AP సాగునీటి ప్రాజెక్టుల నివేదిక: అంకెలగారడీయేనా?
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల విడుదల చేసిన ప్రగతి నివేదికపై సాగునీటి పారుదల రంగ విశ్లేషకుడు లక్ష్మీనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల విడుదల చేసిన ప్రగతి నివేదికపై సాగునీటి పారుదల రంగ నిపుణుడు, విశ్లేషకుడు లక్ష్మీనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాబోయే రెండేళ్లలో (2028 డిసెంబర్ నాటికి) ₹35,505 కోట్ల అంచనా వ్యయంతో 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన "అంకెల గ్యారడీ"గా అభివర్ణించారు.
ఈ నివేదికలోని లోపాలను వేలెత్తి చూపుతూ లక్ష్మీనారాయణ మంత్రికి ఒక బహిరంగ లేఖ రాశారు. అందులోని ముఖ్యమైన అంశాలు:
ప్రాజెక్టుల సంఖ్య పెంచి చూపడం: హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి భారీ ప్రాజెక్టులను వేర్వేరు భాగాలుగా, బ్రాంచి కాలువలుగా విడగొట్టి ప్రత్యేక ప్రాజెక్టులుగా చూపారని విమర్శించారు. పాత ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులను కూడా కొత్త ప్రాజెక్టుల జాబితాలో చేర్చడం సముచితం కాదన్నారు.
నీరు చేరని ఆయకట్టు: దశాబ్దాలుగా వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము ఖర్చు చేసినా, పంట కాలువల వ్యవస్థ (డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్) నిర్మించకపోవడం వల్ల పొలాలకు నీరు అందడం లేదు. కేవలం చెరువులు నింపడానికే పరిమితమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టు ఆందోళన: పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తే (MDTL) ఆశించిన బహుళ ప్రయోజనాలు సిద్ధించవు. 45.72 మీటర్ల మేర నిర్మించి, ఆర్ అండ్ ఆర్ (R&R) ప్యాకేజీని పూర్తిస్థాయిలో అమలు చేస్తేనే 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీరు అందుతుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వాలు మారినా ప్రాజెక్టుల పేరుతో కాలయాపన చేయకుండా, కేవలం ఫైళ్లకే పరిమితం కాకుండా రైతుల పొలాల్లోకి నీరు చేరినప్పుడే అసలైన ప్రగతి సాధించినట్లవుతుందని, దీనిపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story

