లిదండ్రులలో కూడా ఆందోళనకు కారణమైంది.
నెల్లూరు జిల్లా కోటలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులను తరలించడంపై నిరసనలకు ఆజ్యం పోసింది. ఈ విషయాలపై 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధులు గూడూరు నియోజకవర్గంలోని కోట గురుకుల పాఠశాల తోపాటు ఇక్కడి నుంచి తరలించిన విద్యార్థులకు వసతి కల్పించిన వాకాడు ఎస్సీ గురుకుల పాఠశాలను సందర్శించింది.
తహసీల్దార్ స్పందన ఇదీ..
వాకాడు గురుకుల పాఠశాలను సందర్శించడానికి ముందు ఈ మండల తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ ను ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధులు పలకరించారు. వాకాడు తాసిల్దార్ కార్యాలయానికి రోడ్డుకు అటుపక్క కూత వేటు దూరంలోనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఉంది.
" కోట గురుకుల పాఠశాల నుంచి వాకాడుకు 250 మంది విద్యార్థులను తరలించినట్లు సమాచారం ఉంది. మీడియాలో అనేక కథనాలు వచ్చాయి నేను చదివాను" అని తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ చెప్పారు.
" విద్యార్థులు ఎలాంటి స్థితిలో ఉన్నారు? అనేది తాను ఇప్పటివరకు పరిశీలించలేదు. రెండు మూడు రోజుల్లో వెళ్లి చూస్తాను" అని సయ్యద్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో వాకాడు మండల ఎంఈఓతో కూడా ఆయన ఫోన్లో మాట్లాడారు. ఆయన కూడా గురుకుల పాఠశాలలో పరిస్థితిని పరిశీలించడానికి వెళ్లలేదని విషయం స్పష్టమైంది.
కోట గురుకుల పాఠశాలలో హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరూ దళిత సామాజిక వర్గానికి చెందిన వారే.
కోట గురుకుల పాఠశాలలో 650 మందికి పైగానే విద్యార్థులు ఉన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు 61 మందిని మినహాయిస్తే హైస్కూల్ విద్య చదువుతున్న 250 మంది విద్యార్థులను ఐదు కిలోమీటర్ల దూరంలోని వాకాడు గురుకుల పాఠశాలకు తరలించారు. మిగతా వారందరినీ నాయుడుపేట సమీపంలోని ఎస్సీ గురుకుల పాఠశాల, చిల్లకూరు గురుకుల పాఠశాలలకు బదిలీ చేశారు.
"ఈ విషయంపై మాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదు" అనేది విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణ.
"మాబడి మాకే కావాలి ఇక్కడే మా పిల్లలు చదువుకోవాలి" అని డిమాండ్ చేశారు.
ఈ పరిస్థితికి దారి తీసిన అంశం ఇది..
గూడూరు నియోజకవర్గంలోని కోట ఎస్సీ గురుకుల పాఠశాలల నుంచి 250 మంది విద్యార్థులను సమీపంలోని వాకాడు మండల గురుకుల పాఠశాలకు తరలించారు. గురుకులంలో ఇప్పటికే 600 మందికి పైగానే పిల్లలు చదువుకుంటున్నారు. వాకాడు గురుకుల పాఠశాలలో 871 మంది విద్యార్థులకు సంఖ్య పెరిగింది.
వాకాడు గురుకుల పాఠశాలలో కేవలం ఉన్నవి ఐదు గదులు. పడుకునేందుకు కూడా స్థలం కొరత ఏర్పడింది. భోజనాల కూడా ఆరుబయటే చేయాలి టాయిలెట్ కు వెళ్లాలంటే వందల మంది విద్యార్థులు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలని వీలుగా ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటు నిర్ణయంతో వందలాది మంది దళిత బడుగు బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలను ఇబ్బందిగా మార్చిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
నేను ఉండలేకున్నా...
"పాఠశాల పరిస్థితిని చూసి ఇక్కడ వాతావరణాన్ని జీర్ణించుకోలేని ఓ విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. అర్ధరాత్రి కొడుకు నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో వారు ఆందోళనకు గురయ్యారు. ఈ వాతావరణం లో నేను ఉండలేను. నాకు చాలా ఇబ్బందిగా ఉంది" అనేది ఆ పిల్లవాడి ఆవేదన.
