x

"మొగోడు.. మొగోడి రాజకీయాలు చేయాలి".. నారా భువనేశ్వరి పదుపైనా బాణాలు

నాలుగేళ్ల మౌనం వీడి కుప్పంలో భావోద్వేగం. ఇది కేవలం ఆవేదనా? లేక భవిష్యత్తు రాజకీయ హెచ్చరిక


రాష్ట్ర రాజకీయాల్లో మహిళా ఆత్మగౌరవం చుట్టూ తిరిగిన ఒక అధ్యాయం... నాలుగేళ్ల తర్వాత మళ్లీ సరికొత్త మలుపు తిరిగింది! రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఒక మహిళ, తనపై జరిగిన వ్యక్తిత్వ హననంపై దాదాపు నాలుగేళ్ల పాటు మౌనం వీడారు. కుప్పం గడ్డపై ఇటీవల మూడు రోజుల కుప్పం పర్యటనలో తొలిసారిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భార్య నారా భువనేశ్వరి భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పేరు ప్రస్తావించకుండా, వేసిన చురకలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఆమె సంధించిన పదునైన ప్రశ్నల వెనుక ఉన్న అర్థం ఏమిటి? ఇది కేవలం గతానికి కౌంటర్ ఇవ్వడమా? ఏపీ రాజకీయాల్లో సంభవించిన ఒక పెద్ద మార్పుకు సంకేతమా?

మొత్తానికి ఆమె లెవనెత్తిన ప్రశ్నలు,హితోక్తులు, మహిళలను ఆలోచనలో పడేసిన ఆ మాటలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.
"మొగోడు మొగోడి రాజకీయాలు చేయాలి" అంటూ వైఎస్. జగన్, వైసీపీ పార్టీ పేరు ప్రస్తావించకుండా నారా భువనేశ్వరి చురకలు వేయడం రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఆమె భావోద్వేగ ప్రతిస్పందన మాత్రమే కాదు. దీని వెనుక బహుళ కోణాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తిగత, భావోద్వేగ ప్రతిస్పందన మాత్రమేనా? లేక, టీడీపీలో పెరుగుతున్న ఆమె పాత్ర, క్షేత్రస్థాయి పర్యటనల నేపథ్యంలో, మహిళా ఓటర్లు, పార్టీ శ్రేణులు, రాజకీయ వర్గాలు ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకుంటున్నాయి? ఈ వివరాల్లోకి వెళ్లే ముందు కాస్త గతాన్ని తరిచి చూద్దాం..

చంద్రబాబును అవమానించే సంఘటనకు దారి తీసిన అంశం ఏమిటి?

"2021 నవంబర్ 19న ఏపీ శాసనసభలో వ్యవసాయం, ఇతర అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో నాటి అధికార వైసీపీ మంత్రి కొడాలి నాని తోపాటు వల్లభనేని వంశీ నారా లోకేష్ పుట్టకపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని, ప్రజా జీవితానికి దూరంగా ఉండే చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి లక్ష్యంగా వ్యక్తిగత దూషణలు, క్యారెక్టర్ అస్సాసినేషన్ (వ్యక్తిత్వ హననం) చేశారు. ఆమె శీలాన్ని శంకించే విధంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
రాజకీయం కోసం ఇంట్లోని మహిళలను, కుటుంబ సభ్యులను అసెంబ్లీ వేదికగా లాగడం చంద్రబాబును తీవ్రంగా కలచివేసింది. సభలోనే కాకుండా, ఆ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కూడా ఆయన విలపిస్తూ, రాజకీయాల్లో ఇంతటి నీచమైన సంస్కృతిని ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కౌరవ సభ, ఇక్కడ నేను ఉండలేను. సభకు కూడా రాను. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో కాలు మోపుతా అని భీకర ప్రతిజ్ణ చేసిన నారా చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారు.

