అనంతలో వర్షాభావం:వానల కోసం పల్లెల్లో వీడని తరాల నమ్మకం
సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్:'శీతలాదేవి' అనుగ్రహం కోసం సాంస్కృతిక ఐక్యత
వేసవి పోయినా కరువు, వర్షాభావ పరిస్థితి వీడడం లేదు. సూపర్ ఎల్ నినో వీవ్ర ప్రభావంతో రుతుపవనాలు మందగించాయి. దేశంలో అత్యంత తక్కువ వర్షపాతం అనంతపురం జిల్లాలో గ్రామ దేవతలకు ప్రజలు పూజలు చేస్తున్నారు. వివిధ కులాలు, మతాల వారు కూడా తమ సంప్రదాయ పద్ధతుల్లో వరుణిడి కరుణ కోసం పూజలు చేస్తున్నారు.
శింగనమల పట్టణంలో గొర్రెల కాపరులు, మేకల పెంపకం సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని బొడ్రాయికి 108 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. ఇలా చేయడం వల్ల గ్రామదేవతలు శాంతించి, వర్షాలు కురిపిస్తారనేది ఓ విశ్వాసం. రాయలసీమ జిల్లాల్లో ఆలయాల్లో జలాభిషేకం నిర్వహించడం, కప్ప దేవర వంటి గ్రామోత్సవాలు వేసవిలో మాత్రమే నిర్వహిస్తుంటారు. అనంతపురం జిల్లాలో ఆ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది.
శింగనమల మండల కేంద్రంలో గ్రామ మధ్య ప్రతిష్టించిన బొడ్రాయికి గ్రామస్తులు గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. గ్రామ పండితులు సుబ్బ రంగయ్యస్వామి, పురోణితుడు ప్రవీణ్ స్వామి ఈ పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆత్మ రామాలయంలో పురోహితుడు లక్ష్మణరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బొడ్రాయి ఎందుకు?
పల్లెల్లో బొడ్రాయి ప్రతిష్ఠించడం వెనుక ఓ బలమైన విశ్వాసం, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది.
మానవశరీరానికి నాభి ఎలాంటి ప్రాణాధార శక్తి కేంద్రం. అలాగే గ్రామానికి మధ్య ప్రతిష్ఠించే రాయిని కూడా నాభి శిల అని పరిగణిస్తారు. కాలక్రమంలో అది బొడ్డురాయిగా రూపాంతరం చెంది. ఈ శిల ఏర్పాటు వెనుక గ్రామీణ కథ, నేపథ్యం కూడా ఉందంటున్నారు. గ్రామ రక్షణ దేవత శీతలాదేవి అమ్మవారి అనుగ్రహం ఉంటుందనేది గ్రామీణ ప్రజల్లో ఓ నమ్మకం. శీతల అంటే చల్లదనం అనేది అర్థం. గ్రామంలో వేడి, అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజల ప్రశాంతంగా, చల్లా ఉండాలని అమ్మవారి బీజాక్షరాలు యంత్రం రూపంలో బొడ్రాయి కింద నిక్షిప్తం చేయడం ఓ ఆచారం.
ఊరిలో పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, పశుసంపద కాపాడాలని సాధారణంగా బొడ్రాయికి పూజలు చేస్తుంటారు. ఇది ఓ రాయి మాత్రమే కాదు. జాతర సమయాల్లో అందరూ కలసి సంబరాలు చేసుకునేందుకు కూడా కేంద్ర బిందువుగా నిలుస్తుంది.
అందువల్లే.. "వర్షాలు కురవకుండా కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇలా పూజలు చేస్తాం" అని గొర్రెల పంపకందార్ల సంఘం నేతలు చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలకే కాకుండా, పశుసంపదకు కూడా నీటి ముప్పు లేకుండా కాపాడమని ప్రార్ధించామని చెప్పారు.
Next Story