మాటలు వినిన వెంటనే ఆ తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఇదే తరహాలో అనేకమంది తల్లిదండ్రులు కూడా సమాచారం అందుకుని కోట పాఠశాల వద్దకు వచ్చి ధర్నా నిర్వహించారు. చాలామంది పిల్లలను వాకాడు, చిల్లకూరు గురుకుల పాఠశాలలకు తరలించారు.
"ఉన్నవారిలో 11 మంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోయినట్లు ఉపాధ్యాయులే స్పష్టం చేశారు"
2026 27 విద్యా సంవత్సరం ప్రారంభమై విద్యార్థులు ఇప్పుడిప్పుడే నేపథ్యంలో రాష్ట్రంలోని మూడు కేంద్రాల్లో ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయంతో గురుకుల పాఠశాలల్లో అలజడి చెలరేగింది.
ఆంక్షలు.. మీడియాకు నో ఎంట్రీ
గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంటున్న అంశాలపై పరిశీలించడానికి 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధులు వాకాడు గురుకుల పాఠశాలను సందర్శించింది. వాకాడు గురుకుల పాఠశాల గేటు తీయించి ఆవరణలోకి ప్రవేశించడమే ఆలస్యం. ప్రిన్సిపాల్ కొంతమంది ఉపాధ్యాయులు అడ్డుపడ్డారు. పిల్లలతో మాట్లాడించడానికి అనుమతించలేదు. హాస్టల్ పరిశీలన కూడా ఏమాత్రం అంగీకరించలేదు.
" మీడియాను అనుమతించవద్దని ఆంక్షలు ఉన్నాయి. ముందస్తు అనుమతి లేకుండా వీడియో తీయడానికి లేదు" అంటూ అడ్డుకున్నారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వెంకటేశ్వర్ తో సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ముఖ్యమంత్రి కార్యక్రమంలో ఉన్న ఆయన స్పందించలేకపోయారని తెలుస్తోంది.
గురుకుల పాఠశాల అధికారులతో మాట్లాడాలని సిబ్బంది చెప్పినా, నంబర్లు ఇవ్వడానికి కూడా ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. ఈ వ్యవహారం సుమారు మూడు గంటలసేపు మీడియా ప్రతినిధులను అనుమతించకుండా అడ్డుకున్నారు. చివరికి వాకాడు గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ పాఠశాలల సమన్వయకర్త సి. ప్రభావతమ్మకు కాల్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ఆమె నెంబర్ దొరికితే ఫెడరల్ ప్రతినిధి ఆమెతో మాట్లాడారు.
" రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఎక్సలెన్సెస్ సెంటర్లు ఏర్పాటు చేశాం. వాకాడు గురుకుల పాఠశాలను రెండు రోజుల కిందటే నేను సందర్శించాను పరిస్థితి బాగానే ఉంది " అని ప్రభావతమ్మ స్పష్టం చేశారు.
"మళ్లీ పరిశీలించి సమస్యలు ఉంటే పరిష్కరిస్తాను" అని ప్రభాతమా స్పష్టం చేశారు.
"600 మంది ఉండాల్సిన గురుకుల పాఠశాలలో 850 మందికి పైగానే విద్యార్థులను ఎలా సర్దుబాటు చేస్తారు "విషయంపై మాత్రం స్పందన కరువైంది.
"వాకాడు గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఏడుస్తున్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు భయపడుతున్నారు. వారిని ఇబ్బంది పెట్టకండి అని మాత్రమే ఆమె సూచన చేశారు.
అధికారి అనుమతించినా..
వాకాడు గురుకుల పాఠశాల సిబ్బంది అడ్డుపడ్డారు. ఈ మాటల వ్యవహారం సాగుతుండగానే మీడియా ముసుగులో ఉన్న కొందరు ఇంకొంతమందిని పోగు చేసి ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధులు సమాచారం సేకరించకుండా అడ్డుపడ్డారు.
" ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం అధికారుల బాధ్యత. దాని పరిణామాలను విశ్లేషించడం మీడియా కర్తవ్యం. వాకాడు గురుకుల పాఠశాలలో పరిస్థితి ఎలా ఉందో స్వయంగా చూడ్డానికి కాదు కదా. వివరాలు చెప్పడానికి కూడా అక్కడ సిబ్బంది నానా యాతన పడ్డారు"
గూడూరు నియోజకవర్గం కోట గురుకుల పాఠశాల నుంచి వాకాడికి వచ్చిన విద్యార్థుల్లో ఇద్దరు టీసీలు తీసుకుని వెళ్లారు అని అక్కడి తెలుగు టీచర్ చెప్పారు.