మౌనం వీడిన భువనేశ్వరి

అయితే, నాడు జరిగిన ఆ వ్యక్తిత్వ హననంపై దాదాపు నాలుగేళ్ల పాటు మౌనంగా ఉన్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఇటీవల తన కుప్పం పర్యటనలో తొలిసారిగా భావోద్వేగపూరితంగా స్పందించారు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? నాలుగేళ్ల తర్వాత ఆమె ఎందుకు స్పందించారు? దీని వెనుక ఉన్న రాజకీయ, భావోద్వేగ సందేశం ఏమిటి?"
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా చంద్రబాబు 2023లో అరెస్టయ్యారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. అప్పటి వరకు ఇంటికే పరిమితమై, హెరిటేజ్ వ్యవహారాలు మాత్రమే చూసుకుంటున్న నారా భువనేశ్వరి నేరుగా ప్రజల్లోకి వచ్చారు. 'నిజం గెలవాలి' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో దిగ్భ్రాంతికి గురై మరణించిన కుటుంబాలను ఓదార్చారు. ఈ పర్యటన ద్వారా ఆమె కేవలం ఒక గృహిణిగానే కాకుండా, కష్టకాలంలో నిలబడిన ఒక ధైర్యవంతమైన మహిళగా, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే నాయకురాలిగా ప్రజల్లో బలమైన ముద్ర వేశారు.
2021లో 'కౌరవ సభ'గా మారిన శాసనసభను వదిలివెళ్లిన చంద్రబాబు, 2024 జూన్ 21న ప్రజా తీర్పుతో 'గౌరవ సభ'లో అడుగుపెట్టేలా చేయడంలో భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర కూడా కీలక పాత్ర పోషించిందని విశ్లేషకులు భావిస్తారు." దీనికి ముందు రెండు సంఘటనలు ఆసక్తికరంగా కనిపిస్తాయి.
1) 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కొడుకు నారా లోకేష్ కుప్పం నుంచి యువగళం యాత్ర చేపట్టారు. విజయవాడకు చేరుకుంది. గన్నవరం వద్ద జరిగిన సభలో నారా లోకేష్ ఘాటు హెచ్చరికలు చేశారు.
2) అసెంబ్లీలో తన తల్లిని అవమాన పరిచారు. సీబీఎస్ కంట కన్నీరు పెట్టించారు. అధికారంలోకి రాగానే వారిని వదలను. కొడాలి నానీ నిన్న కడ్రాయర్ తో రోడ్లలో నడిపించే బాధ్యత తీసుకుంటా అని నారా లోకేష్ తీవ్ర హెచ్చరిక చేశారు. అదే సమయంలో టీడీపీలో ఎమ్మెల్యేగా గాలిచి, వైసీపీకి అనుబంధంగా మారిన వల్లభనేని వంశీకి కూడా తీవ్ర హెచ్చరికలు చేశారు.

టీడీపీ కూటమి ఏర్పడ్డాక...

2024 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతే వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతి, అక్రమాలపై టీడీపీ కూటమి ఫోకస్ పెట్టింది.
2023లో గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి, వాహనాల దగ్ధం, విధ్వంసం సంఘటనలో వంశీని ప్రధాన నిందితుడిగా చేర్చారు. కిడ్నాప్, బెదిరింపులు, టీడీపీ ఆఫీసు దాడి కేసులో సాక్షిగా, ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, బెదిరించారనే తీవ్ర ఆరోపణలపై విజయవాడ వెస్ట్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న నారా లోకేష్, కక్ష్య సాధింపులకు పోలీసులను వాడుకుంటున్నారని కూడా వైసీపీ నేతలు ఆరోపించారు. ఇదిలా ఉంటే...

రాజకీయ ప్రకంపనలు

కుప్పంలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన నారా భువనేశ్వరి మంగళవారం మాట్లాడిన మాటలు ప్రతీ ఒక్కరి ఆలోచింపజేశాయి. మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఆసక్తికరమైన పోలిక తెచ్చారు..
"మహాభారతంలో ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఆమె మానాన్ని, గౌరవాన్ని కాపాడాడు. కానీ 2021లో శాసనసభలో నాకు, నా కుటుంబానికి అవమానం జరిగినప్పుడు ఆ కృష్ణుడు ప్రత్యక్షంగా రాలేదు. కానీ 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలంతా ఆ కృష్ణుడిలా మారి, ధర్మాన్ని గెలిపించి, మా కుటుంబానికి, మహిళా లోకానికి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించారు అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఎదుర్కొన్న ఘోర పరాజయాన్ని, తమపై జరిగిన అవమానానికి ప్రజలు ఇచ్చిన "న్యాయమైన తీర్పు"గా ఆమె అభివర్ణించారు.
"నేను ఎలాంటి వ్యక్తినో నా భర్తకు తెలుసు, ప్రజలకు తెలుసు. నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు" అని నారా భువనేశ్వరి వైసీపీ నేతల పేర్లు చెప్పకుండానే కౌంటర్ ఇచ్చారు. మహిళల క్యారెక్టర్‌ను కించపరిచే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
"మహాభారతంలో ద్రౌపదిని అవమానించినప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి కాపాడాడు. మాకు అసెంబ్లీలో అవమానం జరిగినప్పుడు ఆ దేవుడే ప్రజల రూపంలో వచ్చి 2024 ఎన్నికల్లో ధర్మాన్ని గెలిపించి, ఆదుకున్నాడు" అని పోల్చారు.
భర్తలను రాజకీయంగా ఎదుర్కొలేక, వారి భార్యలను లేదా ఇంట్లోని మహిళలను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత హేయమైన చర్య అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

