x
అదికారులతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లో పరిశీలిస్తున్న టీటీడీ ఈఓ ముద్దాడి రవిచంద్రు, పక్కన అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈసారి అంతర్జాతీయ వింత..

టీటీడీ చరిత్రలో మొదటిసారి తిరుమల మాడవీధుల్లో ఎన్ని దేశాల కళాకారుల ప్రదర్శనలు ఉంటాయో తెలుసా..?


Click the Play button to hear this message in audio format

ఈ ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అధిక మాసం కారణంగా ఈ ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమయ్య బ్రహ్మెత్సవాల్లో మరో ప్రత్యేక ఆకర్షణ ఉండబోతోంది. శ్రీవారి యాత్రికులకు విదేశీ కళారూపాలు కనువిందు చేయబోతున్నాయి.

తిరుమలలో బ్రహ్మోత్సవాల వేళ ఉభయ దేవేరులు శ్రీదేవి, భూదేవి సమేతంగా మాడవీధుల్లో పల్లకిపై విహరించే మలయప్ప వాహన సేవల ముందు టీటీడీ చరిత్రలో మొదటిసారి ఐదు దేశాలకు చెందిన కళాబృందాలు ప్రదర్శనలు యాత్రికులను కనువిందు చేయనున్నాయి.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈఓ ముద్దాడి రవిచంద్ర అన్నమయ్య భవన్ లో అధికారులతో సమీక్షించారు. ఇందులో అదనపు ఈఓ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈఓలు డాక్టర్ శరత్, ప్రభల గోపీనాథ్, అధికారులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్,ఎస్సీ ఎల్. సుబ్బారాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ తోపాటు ఆయా శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
"2026 సెప్టెంబర్ లో జరిగే మొదటి బ్రహ్మోత్సవంలో శ్రీవారి వాహన సేవ ముందు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం" అని టీటీడీ ఈఓ ముద్దాడి రవిచంద్ర మీడియాకు చెప్పారు. దేశంలోని 25 రాష్ట్రాల నుంచి 27 కళాబృందాలు పాల్గొంటాయని చెప్పిన ఆయన ఇందులో రెండు విదేశీ కళాబృందాలు కూడా ఉన్నాయని వెల్లడించారు.
టీటీడీ అధికారుల సమాచారం మేరకు ఐదు దేశాల కళాబృందాలు హాజరు కానున్నాయని తెలిసింది. తమ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా శ్రీవారికి నృత్య నీరాజనం సమర్పిస్తూ, లక్షలాది మంది యాత్రకులను ఆకట్టుకునే విధంగా కళాకారులను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా..

మొదటిసారి విదేశీ కళా ప్రదర్శనలు...

నేపాల్ కళారూపం : సంప్రదాయ నేపాలీ నృత్యంలో శంఖు ధ్వనులు, భజనలు ప్రదర్శించనున్నారని తెలిసింది. నేపాలీ కళాకారులు అక్కడి పశుపతినాథ్ ఆలయ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు.
ఇండోనేషియాలోని బాలి ప్రాంతం నుంచి వచ్చే కళాకారులు రామాయణం, మహాభారత ఇతిహాసాలు ప్రదర్శించనున్నారని సమాచారం. ఇందులో కేచక్ నృత్యం ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు సిద్దం చేశారని తెలిసింది.
శ్రీలంక కళారూపంలో కండ్యన్ నృత్యం కనువిందు చేయనుంది. దీనికి తోడు సాంప్రదాయ మంగళ వాయిద్యాలు ఉంటాయని తెలిసింది.
మలేషియా, సింగపూర్ కళాకారులు భరతనాట్యం, కూచిపూడి వంటి ప్రదర్శనలతో పాటు తమిళనాడులో సుప్రసిద్ధంగా కనిపించే కరగాట్టం, కావడి నృత్యాలు అలరించనున్నాయి. ఆ దేశాల్లో స్థిరపడిన భారతీయ, తమిళ సాంస్కృతిక బృందాలుశ్రీవారి సేవలో మొదటిసారి పాల్గొంటున్నట్లు సమాచారం
మారిషస్, ఫ్రాన్స్ కళారూపాలే ప్రత్యేకంగా ఉండబోతాయని టీటీడీ అధికారవర్గాల తెలిసిన సమాచారం. పశ్చిమ దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఇస్కాన్ బృందాలు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

