ముద్రగడకు ఘన నివాళి.. కాపు రిజర్వేషన్ల సాధనే నిజమైన శ్రద్ధాంజలి
ధిక్కారమే ఊపిరిగా పోరాటమే శ్వాసగా సాగిన నేత ముద్రగడ!
కాపు ఉద్యమానికి చిరునామాగా, పోరాటానికి ప్రతీకగా నిలిచిన ముద్రగడ పద్మనాభం స్మారక సభ భావోద్వేగ వాతావరణంలో జరిగింది. రాజకీయ, సామాజిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ముద్రగడ లేని లోటు కాపు సమాజానికే కాదు, రాష్ట్ర రాజకీయాలకు కూడా తీరనిదని పలువురు అభిప్రాయపడ్డారు. కాపునాడు జంటనగరాల శాఖల ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ సమావేశానికి పలువురు హాజరై నివాళులు అర్పించారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రి, ఓసారి పార్లమెంటు సభ్యుడైన ముద్రగడ పద్మనాభం ఇటీవల కన్నుమూశారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందినవారు.
ఈ సంతాప సభలో కేంద్ర రక్షణ శాఖ మాజీ సహాయ మంత్రి పళ్లంరాజు, కాపునాడు నాయకులు కఠారి అప్పారావు, మారిశెట్టి మురళీ, ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ సమ్మెట నాగమల్లేశ్వరరావు, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ లీగల్ ఎడిటర్ ఎం. సాగర్ కుమార్, సీనియర్ జర్నలిస్టు తుపాకుల కొండబాబు, బీజేపీ నాయకుడు ఆలపాటి లక్ష్మీనారాయణ, యడ్ల నరసింహారావు, వైసీపీ నాయకుడు గంగా సురేష్ తదితరులు ముద్రగడకు శ్రద్ధాంజలి ఘటించారు.
సభలో మాట్లాడిన మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు, ముద్రగడ పద్మనాభం ఇంకా చాలా కాలం ప్రజల మధ్య ఉండాలని తాను ఆశించానని, ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. కాపు ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజులలో ఆయనతో తనకు జరిగిన సమావేశాలు ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉద్యమాలు జరుగుతున్న సమయంలో హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ముద్రగడతో జరిగిన చర్చలను ఆయన గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో రాజస్థాన్‌లో గుజ్జర్ ఉద్యమానికి జాతీయ మీడియా విస్తృత ప్రచారం లభించగా, ఆంధ్రప్రదేశ్‌లో కాపు ఉద్యమానికి అంతటి ప్రాధాన్యం దక్కలేదని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ విషయంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, అవసరమైతే మరోసారి పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ముద్రగడ ఉద్యమంతోనే కాపు విద్యార్థులకు ఉపకార వేతనాలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
ఏ ఉద్యమమైనా ప్రజల్లోకి వెళ్లాలంటే మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పళ్లంరాజు అన్నారు. ఒక జాతికి, ఒక సామాజిక వర్గానికి లేదా ఒక రాజకీయ ఉద్యమానికి మీడియా బలం అత్యంత అవసరమని, కాపు సమాజానికి ఆ బలం తక్కువగా ఉండేదనే అంశంపై ముద్రగడతో తాము చర్చించుకున్న సందర్భాలు గుర్తున్నాయని తెలిపారు.
స్థానికంగా జరిగే ఉద్యమాలు జాతీయ స్థాయిలో చర్చకు రావాలని ముద్రగడ భావించేవారని, రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు, దేశ రాజధానిలో కూడా ఆ ఉద్యమం ప్రతిధ్వనించాలని ఆయన కోరుకునేవారని చెప్పారు. ఉద్యమాన్ని ఎలా విస్తరించాలి, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలపై ముద్రగడ ఎంతో ఆలోచించేవారని పళ్లంరాజు పేర్కొన్నారు.
ముద్రగడ పద్మనాభం వ్యక్తిత్వంలో పోరాట స్ఫూర్తి, ఉద్యమ నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతాయని పలువురు వక్తలు కొనియాడారు. కాపు ఉద్యమ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
ముద్రగడ పోరాట వీరుడని కొనియాడుతూ కఠారి అప్పారావు చేసిన ప్రసంగం ఎందర్నో తమ గత స్మృతుల్ని జ్ఞప్తికి తెచ్చేలా చేసింది.
ఉద్యమం కోసం జీవితాంతం పోరాడిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభాన్ని స్మరించుకున్న పలువురు, ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. సభలో పాల్గొన్న వారంతా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ, ముద్రగడకు అశ్రునివాళి ఘటించారు.
Next Story