మౌనం వీడిన భువనేశ్వరి

రాజకీయంగా అందరి మెదళ్లను తొలిచే విధంగా ఓ ప్రశ్నను జనంలోకి నారా భువనేశ్వరి వదిలారు. నాలుగేళ్ల తర్వాత భువనేశ్వరి ఈ అంశాన్ని ఇప్పుడు ఎందుకు లేవనెత్తారు? ఇది కేవలం వ్యక్తిగత భావోద్వేగమా? లేక రాజకీయ సందేశమా? విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది కేవలం ఒక ఆవేదన మాత్రమే కాదు; ఇందులో స్పష్టమైన రాజకీయ సందేశం ఉంది:
భువనేశ్వరి వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన సందేశం ఏమిటి? కుప్పం వేదికగా భువనేశ్వరి మాట్లాడిన మాటల్లో రాజకీయ పగ కంటే, మహిళా ఆత్మగౌరవ నినాదమే స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయాల కోసం కుటుంబ మహిళలను వాడుకోవద్దు. ప్రత్యర్థులను లేదా భర్తలను రాజకీయంగా దెబ్బతీయడానికి, ప్రజా జీవితంలో లేని వారి భార్యలు లేదా కుటుంబ మహిళలను లక్ష్యంగా చేసుకోవడం నీచ సంస్కృతి అని ఆమె హితవు పలికారు.
ఇదే సభలో ఆమె మరో మాట సూటిగా చెప్పారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సమర్థనీయం కాదు. ఆ హక్కు మీకు ఎవరు ఇచ్చారు. అని ప్రశ్నిస్తూనే, రాజకీయాల్లో మహిళలను కించపరిచే సంస్కృతికి స్వస్తి పలకాలనే బలమైన సందేశాన్ని ఇచ్చారు.
"రాజకీయాల్లో మహిళలను పగతీర్చుకునే ఆయుధాలుగా వాడుకోకూడదని చెప్పడం ద్వారా మహిళా లోకం మద్దతును మరింత బలోపేతం" చేసుకున్నారు.
హెరిటేజ్ బాధ్యతలు, ట్రస్ట్ సేవా కార్యక్రమాలకే పరిమితమైన భువనేశ్వరి, ఇప్పుడు ప్రజా సమస్యలపై, కుప్పం నియోజకవర్గ బాధ్యతలపై క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి 2021లో మొదలైన ఆ అవమానం.. నిజం గెలవాలి యాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి, 2024లో అపూర్వ విజయంతో క్లైమాక్స్‌కు చేరింది. భువనేశ్వరి చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం పాత జ్ఞాపకాల నెమరువేత కావు, భవిష్యత్తులో రాజకీయాల్లో మహిళల గౌరవానికి భంగం కలగకూడదనే ఒక హెచ్చరిక, అలాగే ధర్మం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకానికి నిదర్శనం!
"భవిష్యత్తులో అధికారంలో ఉన్నవారు లేదా ప్రతిపక్షాలు రాజకీయ పోరాటాల కోసం మహిళల జోలికి రాకూడదు" అనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. నారా భువనేశ్వరి గారి ఈ వ్యాఖ్యలపై, ప్రజా జీవితంలో మారుతున్న ఆమె పాత్రకు స్పష్టమైన సంకేతంగానే ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు.
Read More
Next Story