10 లక్షల లడ్డూలు సిద్ధం చేయండి

శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఈఓ ముద్దాడి రవిచంద్ర మాట్టాడుతూ, ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ గా పెట్టుకోవాలని ప్రత్యేకంగా సూచించారు. సాధారణ రోజుల్లోనే నాలుగు లక్షలకు పైగానే శ్రీవారి లడ్డూ ప్రసాదాలు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఈఓ ప్రత్యేక సూచనలు చేశారు.
"యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ చర్యలు చేపట్టండి. నాణ్యతకు రాజీ పడకుండా రుచికరమైన అన్న ప్రసాదాలను తయారు చేసి భక్తులకు పంపిణీ చేయాలి" అని గుర్తు చేశారు. భక్తుల భద్రతకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ వాహనం రోజు ఎక్కువ మంది యాత్రికులకు దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈఓ రవిచంద్ర ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందుకు తగిన విధంగా ఆర్టీసీ బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేయాలన్నారు. స్వామివారికి నిస్వార్థంగా సేవలందించే శ్రీవారి సేవకులను గుర్తించి వారి సేవలను బ్రహ్మోత్సవాలకు వినియోగించుకోవాలని చెప్పారు.

ఆలయ పరిసరాల్లో పరిశీలన

అధికారులతో సమీక్ష అనంతరం ఈఓ రవిచంద్ర ఆలయ మాడవీధుల్లో ప్రత్యేకంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల అనంతరం టీటీడీ అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు.
"ఈ ఏడాది అధిక మాసం కారణంగా సెప్టెంబరులో సాలకట్ల, అక్టోబరులో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం. జిల్లా యంత్రాంగం, పోలీసు, టీటీడీ విభాగాల మధ్య సమన్వయంతో సమగ్ర ప్రణాళిక రూపొందించాం" అని వెంకయ్య చౌదరి చెప్పారు.
ఏటా తిరుమలకు పెరుగుతున్న భక్తుల సంఖ్య, ఇటీవల రథసప్తమి సందర్భంగా సుమారు 3.75 లక్షల మంది భక్తులు, 15 వేల వాహనాలు వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీపై ముందస్తు అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో భక్తుల రద్దీ, వాహన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఆరోగ్యం, పారిశుద్ధ్యం, అన్నప్రసాదం, ఘాట్‌రోడ్ల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించినట్లు వివరించారు.

గరుడసేవ రోజు ప్రత్యేక దృష్టి..

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు అధిక ప్రాధాన్యత ఉంది. ఈ ఒక్క రోజే తిరుమలకు కనీసంగా ఐదు లక్షల మంది యాత్రికులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ఉత్సవంతో సగం బ్రహ్మోత్సవం పూర్తయినట్టు భావిస్తారు.
"తిరుమల తోపాటు తిరుపతిలో భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం" అని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి చెప్పారు.
గత ఏడాది బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజు సుమారు 20 లక్షల ఫుడ్ పోర్షన్లు, వివిధ రకాల పానీయాలతో పాటు 15 రకాల మెనూలను భక్తులకు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈసారి రెండు బ్రహ్మోత్సవాల్లో కూడా అదే తరహాలో ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరిచారు.
"ఈ ఏడాది భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు వంటశాలల ఏర్పాటు, అవసరమైన నిత్యావసర సరుకుల సేకరణ, రవాణా ఏర్పాట్లు చేపట్టాం" అని ఆయన తెలిపారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విపత్తు, సంక్షోభ నిర్వహణ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటుపై చర్చించినట్లు తెలిపారు. పోలీసు శాఖ తరపున అవసరమైన సిబ్బంది నియామకం, వారికి వసతి, విధుల కేటాయింపుపై ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. టీటీడీ విజిలెన్స్ విభాగం, సీవీఎస్వో ఆధ్వర్యంలో గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని భద్రతా సిబ్బంది మోహరింపుపై నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు.
Read More
Next Story