" మీ తరగతిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు. 9వ తరగతిలో కోట నుంచి వచ్చిన విద్యార్థులు ఎంతమంది "? ఉపాధ్యాయుడి నుంచి స్పందన సమాచారం లేదు.
కోట గురుకుల పాఠశాలలోకి కూడా ప్రిన్సిపల్ ఆనందరావు అనుమతించలేదు. అక్కడికి పని చేస్తే కాంట్రాక్టు సిబ్బంది కూడా తమ అసహాయతను వ్యక్తం చేశారు. మీరు ఎక్కడికి వెళ్లినా, నేను కూడా వెంట వస్తా కానీ ఫోటోలు వీడియోలు తీయవద్దు" అని ఆయన అభ్యంతరం చెప్పారు. కొన్ని మాటలు చెప్పిన తర్వాత కన్విన్స్ అయిన ఆనందరావు అందించిన సమాచారం మేరకు.
ఎనిమిది జిల్లాల నుంచి ఇంటర్ విద్యార్థులు
కోట గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు 61 మంది ఉన్నారు. గెస్ట్ ట్రాన్స్ఫర్ కింద 58 మంది విద్యార్థులు వచ్చారు. ఈ పాఠశాల నుంచి 480 మంది విద్యార్థులు వాకాడు, చిల్లకూరు, నాయుడుపేట ఎస్సీ గురుకుల పాఠశాలలకు తరలించారని ప్రిన్సిపల్ ఆనందరావు చెప్పారు. రాయలసీమలోని విభజిత ఎనిమిది జిల్లాల విద్యార్థుల కోసం కోట గురుకుల పాఠశాలను ఎక్స్ లెన్సీ కేంద్రంగా ఎంపిక చేశారు.
అదేసమయంలో కడప జిల్లా నందలూరు చెందిన మనోహర్ కూడా కోట గురుకుల పాఠశాల వద్దకు ఆయన కూతురు, భార్యతో వచ్చారు.
"నా కూతురు కడప సమీపంలోని చిన్నచౌకు గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. ఈ కేంద్రంలో చదువుకోవడానికి మా పాపను ఎంపిక చేశారు. మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశతోనే ఇక్కడికి తీసుకుని వచ్చాను" అని మనోహర్ చెప్పారు.
కోట గురుకుల పాఠశాల ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి దాకా, బాలురకు మాత్రమే పరిమితం, ఎక్సలెన్సీ కేంద్రం ఏర్పాటుతో కో ఎడ్యుకేషన్ కేంద్రంగా మారింది. బాలికలుకు ప్రత్యేకంగా హాస్టల్ ఉన్నా, బాలురకు మాత్రం తరగతి గదులే హాస్టల్ గదులుగా మార్చారు.
"చాప, దిండు, దుప్పటి వారే తెచ్చుకోవాలి. త్వరలో పాఠశాల నుంచి ఏర్పాట్లు చేస్తారు" అని ప్రిన్సిప్ ఆనందరావు వివరించారు.
గురుకులంలోనే ఈ ప్రయోగం ఎందుకు?
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో పేద వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు.
చేయడానికి ఉద్దేశించిన జీవో నెంబర్ 144 వల్ల రెండు వేల మంది విద్యార్థులకు మానసికంగా ఇబ్బందులకు వేదనకు గురి చేసినట్లు జరుగుతున్న కార్యక్రమాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో
" గూడూరు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కోట గురుకుల పాఠశాలను యధాతధంగా కొనసాగించాలి. హై స్కూల్ స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండాలి" అనే డిమాండ్‌తో గూడూరు నియోజకవర్గ బందుకు కూడా అఖిలపక్షం పిలుపు ఇచ్చింది.
వందల మంది విద్యార్థుల కోసం వేలాది మంది విద్యార్థులను మానసికంగా, వారి తల్లిదండ్రులను మరింత ఇబ్బంది చేసే విధంగా ఈ జీవో ఉన్నట్లు కనిపిస్తుంది. గురుకుల పాఠశాల వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకువచ్చే విధంగా నిర్ణయాలు ఉంటే తప్పులేదు.
"గురుకుల పాఠశాలలను ఎక్స్‌లెన్సీ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులను ప్రాంతానికి తరలించారు. దీనికి బదులు ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఎక్స్లెంట్ కేంద్రాల నిర్వహణకు మరో భవనాలు ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నులు వినిపిస్తున్నాయి.
Next Story



